పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ ఘటన యావత్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. న్యాయం కావాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు అందరూ రోడ్డెక్కారు. వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు తమ నిరసనగా భారత వైద్య సంఘం(ఐఎంఏ) పిలుపునిచ్చింది. ఈ ఘటనను ఖండిస్తూ ఇప్పటికే ఎందరో ప్రముఖులు స్పందించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వచ్చిన సినీ హీరో సుమన్ అక్కడ వైద్యుల నిరసనను చూసి స్పందించారు.
'మన సమాజంలో వైద్యులు చాలా పవిత్రమైన వృత్తిలో కొనసాగుతున్నారు. దేశాన్ని కాపాడుతున్న సైనికులు, పోలీసులు తర్వాత ఆ స్థానంలో వైద్యులు ఉన్నారు. కరోనా సమయంలో బంధువులు కూడా మన దగ్గరకు రాలేదు. అలాంటిది వైద్యులు మనకు రక్షణగా నిలిచి కాపాడారు. కులం, మతం అని చూడకుండా డాక్టర్లు సేవ చేస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే సేవ చేసేందుకు ముందుకు వస్తారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలను వారు కాపాడారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎందరో డాక్టర్‌లు, నర్సులు ముందుడి సేవ చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు. అలాంటి వారిని మనమే కాపాడుకోవాలి. వారికి కొంత మంది మాత్రమే సపోర్టు చేయడం బాధాకరం. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణగా ఉండాలి. మహిళలు కూడా సొంతంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా. ఆపద సమయంలో వారికి తప్పకుండా మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడుతుంది.' అని సుమన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment