‘నేను ఏం తప్పు చేశాను? నాలో లోపం ఏమిటి?’
సినీ నటుడు సుమన్
రాజమహేంద్రవరం : తన నట జీవితంలో వెంకటేశ్వరస్వామి పాత్ర ఇంకెప్పుడూ చేయనని, అలా చేస్తే ‘అన్నమయ్య’లో తాను చేసిన ఆ మహాపాత్ర విలువ తగ్గిపోతుందని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. జిల్లాలో జరుగుతున్న సినిమా షూటింగ్ నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చిన ఆయనను సోమవారం ‘సాక్షి’ కలిసింది.
ఈ సందర్బంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అన్నమయ్య సినిమా తర్వాత తనను వెంకటేశ్వరస్వామిగా ప్రేక్షకులు చూసేవారన్నారు. ఇప్పటికీ అలా చూసే వారున్నారన్నారు. అయితే ఆ సినిమాకి పని చేసిన చిన్న ఆరిస్టులకు కూడా అవార్డులిచ్చి, తనకు మాత్రం ఇవ్వలేదన్నారు. ‘నేను ఏం తప్పు చేశాను? నాలో లోపం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
అయితే ఆ పాత్రకు అవార్డు రాకపోయినా అంతకన్నా గొప్ప గౌరవం లభించిందన్నారు. అప్పటి రాష్ర్టపతి శంకర్‌దయాళ్‌శర్మ ‘అన్నమయ్య’ సినిమా చూడాలని, దాంతో పాటు ఆ సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్ర చేసిన నటుడిని వెంట తీసుకురావాలని కోరడం తన అదృష్టమన్నారు. ఆయన బంగళాలో తనను పక్కనే పెట్టుకుని సినిమా చూశారని, తన చేతులు పట్టుకుని భోజనానికి తీసుకెళ్లారని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా భాష చిత్రాల్లో నటిస్తున్నారన్నారు.