satram
-
200 కోట్లతో అధునాతన కర్ణాటక సత్రం
సాక్షి, చిత్తూరు : కర్ణాటక సత్రాల నూతన సముదాయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. దాదాపు 200కోట్ల రూపాయలతో ఓ అధునాతన కర్ణాటక సత్రం రూపుదిద్దుకోనుంది. 7 ఎకరాల్లో ఐదు కాంప్లెక్స్‌లు, రోజుకు 1800 మంది భక్తులకు వసతి కల్పించేలా వాటి నిర్మాణం జరగనుంది. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన నిధులతో టీటీడీ ఈ భవనాలను నిర్మించనుంది. (సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు) కాగా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కరోనా నేపథ్యంలో లోక కళ్యాణార్ధం టీటీడీ గత మార్చి నెలనుంచి నిర్వహిస్తోన్న ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం కర్ణాటక నుంచి వచ్చే భక్తుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం సత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి తిరుమలలో జరిగిన భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో @AndhraPradeshCM @ysjagan గారు మరియు @CMofKarnataka @BSYBJP గారు పాల్గొన్నారు. pic.twitter.com/DIG4fmiPZu — Y V Subba Reddy (@yvsubbareddymp) September 24, 2020 -
అవును.. ఆయనేం పట్టించుకోరు..!
సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): ఎన్నికల సమయంలో కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతున్న ఎమ్మెల్యే స్వామి.. ఈ ఐదేళ్లలో ఆయన దగ్గరకు వచ్చిన ఏ సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవు. సమస్యను పరిష్కరించాలని ఆయన చుట్టూ ప్రదిక్షణలు చేసినా ఫలితం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితారామయ్య శ్రేష్టి సత్రంపై అంతులేని నిర్లక్ష్యం.. సింగరాయకొండలో అయితారామయ్య శ్రేష్టి అనే ఆర్యవైశ్యుడు యాత్రికుల కోసం పట్టణ నడిబొడ్డులో సుమారు 1.50 ఎకరా స్థలంలో సత్రం, వ్యాపార సముదాయాన్ని నిర్మించి వాటిపై వచ్చే ఆదాయంతో యాత్రికులకు వసతులు కల్పించే ఏర్పాటు చేశాడు. తరువాత ఈ సత్రం ఎండోమెంటు శాఖ పరమైంది. సత్రం స్థలంలో ఉన్న దుకాణదారులకు, ఎండోమెంట్ శాఖకు మధ్య అద్దె విషయంలో వివాదం చెలరేగింది. దీంతో ఎండోమెంట్ శాఖ 2013 ఏప్రిల్‌లో సత్రం స్థలంలోని వ్యాపార సముదాయాన్ని కూల్చేశారు. అప్పటివరకు వ్యాపార కూడలికి నిలయంగా మారిన ఆ సత్రం ప్రస్తుతం మల మూత్ర విసర్జనకు నిలయంగా మారింది. దీంతో ఏటా లక్షలాది రూపాయలను అద్దెల రూపంలో నష్టపోతున్నారు. ఈ సత్రం విషయమై న్యాయం చేయాలని ఆర్యవైశ్యులు కాళ్లు అరిగేటట్లు తిరగ్గా న్యాయం చేస్తానన్న ఎమ్మెల్యే ఐదేళ్లు కాలయాపన చేశారు. గతంలో ఈ సత్రం స్థలంలో 42 దుకాణాలు ఉండగా మరో 24 దుకాణాలకు 2013 సంవత్సరం వేలం పాటలు నిర్వహించారు. తరువాత వివాదం కారణంగా వేలంపాటలు రద్దయ్యాయి. సత్రం శిథిలావస్థకు చేరిందన్న నెపంతో అందులోని షాపులను దేవాదాయ శాఖ అధికారులు కూల్చేశారు. అయితే దుకాణదారులు 24 మంది తరువాత మాకు న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. వీరికి న్యాయం చేస్తారన్న ఆశతో ఆర్యవైశ్యులు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఐదేళ్లు గడిచినా ఎటువంటి ప్రయోజనం లేదు. పెరిగిన షాపుల బాడుగలు.. సత్రం స్థలంలోని వ్యాపారసముదాయాన్ని కూల్చేయడంతో గ్రామంలో షాపులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో అప్పటి వరకు రూ.3 వేలు ఉన్న షాపుల అద్దెలు ఒక్కసారిగా రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగాయి. దీనికితోడు సత్రం స్థలం ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందన్న సాకుతో సుమారు 9 నెలల క్రితం సత్రం స్థలం చుట్టూ సుమారు రూ.30 వేల అంచనా వ్యయంతో దేవస్థాన అధికారులు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. లక్షలాది రూపాయలు నష్టపోతున్న దేవాదాయశాఖ.. గ్రామ నడిబొడ్డున ఉన్న ఈ సత్రానికి ఒక పరిష్కారం చూపించి అందులో దుకాణాలు నిర్మిస్తే దేవాదాయశాఖకు ఇప్పటి వరకు షాపుకు సరాసరి 6 వేల రూపాయలు అద్దె వచ్చినా సుమారు రూ.2.60 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సత్రం స్థలంలో దుకాణాలు నిర్మించినట్లయితే అటు దేవాదాయశాఖకు ఇటు ప్రజలకు ఉపాధి లభించేదని, కానీ ప్రస్తుతం రెంటికి చెడ్డ రేవడిగా ఎవరికి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మారాయని ప్రజలు అటు దేవాదాయశాఖ, ఇటు నాయకుల పనితీరును విమర్శిస్తున్నారు. అడ్డగోలుగా అన్నా క్యాంటీన్ నిర్మాణం.. కందుకూరు రోడ్డు సెంటర్లో విలువైన స్థలాలను ఆర్యవైశ్యులు కొనుగోలు చేశారు. వారు తమ స్థలంలో షాపులు నిర్మించుకుంటున్నారు. ఈ స్థలం ముందు ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలం ఉంది. ఈ స్థలంలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. దీనిపై ఆర్యవైశ్యులు ఎంత వేడుకున్నా ప్రయోజనం లేదు. చివరికి ఎన్నికల తేది ప్రకటించడంతో తాత్కాలికంగా అన్నా క్యాంటిన్ నిర్మాణం ఆపేశారు. పార్కును కూల్చేశారు.. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఉన్న పంచాయతీ స్థలంలో శికాకొల్లు సుబ్బారావు అనే పారిశ్రామికవేత్త ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్కును నిర్మించాడు. తరువాత ఈ పార్కును తొలగించి అందులో షాపులు నిర్మిద్దామని ఎమ్మెల్యే స్వామిపై పంచాయతీ అధికారులు ఒత్తిడి తెచ్చారు. కానీ మొదట్లో ససేమిరా అన్నాడు. తరువాత ఏమైందో ఏమో గానీ రోడ్ల అభివృద్ధి పేరుతో పార్కును తొలగించి ఆ స్థలంలో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు సైకిల్ స్టాండు నిర్మించారు. ఈ పార్కు వల్ల బాటసారులకు ఉపయోగంగా ఉండటమే కాక పండగ సమయంలో ఆర్యవైశ్యులు ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగంగా ఉండేది. మండలంలో రూర్బన్ నిధులతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పార్కులు నిర్మిస్తుండగా ఈ విధంగా దాతల సహాయంతో నిర్మించిన పార్కును పడగొట్టడమేందని ప్రశ్నిస్తున్నారు. -
అక్కడే నిర్మించండి..
టీటీడీ సత్రం స్థలంలోనే అన్నదాన భవనం నిర్మించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆదేశం దేవస్థానంలోని పలు నిర్మాణాలపై లిఖితపూర్వక ఆదేశాలు జారీ అన్నవరం(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో రూ.పది కోట్ల వ్యయంతో అన్నదాన భవనాన్ని పాత టీటీడీ సత్రం స్థలంలోనే నిర్మించాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేవస్థానంలో భక్తులకు సీఆర్ఓ భవనం దిగువన ఉన్న హాలులో అన్నదానం చేస్తున్నారు. నూతన భవన నిర్మాణ కోసం కొత్త సెంటినరీ సత్రం లోని 48 గదుల బ్లాక్‌ను కూల్చాలని మూడేళ్ల క్రితం కమిషనర్ ఆదేశాలివ్వడంతో దీనిని అందరూ వ్యతిరేకించారు. అయితే ఈ విషయానికి బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ ముగింపు పలికారు. ఈ నెల ఎనిమిదో తేదీన అన్నవరం దేవస్థానంలో పర్యటించిన జేఎస్వీ ప్రసాద్ పలు నిర్మాణాలు తిలకించడంతో పాటు వివిధ అంశాలపై అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన దేవస్థానం అధికారులకు బుధవారం లిఖిత పూర్వకంగా పలు ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి 1500 మందికి భోజనం పెట్టేలా.. సెంటినరీ కాటేజీ కూల్చకుండా ఖాళీగా ఉన్న టీటీడీ సత్రం స్థలంలోనే అన్నదాన భవనం నిర్మించాలని, స్థలం చాలకపోతే పక్కనే ఉన్న సబ్‌క్యాంటీన్ స్థలాన్ని కలుపుకొని నిర్మించాలని ఆదేశించారు. ఒకేసారి 1,500 మందికి భోజనం పెట్టేలా మూడంతస్తులలో భవనం నిర్మించాలని, దానికి గాను గతంలో రూపొందించిన ప్లాన్‌ను రివైజ్ చేసి ‘ జీ ప్లస్ టూ’ భవనం నిర్మించాలని సూచించారు. భవన నిర్మాణం డిజైన్ చేసే ముందు శ్రీశైలం దేవస్థానం, ద్వారకాతిరుమల, సింహాచలం దేవస్థానాల్లోని అన్నదాన భవనాలను పరిశీలించాలని ఆదేశించారు. చెందుర్తిలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ దేవస్థానానికి చెందుర్తి గ్రామంలో ఉన్న 135 ఎకరాల స్ధలంలో 1.5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యాగశాలకూ ఓకే : దేవస్థానంలో యాగశాల నిర్మాణానికీ ఆయన లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. వీలైనంత త్వరగా ఈ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. వేదపాఠశాలలో అదనపు నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్ : సత్యగిరిపై నిర్మిస్తున్న స్మార్త, ఆగమ, వేద పాఠశాల లో ప్రస్తుతం నిర్మిస్తున్న నిర్మాణాలతో పాటు అదనంగా రెండు స్టాఫ్ క్వార్టర్స్‌ను నిర్మించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఆదేశించారు. ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం: ఇన్‌ఛార్జి ఈఓ దేవస్థానంలో వివిధ నిర్మాణాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఇచ్చిన ఆదేశాలపై తగు చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు బుధవారం తెలిపారు. వీటిని దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి తగిన అనుమతులు పొందాల్సి ఉందన్నారు. అన్నదానభవన నిర్మాణం కోసం ఇటీవల ప్రముఖ దేవస్థానాల్లో నిర్మించిన అన్నదాన భవనాలను పరిశీలించమని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. -
నాణ్యతా ప్రమాణాకు తిలోదకాలు
వెంకన్న అన్నదాన సత్రం నిర్మాణంలో అవినీతి బీటలు వారుతున్న పునాదులు వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్మాణంలో ఉన్న అన్నదాన సత్రం పునాదులు బీటలు వారుతున్నాయి. సుమారు రూ.80 లక్షలతో చేపట్టిన భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు భవన నిర్మాణం పర్యవేక్షణ చేపట్టకపోవడంతో ఽపనులు నాశిరకంగా జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. దానికితోడు బినామీ కాంట్రాక్టర్లకు అనుభవం లేకపోవడంతోనే పనులు లోపభూయిష్టంగా జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ 2016లో భవన నిర్మాణానికి సుమారు రూ.80 లక్షలు మంజూరు చేసింది. అయితే ఆ పనులపై కన్నెసిన గ్రామానికి చెందిన నలుగురు పచ్చచొక్క నేతలు బినామి పేరుతో పనులు సొంతం చేసుకున్నారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. నాశిరకం మెటీరియల్ వాడకం, పునాదిలో ఇసుక ఫిలింగ్ సమయంలో చౌడు మట్టి వాడటం, క్యూరింగ్ నిబంధనలు పాటించక పోవడంతో భవనం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు ప్రారంభమై ఏడాది పూర్తి కావస్తున్నా నేటికీ పూర్తికాకపోవడంపై పలువురు భక్తులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులు మండుటెండల్లో స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. -
దేవస్థానం సత్రాల లీజుకు వేలంపాట
అన్నవరం : అన్నవరం దేవస్థానానికి కొండ దిగువన పాత బస్టాండ్ సమీపంలో గల పంపా సత్రం (పంపా ఎమినిటీస్ సెంటర్), కిర్లంపూడి, శంఖవరం గ్రామాల్లోనిS సత్యదేవ కల్యాణ మండపాలను ప్రవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు బుధవారం సాయంత్రం టెండర్ కం వేలం నిర్వహించి ఖరారు చేశారు. పంపా సత్రం మూడేళ్లకు లీజు : అన్నవరంలోని పంపా సత్రాన్ని ఏటా పదిశాతం పెంపు పద్ధతిన మూడేళ్ల పాటు లీజు కిచ్చేందుకు బుధవారం సాయంత్రం టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో మొదటి ఏడాదికి రూ.7.05 లక్షలు, రెండో ఏడాది పదిశాతం పెంచి చెల్లించేందుకు, రెండో ఏడాది లీజు మొత్తంపై మూడో ఏడాది పది శాతం చెల్లించేందుకు పాట ఖరారైంది. అలాగే శంఖవరం, కిర్లంపూడి గ్రామాల్లో దేవస్థానం 1999–2000 సంవత్సరాల మధ్య రూ. మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు కల్యాణ మండపాలకు లీజు కిచ్చేందుకు వేలం నిర్వహించారు. కిర్లంపూడి కల్యాణ మండపం ఏడాదికి రూ.2.55 లక్షలు, శంఖవరం కల్యాణ మండపం ఏడాదికి రూ.32 వేలుకు లీజు ఖరారైంది. పాట నిర్వహణలో దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, ఏఈఓ లు ఎంకేటిఎన్వి ప్రసాద్, శ్రీనివాస్, నటరాజ్, సూపరిండెంట్ లక్ష్మణస్వామి పాల్గొన్నారు. -
వేలం కాదిది ముడుపుల మాయాజాలం
గాంధీ సత్రం షాపుల కేటాయింపులో గోల్మాల్ టీడీపీ నేతల అండతో దక్కించుకున్న పాత వ్యాపారులు 22 దుకాణాల దఖలుకు చేతులు మారిన రూ.లక్షలు తుని : సత్యమే ఆయుధమన్న వాడు, లక్ష్యమే కాదు.. దాన్ని సాధించే మార్గమూ స్వచ్ఛంగా ఉండాలన్న వాడు జాతిపిత గాంధీజీ. ఆయన పేరిట ఉన్న సత్రానికి సంబంధించిన దుకాణాల వేలంలోనే పారదర్శకతకు పాతరేశారు అధికార టీడీపీ నేతలు, అధికారులు. బుధవారం జరిగిన వేలం తంతును చూసి అనేకులు ‘ఔరా! మహాత్ముని పేరిట ఉన్న సత్రం మాటున ఎంత మకిలి!’ అని ముక్కున వేలేసుకున్నారు. దేవాదాయ ధర్మాధాయ శాఖ పరిధిలో ఉన్న స్థానిక గాంధీ సత్రానికి 66 దుకాణాలు ఉన్నాయి. వాటి లీజును మూడేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయాల్సి ఉంది. కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం దుకాణాల్లో ఉన్న యజమానులను ఖాళీ చేయించి బహిరంగ వేలం వేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ అధికారులు వేలం కం టెండర్‌కు ప్రకటన ఇచ్చారు. బుధవారం ఆ శాఖ ఇన్స్పెక్టర్ డి.సతీష్‌కుమార్ పర్య వేక్షణలో వేలం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఎప్పటి నుంచో ఆ దుకాణాల్లో తిష్టవేసిన వ్యాపారులు బహిరంగ వేలం వేస్తే బయటి వారు వచ్చి హెచ్చుపాటకు పాడతారని భయపడ్డారు. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులను ఆశ్రయించారు. దుకాణాలు వారి చేజారిపోకుండా ఉండేందుకు ఒక్కో షాపునకూ భారీ మొత్తంలో ముడుపులు చెల్లించేందుకు సంప్రదింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు జరగాల్సిన వేలాన్ని అధికారులు కావాలనే ఆలస్యం చేశారు. లోపాయకారీ వ్యవహారాన్ని పసిగట్టిన మీడియా ప్రతినిధులు ఈఓ పులి నారాయణమూర్తిని ప్రశ్నించగా ఉదయం 9 గంటలకే వేల జరిగిపోయిందన్నారు. నోటీసులో 10 గంటలకు జరుగుతుందని ఉండగా ముందే ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. అయితే అందరూ బయటకు వెళ్లాక తమకు కావాల్సిన వ్యక్తులకు దుకాణాలు కేటాయించేలా వేలం తంతు నడిపించారు. పాత హక్కుదారుల బినామీలకే షాపులను కేటాయించేందుకు రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారాయని సమాచారం. నిబంధనల మేరకే వేలం : ఈఓ కాగా 66 షాపుల్లో 22 షాపులకు వేలం నిర్వహించామని ఈఓ సాయంత్రం విలేకరులకు తెలిపారు. ప్రసుత్తం ఉన్న అద్దెపై 45 శాతం పెరిగిందన్నారు. ఇంకా 44 దుకాణాలకు వేలం వేయాల్సి ఉందన్నారు. నిబంధనల మేరకే వేలం నిర్వహించామని, ఎలాంటి అవకతవకలకూ తావు లేదని చెప్పారు. అయితే తెర వెనుక ముడుపులతో తంతులా జరిగిన వేలంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, మిగిలిన దుకాణాలకు పారదర్శకంగా వేలం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
