anti terrorism squad
-
Amit Shah: త్వరలో ఉగ్రవాద వ్యతిరేక విధానం
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను ఏరిపారేయడంతోపాటు వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. త్వరలో జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక విధానం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పటిష్టమైన వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ఉగ్రవాద నియంత్రణపై గురువారం ఢిల్లీలో జరిగిన సదస్సులో అమిత్ షా మాట్లాడారు. రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా, నిఘా సంస్థల అధినేతలు పాల్గొన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినప్పటికీ, రాష్ట్రాలు భౌతికమైన సరిహద్దులు కలిగి ఉన్నప్పటికీ, రాజ్యాంగపరంగా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ఉగ్రవాదానికి అలాంటి సరిహద్దులు, పరిమితులు ఉండవని అమిత్ షా గుర్తుచేశారు. అందుకే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వ్యూహాలు, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, పరస్పర సమన్వయం వంటి చర్యలు అవసరమని సూచించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కోసం మోడల్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ఏటీఎస్), మోడల్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) తీసుకు రావాలని యోచిస్తు న్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఎదిరించడానికి ఇవి ఉమ్మడి వేదికలుగా ఉపయోగపడతాయని పేర్కొ న్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న యాంటీ–టెర్రరిజం పాలసీ, స్ట్రాటజీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా సిబ్బంది, పోలీసుల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. -
రూ. 75 వేలకు ఆర్మీ సమాచారం అమ్మేశారు!
జైపూర్: పాకిస్తాన్ గూఢాచర సంస్థ ఐఎస్ఐకి భారత సైన్యం సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో రాజస్తాన్ పోలీసులు ఇద్దరు రక్షణ శాఖ ఉద్యోగులను అరెస్టు చేశారు. వికాస్ కుమార్(29), చిమన్లాల్(22)లను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రాజస్తాన్‌లోని శ్రీ గంగానగర్ సమీపంలో గల ఆర్మీ అమ్యూనిషన్(మందుగుండు) విభాగంలో పని చేస్తున్న వికాస్ కుమార్‌ను పాకిస్తాన్ ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన ఓ వ్యక్తి అమ్మాయి పేరిట ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ హనీట్రాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మిలిటరీ ఇంటలిజెన్స్(ఎంఐ) ఆర్బాట్(ఆర్డర్ ఆఫ్ బాటిల్; కంపోజిషన్ అండ్ ఆర్డర్ ఆఫ్ మిలిటరీ ఫైటింగ్ ఇన్ఫర్మేషన్)కు చెందిన సున్నితమైన సమాచారాన్ని అతడు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. మందుగుండు పరిమాణం, ఫొటోలు, రవాణా, ఫైరింగ్ ప్రాక్టీసుకు ఎంతమేర ఉపయోగిస్తున్నారు తదితర వివరాలను శత్రుదేశ గూఢాచారులకు వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడి అకౌంట్లోకి మూడు విడతల్లో పెద్ద మొత్తంలో(రూ. 75 వేలు) డబ్బు జమ అయినట్లు తెలిపారు. వికాస్ కుమార్ కదలికలపై నిఘా వేసిన లక్నో ఎంఐ జనవరిలో ఈ సమాచారాన్ని యూపీ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్‌కు అందించింది. దీంతో రంగంలోకి దిగిన ఏటీఎస్.. ‘డిజర్ట్ ఛేజ్’పేరిట ఆపరేషన్ చేపట్టి అతడి వ్యవహారంపై నిఘా వేసింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం వికాస్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వికాస్‌కు సహకరించిన చిమన్లాల్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బికనీర్‌లోని ఆర్మీ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్(ఎన్ఎఫ్ఎఫ్ఆర్)లో పనిచేసే చమన్ లాల్.. వికాస్ కలిసి సున్మితమైన సమాచారాన్ని చేరవేసినట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా వికాస్ కుమార్ నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. చమన్ లాల్ నుంచి ఆర్మీ యూనిట్ల సమాచారం సేకరించి.. అనౌష్క చోప్రా అనే అమ్మాయి సూచన మేరకు వివిధ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యానని తెలిపినట్లు వెల్లడించారు. -
15 సార్లు పొడిచినా చావలేదని..
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల హిందూ సమాజ్ పార్టీ నాయకుడు కమలేష్ తివారీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆ రిపోర్టును బుధవారం బయటపెట్టారు. రిపోర్టులోని వివరాలు.. దుండగులు కమలేష్‌ను దవడ నుంచి ఛాతీ వరకు 15 సార్లు కత్తితో దారుణంగా పొడిచారు. రెండు సార్లు గొంతు కోయడానికి ప్రయత్నించారు. కమలేష్ కుప్పకూలిపోయాక చనిపోయాడో లేదోనన్న అనుమానంతో తుపాకీతో ముఖంపై కాల్చారు. ఈ మేరకు కమలేష్ తలలో పాయింట్ 32 బుల్లెట్‌ను డాక్టర్లు కనుగొన్నారు. మరోవైపు నిందితుల కోసం గాలించిన పోలీసులు గుజరాత్ - రాజస్థాన్ సరిహద్దుల్లో ఇద్దరిని పట్టుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్న గుజరాత్ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ బృందం వారిని సూరత్‌కు చెందిన అష్ఫాక్ షేక్ (34), మొయినుద్దీన్ పఠాన్(27) గా గుర్తించింది. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించింది. మరో నిందితుడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. -
ఉగ్రమూకలకు ఫండ్స్.. కరెక్ట్‌గా స్పాట్ పెట్టాం!
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్న విదేశీ సంస్థలకు కరెక్ట్‌గా చెక్ పెట్టామని, ఉగ్రవాదానికి నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు ద్వారా ఆయా విదేశీ సంస్థలపై సరైనరీతిలో ఒత్తిడి తీసుకురాగలిగామని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం టాప్ పోలీసుల సదస్సులో దోవల్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమగ్రమైన వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని, క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. కశ్మీర్ లోయలో ఉగ్రమూకలకు అందుతున్న నిధులపై ఎన్ఐఏ గట్టిగా చెక్ పెట్టడం, యాంటీ టెర్రర్ ఫైనాన్సింగ్ గ్రూప్ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు అందుతున్న నిధులపై ఎఫ్ఏటీఏఫ్ గట్టి చర్యలు తీసుకుందని, ఇది పాకిస్థాన్‌పై ఒత్తిడిని పెంచిందని పేర్కొంటూ.. సరైన ఆధారాలు, సమాచారం సేకరించడం ద్వారా ఇది సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రాల్లోని యాంటీ టెర్రరిస్ట్ టీమ్స్‌ను.. ఆయన ఉగ్రవాద వ్యతిరేక సైనికులుగా అభివర్ణించారు. ‘మీరు కేవలం దర్యాప్తు అధికారులు కాదు.. ఉగ్రవాద వ్యతిరేక సైనికులు. కేవలం దర్యాప్తు చేయడమే కాదు.. ఉగ్రవాదంపై సమగ్ర పోరాటాన్ని చేయాలి. కేవలం నిఘా సంస్థలే దీనిని చేయలేవు. దర్యాప్తు అధికారులు ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లను మించి లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని సూచించారు. -
భారత్‌కు షాకిచ్చిన యూఏఈ ప్రభుత్వం
అబుదాబీ : భారత్‌లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడి విదేశాల్లో తల దాచుకుంటున్న నేరస్తులను, వివాదాస్పద వ్యక్తులను తిరిగి అప్పగించాల్సిందిగా వివిధ దేశాల ప్రభుత్వాలను కోరుతున్న భారత్‌కు నిరాశే మిగులుతోంది. వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్‌ను అప్పగించే ప్రసక్తే లేదంటూ మలేషియా ప్రభుత్వం ఇటీవలే తేల్చి చెప్పింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించి భారత్‌కు షాక్ ఇచ్చింది. 17 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతూ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్(ఏటీఎస్)కు చుక్కలు చూపిస్తున్న ఉగ్రవాది ఫారూఖ్ డేవిడ్‌వాలాను అప్పగించాలంటూ భారత్ యూఏఈని కోరింది. అయితే డేవిడ్‌వాలా తమ దేశ పౌరుడంటూ పాకిస్తాన్ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న యూఏఈ ప్రభుత్వం అతడిని అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు అతడిని ఇస్లామాబాద్ పంపించనున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. పలు నేరాల్లో కీలక భాగస్వామి.... దావూద్ ఇబ్రహీం డీ- కంపెనీలో కీలక సభ్యుడిగా వ్యవహరించిన డేవిడ్‌వాలాకు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉంది. గుజరాత్‌లోని డీ- కంపెనీ వ్యవహారాలన్ని చూసుకునే డేవిడ్‌కు చోటా షకీల్‌కు కూడా అత్యంత సన్నిహితుడు. ఇండియన్ ముజాహిద్దీన్, ఐఎస్ఐల ప్రోద్బలంతో ఫైజల్ మీర్జా, అల్లాహర్కా మన్సూరీ అనే ఇద్దరు వ్యక్తులను సంప్రదించి, పలువురికి ఉగ్ర కార్యకలాపాల్లో శిక్షణ ఇచ్చేలా ప్రోత్సహించాడు. ప్రస్తుతం వారిద్దరు మహారాష్ట్ర ఏటీఎస్ అదుపులో ఉన్నారు. గుజరాత్‌లోని పలు పట్టణాల్లో జరిగిన పేలుళ్లు, గుజరాత్ మాజీ హోం మంత్రి పాండ్యా హత్య కేసులోనూ డేవిడ్‌వాలా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కాగా 17 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న డేవిడ్‌వాలా దుబాయ్ ఉన్నట్లు మే 12న సమాచారం అందడంతో గుజరాత్ పోలీసులు భద్రతా బలగాలకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అతడిని అప్పగించాల్సిందిగా యూఏఈ ప్రభుత్వాన్ని కోరింది. అయితే అతడు భారత్‌కు చెందిన వాడు కాదని, తమ దేశ పౌరుడని పాకిస్తాన్ తెలిపింది. డేవిడ్‌వాలా ప్రస్తుతం పాకిస్తానీ పాస్పోర్టుతో దుబాయ్‌లో నివసిస్తూ ఉండటంతో అతడిని ఇస్లామాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం. -
టార్గెట్ ముంబై!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోందా? ముంబైలో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బృందం చేపట్టిన తనిఖీల్లో ఏడుగురు మావోయిస్టులు పట్టుబడటం ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. మహారాష్ట్రలో మావోల పునర్నిర్మాణం చర్యలు నిజమేనని నిఘా వర్గాలు కూడా స్పష్టం చేశాయి. గుజరాత్, మహారాష్ట్ర కేంద్ర కమిటీలో ఉన్న 21 మంది నేతల్లో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారే ఉండటం దేశవ్యాప్తంగా పార్టీ పటిష్టతకు మావోలు సాగిస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడగానే గుర్తించాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టులు ముంబైలో కార్యకలాపాలు సాగిస్తుండటం వెనకున్న కారణాలపై ఆరా తీసేందుకు రాష్ట్ర పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐబీ) ఒకటి ముంబై వెళ్లింది. కార్మిక ప్రాంతంలో షెల్టర్... తెలంగాణ, ఆంధప్రదేశ్, గుజరాత్, పుణే, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ముంబైలోని పారిశ్రామిక ప్రాంతాలైన విక్రోలీ, రాంబాయ్, అంబేడ్కర్‌నగర్, కామ్రాజ్ నగర్లలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని కార్మికులను తమ కోసం పనిచేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర కమిటీ ఆదేశాలతో కొందరు మావోయిస్టులు రహస్యంగా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం అరెస్టయిన ఏడుగురు కూడా ఇదే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. నేతలందరి ఆవాసం అక్కడే... మావోయిస్టు నేత గణపతి గతంలో తీవ్ర అనారోగ్యాన్ని ఎదుర్కున్నాడని, ఆ సమయంలో ముంబై వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు ఎస్ఐబీ గుర్తించింది. ఇప్పుడు అరెస్టయిన వారిని విచారిస్తే గణపతి ట్రీట్మెంట్ వ్యవహారంతోపాటు ఇతర కీలక నేతలంతా వారి నివాసాలనే షెల్టర్‌గా మార్చుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. 2015 మే 10న సీపీఐఎంల్–నక్సల్బరీ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.మురళీధరణ్ అలియాస్ అజిత్ కూడా ఇక్కడే పట్టుబడ్డట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ 135 మందిలో ఉన్నారా? ముంబైలో ఏటీఎస్ అరెస్ట్ చేసిన ఏడుగురు మావోయిస్టు నేతలు అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ వ్యక్తుల జాబితాలో ఉన్నారా లేరా అనే విషయమై ఎస్ఐబీ అధికారులు ఆరా తీయనున్నారు. దాదాపు పదేళ్ల నుంచి ముంబైలోనే నివసిస్తున్న వీళ్లు మావోయిస్టు పార్టీలో ఏ క్యాడర్లో పనిచేస్తున్నారు... వారి పేర్లు ఏమిటి తదితర వివరాలన్నింటిపై వివరాలు సేకరించనున్నారు. అజ్ఞాతంలో ఉన్న 135 మందిలో ఈ ఏడుగురు ఉన్నారా లేక ఇలాంటి వారు ఇంకెంత మంది స్లీపర్ సెల్స్‌గా ఉంటున్నారనే దానిపై విచారిస్తున్నామని ఎస్ఐబీ ఉన్నతాధికారులు తెలిపారు. గోల్డెన్ కమిటీలో ఆ ప్రాంతాలే... వ్యాపార కేంద్రాలకు చిరునామా అయిన గుజరాత్‌తోపాటు దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన మహారాష్ట్రలో పార్టీ పునర్మిణానికి గోల్డెన్ కారిడార్ కమిటీ పేరుతో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు సాగిస్తోంది. 2008లోనే ఈ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అప్పటి సెంట్రల్ కమిటీ సభ్యుడు తుషార్ భట్టాచార్య అరెస్టుతో కాస్త డీలాపడినా ఆ తర్వాత మావోయిస్టు కీలక నేత కోబడ్ గాంధీ చర్యలతో పార్టీ పటిష్టమైంది. ఆ తర్వాత ఈ కమిటీ ప్రభావం గుజరాత్‌లోని అహ్మదాబాద్, వల్సాడ్, కచ్, బనస్కాంత, వడోదరా, సూరత్, డాంగ్ ప్రాంతాల్లో ఉండేది. పట్టణ ప్రాంతాల్లో పార్టీ విస్తృతే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశమని కోబడ్ గాంధీ 53 పేజీలతో ప్లీనరీ నిర్ణయాలను రూపొందించారు. అలాగే మహారాష్ట్రలోని ముంబై, పుణే, ఔరంగాబాద్ ప్రాంతాలను సైతం ఈ కమిటీ పరిధిలోకి తెచ్చినట్లు తెలిసింది. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లతోపాటు మహారాష్ట్ర మొత్తం కూడా గతంలో రెడ్ కారిడార్ కమిటీలో భాగంగా ఉండేది. అయితే పట్టణ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణం కోసం సానుభూతిపరులను, పార్టీ క్యాడర్ రిక్రూట్మెంట్ కోసం గోల్డెన్ కారిడార్లోకి మహారాష్ట్రలోని ముంబై, పుణేలను తెచ్చినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. -
దావూద్ కీలక అనుచరుడు అరెస్టు
గాంధీనగర్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన కీలక గ్యాంగ్‌స్టర్ దావూద్ లాలా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసింది. అహ్మదాబాద్‌లోని జుహాపురా ఏరియాలో అతడిని అదుపులోకి తీసుకుంది. గుజరాత్లో ఓ హత్య కేసుకు సంబంధించి ఎప్పటి నుంచో పోలీసులు లాలా కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా రాజస్థాన్‌లోని పలు కీలక నేరాల్లో అతడి చేయి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్‌లలో దావూద్‌కు చెందిన గ్యాంగ్లన్నింటిని కూడా లాలానే నడిపిస్తున్నాడని ఏటీఎస్ వద్ద కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు దావూద్‌కు ఎంతో సన్నిహితంగా ఉన్న షరీఫ్ ఖాన్‌కు బంధువు అని కూడా తెలిసింది. మరోపక్క, లాలాను అరెస్టు చేయడంతో అతడి మరో ముగ్గురు సోదరులు కనిపించకుండా పోయారు. వారికోసం కూడా ఏటీఎస్ అధికారులు గాలిస్తున్నారు. ఒక్క రాజస్థాన్‌లోనే లాలాపై 15 కేసులు ఉన్నాయట.