హీరోగా మాత్రమే చేస్తానంటూ.. ఆ హిట్ పాత్రలను రిజెక్ట్ చేసిన శోభన్ బాబు
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా 'సోగ్గాడు'. అది ఎంత స్పెషల్ అంటే, 'వెండితెర సోగ్గాడు' అంటే శోభన్ బాబే అనేటంతగా స్పెషల్. ఈ సినిమా ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. అలా ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన దివంగత నటుడు శోభన్ బాబు.
ఒకానొక సమయంలో తన దగ్గరికి వచ్చిన కథల్ని కూడా ఆయన తిరస్కరించారని మీకు తెలుసా..? అందుకు కారణం కూడా ఆయన గతంలో ఇలా చెప్పారు. 'అభిమానులు, ప్రేక్షకులు నన్ను హీరోగా మాత్రమే చూశారు.. అదే స్థాయిలో వారి గుండెల్లో నన్ను పెట్టుకున్నారు. నా కెరీర్ మొత్తం హీరోగానే ముగిసిపోవాలి. మరో పాత్రలో నటించాలని లేదు.' అన్నారు. దీంతో ఆయన సహాయ, కీలక పాత్రల్లో నటించేందుకు ముందుకు రాలేదు. కానీ ఆయన తిరస్కరించిన పాత్రలు ఏవో ఒకసారి చూద్దాం.
మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో 2005లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అతడు'. ఈ సినిమాలోని సత్యనారాయణ మూర్తి (నాజర్) పాత్ర ముందుగా శోభన్ బాబు దగ్గరకే వెళ్లింది. ఈ పాత్ర మీరే చేయాలంటూ నిర్మాత మురళీ మోహన్ కోరారు. అందుకు రెమ్యునరేషన్‌గా బ్లాంక్ చెక్‌నే ఇచ్చారు మురళీ మోహన్.. కానీ శోభన్ బాబు నో చెప్పడం విశేషం.
పవన్ కల్యాణ్ 'సుస్వాగతం' సినిమాలో రఘువరన్ పోషించిన పాత్ర మొదట శోభన్ బాబు దగ్గరికి వెళ్లింది. అందుకు భీమినేని శ్రీనివాసరావు సంప్రదించగా అప్పుడు కూడా శోభన్‌బాబు నో చెప్పారు.
తెలుగు సినిమా చరిత్రంలో అన్నమయ్య చిరస్థాయిలో ఉంటుంది. నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం 1997లో విడుదల అయింది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్‌ను అందుకుంది. ఇందులో శ్రీ వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించమని చిత్ర యూనిట్ కోరగా అప్పుడు కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా ఫైనల్‌గా ఆ పాత్ర సుమన్ వద్దకు వెళ్లింది. అందులో ఆయన కూడా ఒదిగిపోయాడు.
బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ నటించిన 'బ్లాక్' తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు ఆర్.బి. చౌదరి. అందులో శోభన్ బాబు అయితే బాగా సెట్ అవుతారని ఆయన కోరారు. అందకు కూడా నో చెప్పారు శోభన్ బాబు.
అలా ఎన్నో హిట్ కొట్టిన సినిమాలు ఆయన వద్దకు వచ్చాయి. కానీ వాటిని తిరస్కరించిన శోభన్ బాబు ఎట్టకేలకు ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోడి రామకృష్ణ దర్శకుడిగా నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ రూపొందించాలనుకున్న మల్టీస్టారర్ చిత్రాన్ని ఆయన ఓకే చేశారు. అందులో శోభన్ బాబు,కృష్ణ, జగపతి బాబు కలిసి నటించాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.