శ్రీశైలంలో ఇద్దరు ఆత్మహత్య
– ఒకరు గుంటూరు వాసి – మరొకరు గుర్తుతెలియని మహిళ శ్రీశైలం: శ్రీశైల దేవస్థాన పరిధిలోని అన్నపూర్ణ(కంభం) నిత్యాన్నదాన సత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు గుంటూరు శ్రీనగర్‌కు చెందిన మహంకాళి సైదులు (50)గా గుర్తించారు. మరొకరు గుర్తు తెలియనిlమహిళ. బుధవారం సత్రం డీలక్స్ గది నెం.141 నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అక్కడి సిబ్బంది.. మేనేజర్ వెంకటేశ్వర్లుకు సమాచారం అందజేశారు. ఆయన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ సుప్రజ, సీఐ వెంకటచక్రవర్తి, ఎస్ఐ లోకేష్‌కుమార్‌లు అక్కడి చేరుకుని గది తలుపులను తెరిపించారు. మధ్య గదిలో చాపపైన గుర్తు తెలియని మహిళ, బాత్రూం వద్ద మహంకాళి సైదులు మృతదేహాలు కనిపించాయి. ఈ నెల 8న సత్రంలో సైదులు గది తీసుకున్నారు. రిసెప్షన్లో ఓటర్ కార్డు, సెల్ నెంబర్‌ను నమోదు చేసుకున్నాడు. అయితే రిజిస్టర్లో నమోదైన సెల్ నెంబర్ పనిచేయడం లేదు. గదుల్లో లభ్యమైన సెల్ఫోన్లో సిమ్‌కార్డులు తొలగించి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. మతుడి వద్ద నుంచి సేకరించిన ఓటర్ ఐడీకార్డు లోని అడ్రస్‌లను గుర్తించాల్సిందిగా గుంటూరు శ్రీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వివరాలు పంపించినట్లు ఎస్ఐ లోకేష్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టుప్రభుత్వాసుపత్రికి మృతదేహాలను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. సత్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంపై డీఎస్పీ సుప్రజ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాల్లో పేర్కొన్నప్పటికీ స్పందించకపోవడం చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు. కెమెరాలు ఉన్నట్లయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా వారి నుంచి పూర్తి వివరాలు తెలిసేవని చెప్పారు. -
అమలాపురంలో వేద పాఠశాల
అమలాపురం టౌన్ : పట్టణంలో వేద పాఠశాల ఏర్పాటు కానుంది. గత ఏడాది మంజూరైన రూ.60 లక్షల పుష్కర నిధులతో స్థానిక కాలేజీ రోడ్డులోని కొక్కొండ కృష్ణబాయమ్మ సత్రంపై అంతస్తులో దేవాదాయ శాఖ వేదపాఠశాలను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేశారు. ఆషాఢ మాసం పూర్తయ్యాక ఈ పాఠశాల ఏర్పాటుచేయనున్నట్లు సత్రం కార్యనిర్వహణాధికారి అన్నవరం తెలిపారు. వేద పండితుడు తోపెల్ల లక్ష్మీ నరసింహమూర్తికి దేవాదాయ శాఖ పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే కోనసీమ వేద శాస్త్ర మహాసభ ఆధ్వర్యంలో ఏటా వేద సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాఠశాల ఏర్పాటుతో నిత్య వేదఘోషతో పట్టణం అలరారుతుందని ప్రజలు భావిస్తున్నారు. కృష్ణబాయమ్మ దాతృత్వంతో దేవాదాయశాఖ ఏర్పాటుచేసిన సత్రం శిథిలావస్థకు చేరడంతో పుష్కర నిధులతో ఆధునిక వసతులతో భవనాన్ని పునర్నిర్మించారు. ఈ భవనంలో ఉన్న రెండు దుకాణాలకు ఒకదానిలో ఆధ్యాత్మిక గ్రంథాలు, విక్రయశాల కోసం అద్దెకు ఇచ్చారు. మరో దుకాణాన్ని అద్దెకు ఇవ్వాల్సి ఉందని ఈవో అన్నవరం తెలిపారు.