శుచి-శుభ్రతే ముఖ్యం.. ఏం చేయాలి?
రేపు జూనోసిస్ డే
పాడి-పంట: మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే స్వభావం ఉన్న వ్యాధుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు. ఈ రకంగా సుమారు 200 వ్యాధులు సంక్రమిస్తాయని అంచనా. వీటి బారిన పడితే ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి వీటిపై ప్రజలకు సరైన అవగాహన ఉండడం మంచిది. 1885 జూలై 6న లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా యాంటీ రేబిస్ టీకాను ఉపయోగించి, పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. అందుకే ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీని ‘జూనోసిస్ డే’గా పాటిస్తున్నారు.
ఎలా వ్యాపిస్తాయి?
గాలి, నీరు, ఆహారం, కలుషితమైన పశు ఉత్పత్తుల ద్వారా జూనోటిక్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఇవి వైరస్, బాక్టీరియా, పరాన్నజీవుల ద్వారా కూడా వ్యాపించి మనుషుల ప్రాణాలు హరిస్తాయి. వైరస్ కారణంగా సంక్రమించే వ్యాధుల్లో అత్యంత ప్రాణాంతకమైనది రేబిస్. పిచ్చికుక్క కాటు వల్ల సోకే ఈ వ్యాధి కారణంగా ఏటా మన దేశంలో 20-30 వేల మంది చనిపోతున్నారు. అలాగే మెదడువాపు (జపనీస్ ఎన్సెఫలైటిస్) వ్యాధి కారణంగా ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. విచ్చలవిడిగా తిరిగే పందుల శరీరంపై దోమలు కాటేయడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
ఇక బాక్టీరియా ద్వారా బ్రూసెల్లోసిస్, సాల్మోసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, దొమ్మ, గ్లాండర్స్ వ్యాధులు సంక్రమిస్తాయి. పరాన్నజీవుల కారణంగా అంకైలోస్టోమియాసిస్, హైడాటిడోసిస్, అలర్జీ, గజ్జి, అమీబియాసిస్, బాలాంటిడియాసిస్, టాక్సోప్లాస్మా వ్యాధులు సోకుతాయి.
వీరికి జాగ్రత్తలు అవసరం
కుక్కలతో సన్నిహితంగా మెలిగే వారికి రేబిస్, హైడాటిడోసిస్ వ్యాధులు వస్తాయి. కొమ్ములు, చర్మం, ఎముకలతో సంబంధం ఉండే పరిశ్రమల్లో పనిచేసే వారికి, కసాయి వారికి దొమ్మ వ్యాధి సోకుతుంది. డెయిరీ ఫారాల్లో పనిచేసే సిబ్బందికి, పశు వైద్యులకు బ్రూసెల్లోసిస్ రావచ్చు. కలుషితమైన పాలను ఉపయోగించే వారికి క్షయ, పౌల్ట్రీ ఫారాల్లో పనిచేసే వారికి సిట్టకోసిస్, ఎలుకలు ఎక్కువగా సంచరించే ధాన్యం గోదాముల్లో తిరిగే వారికి లెప్టోస్పైరోసిస్ సోకే ప్రమాదం ఉంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు టీబీ, సాల్మోనెల్లోసిస్, లిస్టిరియోసిస్ వంటి జూనోటిక్ వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వీరందరూ ఆయా వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ వ్యాధులు సోకుతాయి
పశువుల కారణంగా మశూచి, బ్రూసెల్లోసిస్, దొమ్మ, టీబీ, రేబిస్, మ్యాడ్ కౌ, గాలికుంటు, పాశ్చరెల్లోసిస్ వ్యాధులు వ్యాపిస్తాయి. మేకల ద్వారా మశూచి, అస్పర్జిల్లస్, రింగ్వార్మ్, తలసేమియా, లిస్టిరియోసిస్ సోకుతాయి. గుర్రాల కారణంగా మెదడువాపు, దొమ్మ, టీబీ, బ్రూసెల్లోసిస్, రింగ్వార్మ్, గ్లాండర్స్ వ్యాధులు వస్తాయి. పందులు టీబీ, రేబిస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, మెదడువాపు, ఇన్ఫ్లుయంజా వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి.
కుక్కల ద్వారా రేబిస్, బ్రూసెల్లోసిస్, లిస్టిరియోసిస్, లెప్టోస్పైరోసిస్, హైడాటిడోసిస్, ప్లేగు, లైష్మేనియాసిస్ వ్యాధులు వస్తాయి. ఎలుకలు ప్లేగు, లెప్టోస్పైరోసిస్, మెదడువాపు, క్యూఫీవర్ వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. కోతుల కారణంగా డెంగ్యూ, అమీబియాసిస్, ఫైలేరియాసిస్, రేబిస్, సాల్మోనెల్లోసిస్, మీజిల్స్, కైసనూర్ ఫారెస్ట్ వ్యాధులు వస్తాయి. కుందేళ్ల ద్వారా తలసేమియా, గజ్జి, లిస్టిరియోసిస్, టాక్సోఫ్లాస్మోసిస్, స్మాటిడ్ ఫీవర్ వ్యాధులు వస్తాయి. పక్షులు సాల్మోనెల్లోసిస్, లిస్టిరియోసిస్, టాక్సోఫ్లాస్మోసిస్, మెదడువాపు, ప్లేగు, సిట్టకోసిస్, అస్పర్జిల్లోసిస్ వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి.
ఇప్పటికే పలు దేశాలు జూనోటిక్ వ్యాధుల నిర్మూలనకు నడుం బిగించాయి. ఆ దిశగా కొన్ని దేశాలు విజయం సాధించాయి కూడా. కాబట్టి జూనోటిక్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించడానికి పశు సంవర్ధక, ఆరోగ్య, పంచాయితీ, మున్సిపల్ శాఖలు జూలై 6వ తేదీన (ఆదివారం) వివిధ కార్యక్రమాలు చేపట్టాలి. పల్స్పోలియో, హెపటైటిస్, ఎయిడ్స్ వంటి వ్యాధులపై ప్రజలను చైతన్యపరుస్తున్న లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు రేబిస్ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి.
నివారణ ఇలా...
మన దేశంలో సోకే జూనోటిక్ వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది రేబిస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం 75% కంటే ఎక్కువ కుక్కలకు రేబిస్ నిరోధక టీకాలు వేస్తే తప్ప ఈ వ్యాధిని నిర్మూలించలేము. కాబట్టి ప్రజలందరూ జూనోసిస్ డే రోజున పెంపుడు కుక్కలకు విధిగా టీకాలు వేయించాలి. టీకాలు వేయించని ఊరకుక్కల్ని నిర్మూలించాలి. కుక్కలతో సన్నిహితంగా ఉండేవారు, పశు వైద్యులు కూడా ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయించుకోవడం మంచిది.
పశువులు, కుక్కలకు క్రమం తప్పకుండా అంతర పరాన్నజీవుల నిర్మూలన మందుల్ని తాగిస్తే వాటి ద్వారా సంక్రమించే వ్యాధుల్ని నివారించవచ్చు. పందుల్ని గ్రామానికి దూరంగా, పరిశుభ్రమైన వాతావరణంలో పోషిస్తే మెదడువాపు వ్యాధి బారి నుంచి రక్షణ పొందవచ్చు. శుచి, శుభ్రత పాటిస్తే జూనోటిక్ వ్యాధులు దరిచేరవు. పాలు, మాంసం, గుడ్లు మొదలైన పశు ఉత్పత్తుల్ని విధిగా ఉడికించి తీసుకోవాలి. పరిసరాలు, పశువుల పాకల్ని ఎప్పటికప్పుడు క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి. చనిపోయిన పశు కళేబరాలను లోతైన గోతిలో పాతిపెట్టాలి.
-డాక్టర్ సిహెచ్.రమేష్ హైదరాబాద్