తొలియత్నం: మొదటి టైటిల్ ప్రేమ తొక్క తోలు
కలలు కనేవాళ్లు.. ఒక ఆశయాన్ని నమ్మేవాళ్లు
భవిష్యత్తును బలంగా విశ్వసించేవాళ్లు
అందుకోసం ధైర్యంగా ముందడుగు వేసేవాళ్లు...
ఎక్కడో ఏ మూలో సంచరిస్తున్నా
చేయవలసిన మహత్కార్యమేదో వారందరినీ ఒక దగ్గరికి చేరుస్తుంది. ఒక సామాజిక సృజనకు అగ్గి రాజేస్తుంది.
అలా వెండితెరపై ఒక అందమైన ప్రేమకథను వెలిగించిన క్షణాలు ఎలా మొదలయ్యాయో దర్శకురాలు నందినీరెడ్డి మాటల్లో...
నాకు మొదటి నుంచీ రొమాంటిక్ కామెడీలంటే చాలా ఇష్టం. ఒక ప్రేమికురాలిగా నేను రొమాంటిక్ కామెడీలను చాలా ఎంజాయ్ చేస్తాను. అవి ఒత్తిడి నుంచి బయటపడేసి, మనసును ఆహ్లాదపరుస్తాయి. నేను చేసే సినిమా కూడా అలాగే ఉండాలనుకునేదాన్ని. అలా ఆలోచిస్తున్నప్పుడు, మనసులో ఒక ఐడియా తళుక్కుమంది. ఒక సంక్లిష్ట సన్నివేశంలో అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు తారసపడతారు. ఒకమ్మాయి, అబ్బాయి రొటీన్‌గా కలుసుకునే పరిస్థితుల కన్నా ఇది చాలా భిన్నంగా ఉందని భావించాను. ఈ ఆలోచనల క్రమం నన్ను వెంటాడుతున్నప్పుడు నా ఫ్రెండ్, తమిళ సినిమా ‘వెప్పమ్’ డెరైక్టర్ అంజనా అలీఖాన్‌తో తరచూ మాట్లాడేదాన్ని.
మా ఇద్దరి చర్చా ఫలితమే ‘అలా మొదలైంది’ మూలకథ. కథపై ఒక స్పష్టత వచ్చాక, ఓ పది నిమిషాల పాటు నానికి న్యారేషన్ ఇచ్చాను. వింటున్నప్పుడు తను చాలా ఉద్వేగానికి లోనయ్యారు. సినిమాకు ప్రేమ తొక్క తోలు అనే టైటిల్ అనుకున్నాం. తరువాత నాకున్న బద్దకం కారణంగా, స్క్రిప్ట్ రాయడం ఆలస్యమవుతూ వచ్చింది. అంజన స్క్రిప్ట్ పూర్తి చేయడానికి నాకు పది రోజుల గడువు పెట్టింది. దాంతో ఇక రాయక తప్పలేదు. కాగితాలు ముందు పెట్టుకొని కూర్చున్నప్పుడు, నా అనుభవంలోకి వచ్చిన మనుషులు, మనస్తత్వాలు, పరిస్థితులు కథలోకి అందంగా ఒదిగిపోయాయి. అదే సమయంలో వెన్ హ్యారీ మెట్ సాల్లీ, ఎ లాట్ లైక్ లవ్ సినిమాలు అదే పనిగా చూశాను. అన్ని ఆలోచనలు, ఊహలు కలబోసి అరవై సీన్లతో కూడిన స్క్రిప్ట్ రెడీ చేశాను. క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్లు మళ్లీ ఒక పెళ్లిలో కలవడం, ఒక అందమైన సంభాషణతో సినిమాను ముగించడం బావుంటుందనుకున్నాను. అయితే ప్రేక్షకుల ఊహకు భిన్నంగా ప్రియదర్శన్ తరహా కన్ఫ్యూజన్ క్లైమాక్స్‌కు బాగుంటుందని మార్పులు చేశాను.
స్క్రిప్ట్ పూర్తయిన తరువాత ఇంకేదో అసంతృప్తి నన్ను వేధించడం మొదలుపెట్టింది. ఒక విభిన్నమైన పాత్రను సృష్టించి, కథకు మరింత బలం తీసుకురావాలనిపించింది. ‘ఇన్ జులై’ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు ఒకదానికొకటి తప్పుగా అన్వయించుకునే పరిస్థితులు ఫన్ క్రియేట్ చేస్తాయి. ఆ స్ఫూర్తితో ‘జాన్ అబ్రహామ్’ పాత్రను క్రియేట్ చేశాను. జాన్ అబ్రహామ్ ప్రొఫెషనల్ కిడ్నాపర్ అయినా, అతనిలోని హ్యూమర్ యాంగిల్‌తో హ్యూమర్‌ను పండించాలనుకున్నాను. ప్రేక్షకుల మనసులో చెలరేగే ప్రశ్నలను వాళ్ల తరపున నానిని అడగటానికి జాన్ అబ్రహామ్ పాత్రను వాడుకున్నాను. ఈ పాత్రను నేను చాలా ప్రేమించాను. కానీ మా టీమ్ మాత్రం ఈ పాత్ర పట్ల కన్విన్స్ అవలేదు. దాంతో ఆ పాత్రను తాత్కాలికంగా పక్కన పెట్టేశాను. సినిమా మూడు షెడ్యూల్స్ అయ్యాక, నా ఫ్రెండ్, సినిమాల్లో కో-డెరైక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ సెట్స్‌కు వచ్చాడు. నేను అతనికి జాన్ అబ్రహామ్ పాత్ర గురించి చెప్తున్నప్పుడు, కన్విన్స్ అయి, ప్రొడ్యూసర్‌ను ఒప్పించాడు.
ఈ క్యారెక్టర్ ఆశిష్ విద్యార్థి చేస్తే బాగుంటుందని అనుకున్నా. అయితే ప్రకాశ్‌రాజ్‌తో నాకున్న పరిచయం వల్ల, ఈ పాత్ర గురించి చెప్పా. ఆయనకు బాగా నచ్చింది కానీ, తను దాదాపు అలాంటి పాత్రే ‘ఆరెంజ్’ సినిమాలో చేస్తున్నానని చెప్పాడు. అప్పుడు ఆశిష్ విద్యార్థికి తన క్యారెక్టర్ న్యారేట్ చేశాను. అతనికి బాగా నచ్చి, తన రెమ్యూనరేషన్ చెప్పాడు. కానీ అది మా బడ్జెట్‌కు మించిన వ్యవహారం. కొన్ని రోజుల తరువాత ఆశిష్ విద్యార్థి మాకు ఫోన్ చేసి, మా కోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధమయ్యానని చెప్పాడు. ‘ఐస్ ఏజ్’ సినిమాలో ఫ్క్రాట్ పాత్ర నాకు చాలా నచ్చింది. అది కథలో భాగం కాకపోయినా, పరిస్థితుల్ని అయోమయంలోకి నెట్టేసి, విపరీతమైన హాస్యాన్ని కురిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్ ఒకటి ఈ కథలో రాయాలనుకున్నాను. అదే సమయంలో ఈ కథలో రెసిషన్‌లో ఉద్యోగం కోల్పోయిన పాత్ర ఉండాలన్నారు. రచయిత భూపాల్ కథలో ఒక తాగుబోతు పాత్ర ఉండాలన్నారు. ఆ పాత్రకు రమేశ్ బాగుంటాడని చెప్పాడు.
క్లైమాక్స్‌లో జాన్ అబ్రహామ్కు భార్య నుంచి ఫోన్ వస్తుంది. ఆ భార్య పేరు చాలా ఫన్నీగా ఉండాలని అందుకోసం వెతుకుతున్నాం. అప్పుడు ఆశిష్ విద్యార్థి కపిలేశ్వరమ్మ అని పేరు చెప్పారు. సినిమా విడుదలయ్యాక, ఫేస్బుక్లో ఒకరు తమ కుక్కకు కపిలేశ్వరమ్మ అని పేరు పెట్టామని నాకు పోస్ట్ చేశారు.
సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఆశిష్‌తో కొంత షూట్ బ్యాలన్స్ ఉంది. తనతో షూట్ చేయాల్సిన రోజు ముందు రాత్రి నుంచీ విపరీతంగా వర్షం. మరుసటిరోజు తను యూఎస్ వెళ్లాలి. దాదాపు రెండు నెలల వరకు తను తిరిగి ఇండియాకు వచ్చే పరిస్థితి లేదు. ఉదయం నాలుగున్నరకు లేచి చూస్తే వర్షం ఏమాత్రం తగ్గలేదు. ఏడున్నర సమయంలో పెట్రోల్ బంక్‌లో ఫ్రెండ్స్ అంతా కలిసే సీన్ షూట్ చేశాను. ఆ సీన్ అవగానే, వర్షం తగ్గిపోయింది. అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. కానీ అంతలోనే మరో టెన్షన్. నాని, ఆశిష్ విద్యార్థిల సీన్ తీస్తున్నప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి నెగెటివ్ ఒక క్లాన్ మాత్రమే ఉందని చెప్పాడు.
