అక్కడే నిర్మించండి.. | ttd satram place annadhanam building | Sakshi
Sakshi News home page

అక్కడే నిర్మించండి..

Published Wed, Jun 21 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

అక్కడే నిర్మించండి..

అక్కడే నిర్మించండి..

టీటీడీ సత్రం స్థలంలోనే అన్నదాన భవనం నిర్మించాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రసాద్‌ ఆదేశం
దేవస్థానంలోని పలు నిర్మాణాలపై లిఖితపూర్వక ఆదేశాలు జారీ  
అన్నవరం(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో రూ.పది కోట్ల వ్యయంతో అన్నదాన భవనాన్ని పాత టీటీడీ సత్రం స్థలంలోనే నిర్మించాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్‌ దేవస్థానం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేవస్థానంలో భక్తులకు సీఆర్‌ఓ భవనం దిగువన ఉన్న హాలులో అన్నదానం చేస్తున్నారు. నూతన భవన నిర్మాణ కోసం కొత్త సెంటినరీ సత్రం లోని 48 గదుల బ్లాక్‌ను కూల్చాలని మూడేళ్ల క్రితం కమిషనర్‌ ఆదేశాలివ్వడంతో దీనిని అందరూ వ్యతిరేకించారు. అయితే ఈ విషయానికి బుధవారం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముగింపు పలికారు. ఈ నెల ఎనిమిదో తేదీన అన్నవరం దేవస్థానంలో పర్యటించిన జేఎస్‌వీ ప్రసాద్‌ పలు నిర్మాణాలు తిలకించడంతో పాటు వివిధ  అంశాలపై అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన దేవస్థానం అధికారులకు బుధవారం లిఖిత పూర్వకంగా పలు ఆదేశాలు జారీ చేశారు.
ఒకేసారి 1500 మందికి భోజనం పెట్టేలా..
సెంటినరీ కాటేజీ కూల్చకుండా ఖాళీగా ఉన్న టీటీడీ సత్రం స్థలంలోనే అన్నదాన భవనం నిర్మించాలని, స్థలం చాలకపోతే పక్కనే ఉన్న సబ్‌క్యాంటీన్‌ స్థలాన్ని కలుపుకొని నిర్మించాలని ఆదేశించారు. ఒకేసారి 1,500 మందికి భోజనం పెట్టేలా మూడంతస్తులలో భవనం నిర్మించాలని, దానికి గాను గతంలో రూపొందించిన ప్లాన్‌ను రివైజ్‌ చేసి ‘ జీ ప్లస్‌ టూ’ భవనం నిర్మించాలని సూచించారు. భవన నిర్మాణం డిజైన్‌ చేసే ముందు శ్రీశైలం దేవస్థానం, ద్వారకాతిరుమల, సింహాచలం దేవస్థానాల్లోని అన్నదాన భవనాలను పరిశీలించాలని ఆదేశించారు. 
చెందుర్తిలో సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌
దేవస్థానానికి చెందుర్తి గ్రామంలో ఉన్న 135 ఎకరాల స్ధలంలో 1.5 మెగావాట్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 
యాగశాలకూ ఓకే : దేవస్థానంలో యాగశాల నిర్మాణానికీ ఆయన లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. వీలైనంత త్వరగా ఈ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు.
వేదపాఠశాలలో అదనపు నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్‌ : సత్యగిరిపై నిర్మిస్తున్న స్మార్త, ఆగమ, వేద పాఠశాల లో ప్రస్తుతం నిర్మిస్తున్న నిర్మాణాలతో పాటు అదనంగా రెండు స్టాఫ్‌ క్వార్టర్స్‌ను నిర్మించాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్‌ ఆదేశించారు. 
ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం: ఇన్‌ఛార్జి ఈఓ
దేవస్థానంలో వివిధ నిర్మాణాలపై ప్రిన్సిపల్‌ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్‌ ఇచ్చిన ఆదేశాలపై తగు చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు బుధవారం తెలిపారు. వీటిని దేవాదాయశాఖ కమిషనర్‌  దృష్టికి తీసుకువెళ్లి తగిన అనుమతులు పొందాల్సి ఉందన్నారు. అన్నదానభవన నిర్మాణం కోసం ఇటీవల ప్రముఖ దేవస్థానాల్లో నిర్మించిన అన్నదాన భవనాలను పరిశీలించమని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement