బ్రహ్మరథం పట్టారు
నేత్రపర్వం.. లక్ష్మీ నారసింహుని రథోత్సవం
వేలాదిగా తిలకించి, పులకించిన భక్తజనం
జనసంద్రంగా మారిన అంతర్వేది
వేకువజామునే సాగర స్నానానికి పోటెత్తిన భక్తులు
అంతర్వేది(సఖినేటిపల్లి) (రాజోలు) : భక్తవరదుడు అంతర్వేది లక్షీ్మనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం మాడవీధుల్లో నిర్వహించిన రథయాత్ర అపూర్వ ఘట్టంగా నిలిచింది. సోమవారం రాత్రి కనువిందు చేసిన స్వామి కల్యాణం, మంగళవారం గ్రామవీధులను వైకుంఠపథాలుగా మార్చిన రథోత్సవం, ఆ రెండు పర్వాలకు నడుమ భీష్మ ఏకాదశి వేకువజామున సాగరస్నానం, అనంతరం ఆలయంలో స్వామి దర్శనం. ఇన్ని ఘట్టాలతో భక్తజన హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి.
సోమవారం రాత్రి 12.21 గంటలకు కల్యాణోత్సవం ముగిసిన అనంతరం మంగళవారం వేకువజామున భక్తులు కాలినడకన రెండు కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరానికి వెళ్లారు. భీష్మ ఏకాదశి పర్వదినాన సాగరస్నానం చేసేందుకు వచ్చిన భక్తులతో తీరం జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత భక్తులు ఆలయం వద్ద క్యూలైన్లలో బారులుతీరి స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం వరకూ ఒకదాని తరువాత మరొకటిగా పుణ్య కార్యక్రమాలు కొనసాగుతుండడంతో భక్తులు పిల్లాపాపలతో సహా ఉండిపోయారు. భీష్మ ఏకాదశినాడు స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వారు తోడవడంతో అంతర్వేది వీధులు కిక్కిరిశాయి. కల్యాణం మరుసటి రోజు ఇంటి ఆడపడుచు గుర్రాలక్కకు చీరె, సారె పెట్టేందుకు రథంపై మెరకవీధిలోని ఆలయం వద్దకు వెళ్లారు.
అరటి, గుమ్మడికాయల మొక్కు..
భక్తుల గోవిందనామస్మరణల మధ్య మధ్యాహ్నం 2.42 గంటలకు నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి పల్లకిలో రథం వద్దకు తోడ్కొని వచ్చారు. తొలుత మొగల్తూరుకు చెందిన ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు శ్రీరాజా కలిదిండి కుమార సత్యనారాయణ సింహజగపతి, రాజోలు ఎమ్మెల్యే గొల్ల పల్లి సూర్యారావు, డీఎస్పీ అంకయ్య, ఆర్డీఓ గణేష్‌కుమార్, గోదావరి డెల్టా కమిటీ చైర్మ¯ŒS భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, న్యాయవాదులు బత్తుల రాము, బెల్లంకొండ సూరి బాబు, ఎంపీపీ పి. లక్షీ్మసరస్వతి, ఆలయ ఏసీ చిక్కాల వెంకట్రావు రథానికి పూజ చేశారు. రాజా బహద్దూర్ కొబ్బరికాయ కొట్టి రథోత్సవానికి శ్రీకారం చుట్టారు. మెరకవీధి నుంచి యాత్ర పల్లపువీధి మీదుగా పదహారుకాళ్ల మండపానికి చేరుకుంది. మార్గమధ్యలో గుర్రాలక్కకు స్వామి తరఫున చీరె, సారె ఇచ్చారు. ప్రముఖపారిశ్రామికవేత్త జం పన సత్యనారాయణ రాజు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డీఎస్పీ అంకయ్య ఆధ్వర్యంలో పోలీసు బందో బస్తు నిర్వహించారు.
అంతర్వేదిలో నేడు
లక్షీ్మనరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు గజ వాహనంపై, రాత్రి ఎనిమిది గంటలకు పొన్నవాహనంపై స్వామివారి గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే పొలమూరు సత్రం నిర్వాహకులు అన్నపర్వత మహానివేదన కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహించనున్నారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్రకథ, హరికథ ఏర్పాటు చేశారు.
సంప్రదాయబద్ధంగా వస్తున్న అన్నదర్శనం...
భీష్మ ఏకాదశి రోజు నుంచి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిధి నాడు విరమణ చేసే అర్చకులు, స్వామి అన్నదర్శనం చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా పొలమూరు సత్రం నిర్వాహకులతో అన్నపర్వత మహానివేదన చేస్తారు. బుధవారం సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ శ్రీస్వామివారి సన్నిధిని శుద్ధిచేస్తారు. ఈ సమయంలో దర్శనాన్ని అర్చకులు నిలిపివేస్తారు. అన్నపర్వత మహానివేదన అనంతరం యథావిధిగా అర్చకులు స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు. భక్తులందరికీ ప్రసాదం పంచుతారు.