అంటే నాలుగు వందల ఫీట్ ఫిలింతో ఆ సీన్ పూర్తి చేయాలి. ఇద్దరి డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ తీసుకోవాలి. కానీ ఫిలిం సరిపోయేలా లేదు. ముందు ఆశిష్ విద్యార్థి డైలాగ్స్ ఫినిష్ చేద్దామనుకున్నాం. అప్పుడు నాని, ఆశిష్ విద్యార్థి మొత్తం డైలాగ్స్ అవసరం లేదు, తను మధ్యమధ్యలో మాట్లాడితే చాలు. నేను ఒకేసారి డైలాగ్స్ చెప్పేస్తానని అన్నాడు. కంటిన్యూస్‌గా కెమెరా రోల్ అవుతూనే ఉంది. నాని డైలాగ్స్ చెబుతుండగా, సడన్‌గా రీల్ అయిపోయింది. నేననుకున్నది మొత్తం వచ్చిందో లేదోనని ఎడిట్ రూమ్‌కు వెళ్లేవరకు ఒకటే టెన్షన్. అలా ఎన్నో ఒడిదుడుకులతో షూటింగ్ పూర్తయింది.
నిత్యామీనన్, రోహిణి, స్నేహ ఉల్లాల్... ఆర్టిస్టులందరూ ఇది మాది అనుకుని సహకరించారు కాబట్టే, సినిమా సజావుగా జరిగింది. నాని అందించిన సహకారం స్నేహితురాలిగా ఎప్పటికీ మరిచిపోలేను. క్లైమాక్స్‌లో నాని నిత్యకు తన ప్రేమను చెప్పేటప్పుడు రాసిన డైలాగ్‌లు తనవే. చాలా న్యాచురల్‌గా వచ్చాయి. అసలు క్లైమాక్స్ సీన్లో అన్ని పాత్రలను హ్యాండిల్ చేయడానికి నేను ఇబ్బంది పడినప్పుడు రచయిత అనిల్ రావిపూడి నాకు వెన్నుదన్నుగా నిలిచారు.
ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కారణం పాత్రల సహజత్వమే. నాని ముందుగానే తెలుసు కాబట్టి తన బాడీ ల్యాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పాత్రను డిజైన్ చేశాను. నిత్య పరిచయమైన తరువాత తన ఆలోచనలు, హావభావాలు దృష్టిలో ఉంచుకుని పాత్రలో ముప్ఫై శాతం మార్పులు చేశాను. నాని, నిత్యల మధ్య వాదనలు జరిగినప్పుడు వాళ్ల నిజ జీవితంలో ఎదురైన పరిస్థితులకు దగ్గరగా ప్రవర్తించారు. అలా సినిమా అంతా పాత్రలు తమ అసలు స్వభావంతోనే ప్రవర్తిస్తాయి. అది కూడా సినిమాను బలోపేతం చేయడంలో తోడ్పడింది.
ఈ సినిమాకు సంబంధించి, చివరగా మొదటగా చెప్పుకోవలసింది ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గురించి. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఫైనాన్షియర్స్ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆయన వెనక్కు తగ్గలేదు. ‘అలా మొదలైంది’ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు, టైటిల్ క్యాచీగా లేదని డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ఒత్తిడి చేసినా, అంతిమంగా ఆయన నా అభిప్రాయానికే విలువిచ్చారు. టైటిల్ సజెస్ట్ చేసినందుకు సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్‌కు థ్యాంక్స్ చెప్పాలి. తరానికీ తరానికీ విలువలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈ విలువల్లో వచ్చిన మార్పులు, సంబంధాల్లో వచ్చిన తేడాల్ని ఈ చిత్రంలో చెప్పాలనుకున్నాను. అందులో చాలావరకు సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. ఈ విజయం ఆ సినిమాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరిదీ.
-కె.క్రాంతికుమార్‌రెడ్డి