annadhanam
-
అక్కడే నిర్మించండి..
టీటీడీ సత్రం స్థలంలోనే అన్నదాన భవనం నిర్మించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆదేశం దేవస్థానంలోని పలు నిర్మాణాలపై లిఖితపూర్వక ఆదేశాలు జారీ అన్నవరం(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో రూ.పది కోట్ల వ్యయంతో అన్నదాన భవనాన్ని పాత టీటీడీ సత్రం స్థలంలోనే నిర్మించాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేవస్థానంలో భక్తులకు సీఆర్ఓ భవనం దిగువన ఉన్న హాలులో అన్నదానం చేస్తున్నారు. నూతన భవన నిర్మాణ కోసం కొత్త సెంటినరీ సత్రం లోని 48 గదుల బ్లాక్‌ను కూల్చాలని మూడేళ్ల క్రితం కమిషనర్ ఆదేశాలివ్వడంతో దీనిని అందరూ వ్యతిరేకించారు. అయితే ఈ విషయానికి బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ ముగింపు పలికారు. ఈ నెల ఎనిమిదో తేదీన అన్నవరం దేవస్థానంలో పర్యటించిన జేఎస్వీ ప్రసాద్ పలు నిర్మాణాలు తిలకించడంతో పాటు వివిధ అంశాలపై అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన దేవస్థానం అధికారులకు బుధవారం లిఖిత పూర్వకంగా పలు ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి 1500 మందికి భోజనం పెట్టేలా.. సెంటినరీ కాటేజీ కూల్చకుండా ఖాళీగా ఉన్న టీటీడీ సత్రం స్థలంలోనే అన్నదాన భవనం నిర్మించాలని, స్థలం చాలకపోతే పక్కనే ఉన్న సబ్‌క్యాంటీన్ స్థలాన్ని కలుపుకొని నిర్మించాలని ఆదేశించారు. ఒకేసారి 1,500 మందికి భోజనం పెట్టేలా మూడంతస్తులలో భవనం నిర్మించాలని, దానికి గాను గతంలో రూపొందించిన ప్లాన్‌ను రివైజ్ చేసి ‘ జీ ప్లస్ టూ’ భవనం నిర్మించాలని సూచించారు. భవన నిర్మాణం డిజైన్ చేసే ముందు శ్రీశైలం దేవస్థానం, ద్వారకాతిరుమల, సింహాచలం దేవస్థానాల్లోని అన్నదాన భవనాలను పరిశీలించాలని ఆదేశించారు. చెందుర్తిలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ దేవస్థానానికి చెందుర్తి గ్రామంలో ఉన్న 135 ఎకరాల స్ధలంలో 1.5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యాగశాలకూ ఓకే : దేవస్థానంలో యాగశాల నిర్మాణానికీ ఆయన లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. వీలైనంత త్వరగా ఈ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. వేదపాఠశాలలో అదనపు నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్ : సత్యగిరిపై నిర్మిస్తున్న స్మార్త, ఆగమ, వేద పాఠశాల లో ప్రస్తుతం నిర్మిస్తున్న నిర్మాణాలతో పాటు అదనంగా రెండు స్టాఫ్ క్వార్టర్స్‌ను నిర్మించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఆదేశించారు. ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం: ఇన్‌ఛార్జి ఈఓ దేవస్థానంలో వివిధ నిర్మాణాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఇచ్చిన ఆదేశాలపై తగు చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు బుధవారం తెలిపారు. వీటిని దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి తగిన అనుమతులు పొందాల్సి ఉందన్నారు. అన్నదానభవన నిర్మాణం కోసం ఇటీవల ప్రముఖ దేవస్థానాల్లో నిర్మించిన అన్నదాన భవనాలను పరిశీలించమని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. -
అన్నదాన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
రంగాపూర్(పెబ్బేరు):కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీ అన్నారు. శనివారం మండలంలోని రంగాపూర్ పుష్కరఘాట్ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమ పనులను ఆయన పరిశీలించారు. పుష్కర యాత్రికులకు అన్నదానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విషయాలను ఆయన స్థానిక నాయకులకు వివరించారు. వంట షెడ్డుతో పాటు, భోజనశాల తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించి తగు సూచనలను చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు బుచ్చయ్య శెట్టి, నాయకులు బాలీశ్వరయ్య, హరినాథ్, జయప్రకాశ్ శెట్టి, రవి, సతీష్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
వరసిద్ధునికి రూ.2లక్షల విరాళం
ఐరాల : కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారికి మంగళవారం ఓ భక్తుడు రూ.2,00,116 విరాళంగా అందజేశారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష, స్వామి వారి సేవలకు 1,00,116 రూపాయలను గుంటూరుకు చెందిన మణికంఠ డీడీ రూపంలో ఏఈఓ కేశవరావుకు ఈ విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాలతో స్వామి వారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలో వేదపండితుల ఆశీర్వచనం పలికి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పలువురు పాల్గొన్నారు. వినాయకుని సన్నిధిలో కన్నా లక్ష్మీనారాయణ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామిని మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. స్వామి వారి ప్రత్యేక దర్శనం, వేదపండితులు ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు.