వేలం కాదిది ముడుపుల మాయాజాలం
వేలం కాదిది ముడుపుల మాయాజాలం
Published Wed, Sep 21 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
గాంధీ సత్రం షాపుల కేటాయింపులో గోల్‌మాల్
టీడీపీ నేతల అండతో దక్కించుకున్న పాత వ్యాపారులు
22 దుకాణాల దఖలుకు చేతులు మారిన రూ.లక్షలు
తుని : సత్యమే ఆయుధమన్న వాడు, లక్ష్యమే కాదు.. దాన్ని సాధించే మార్గమూ స్వచ్ఛంగా ఉండాలన్న వాడు జాతిపిత గాంధీజీ. ఆయన పేరిట ఉన్న సత్రానికి సంబంధించిన దుకాణాల వేలంలోనే పారదర్శకతకు పాతరేశారు అధికార టీడీపీ నేతలు, అధికారులు. బుధవారం జరిగిన వేలం తంతును చూసి అనేకులు ‘ఔరా! మహాత్ముని పేరిట ఉన్న సత్రం మాటున ఎంత మకిలి!’ అని ముక్కున వేలేసుకున్నారు.
దేవాదాయ ధర్మాధాయ శాఖ పరిధిలో ఉన్న స్థానిక గాంధీ సత్రానికి 66 దుకాణాలు ఉన్నాయి. వాటి లీజును మూడేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయాల్సి ఉంది. కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం దుకాణాల్లో ఉన్న యజమానులను ఖాళీ చేయించి బహిరంగ వేలం వేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ అధికారులు వేలం కం టెండర్‌కు ప్రకటన ఇచ్చారు. బుధవారం ఆ శాఖ ఇన్‌స్పెక్టర్ డి.సతీష్‌కుమార్ పర్య వేక్షణలో వేలం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఎప్పటి నుంచో ఆ దుకాణాల్లో తిష్టవేసిన వ్యాపారులు బహిరంగ వేలం వేస్తే బయటి వారు వచ్చి హెచ్చుపాటకు పాడతారని భయపడ్డారు. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులను ఆశ్రయించారు. దుకాణాలు వారి చేజారిపోకుండా ఉండేందుకు ఒక్కో షాపునకూ భారీ మొత్తంలో ముడుపులు చెల్లించేందుకు సంప్రదింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు జరగాల్సిన వేలాన్ని అధికారులు కావాలనే ఆలస్యం చేశారు. లోపాయకారీ వ్యవహారాన్ని పసిగట్టిన మీడియా ప్రతినిధులు ఈఓ పులి నారాయణమూర్తిని ప్రశ్నించగా ఉదయం 9 గంటలకే వేల జరిగిపోయిందన్నారు. నోటీసులో 10 గంటలకు జరుగుతుందని ఉండగా ముందే ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. అయితే అందరూ బయటకు వెళ్లాక తమకు కావాల్సిన వ్యక్తులకు దుకాణాలు కేటాయించేలా వేలం తంతు నడిపించారు. పాత హక్కుదారుల బినామీలకే షాపులను కేటాయించేందుకు రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారాయని సమాచారం.
నిబంధనల మేరకే వేలం : ఈఓ
కాగా 66 షాపుల్లో 22 షాపులకు వేలం నిర్వహించామని ఈఓ సాయంత్రం విలేకరులకు తెలిపారు. ప్రసుత్తం ఉన్న అద్దెపై 45 శాతం పెరిగిందన్నారు. ఇంకా 44 దుకాణాలకు వేలం వేయాల్సి ఉందన్నారు. నిబంధనల మేరకే వేలం నిర్వహించామని, ఎలాంటి అవకతవకలకూ తావు లేదని చెప్పారు. అయితే తెర వెనుక ముడుపులతో తంతులా జరిగిన వేలంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, మిగిలిన దుకాణాలకు పారదర్శకంగా వేలం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
Advertisement
Advertisement