భారత్‌కు షాకిచ్చిన యూఏఈ ప్రభుత్వం | UAE Govt Deports Wanted Terrorist Farooq Devdiwala To Pakistan | Sakshi
Sakshi News home page

భారత్‌కు షాకిచ్చిన యూఏఈ ప్రభుత్వం

Published Fri, Jul 13 2018 12:45 PM | Last Updated on Wed, Jul 25 2018 1:51 PM

UAE Govt Deports Wanted Terrorist Farooq Devdiwala To Pakistan - Sakshi

అబుదాబీ : భారత్‌లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడి విదేశాల్లో తల దాచుకుంటున్న నేరస్తులను, వివాదాస్పద వ్యక్తులను తిరిగి అప్పగించాల్సిందిగా వివిధ దేశాల ప్రభుత్వాలను కోరుతున్న భారత్‌కు నిరాశే మిగులుతోంది. వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌ను అప్పగించే ప్రసక్తే లేదంటూ మలేషియా ప్రభుత్వం ఇటీవలే తేల్చి చెప్పింది. తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించి భారత్‌కు షాక్‌ ఇచ్చింది.

17 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతూ యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌)కు చుక్కలు చూపిస్తున్న ఉగ్రవాది ఫారూఖ్‌ డేవిడ్‌వాలాను అప్పగించాలంటూ భారత్‌ యూఏఈని కోరింది. అయితే డేవిడ్‌వాలా తమ దేశ పౌరుడంటూ పాకిస్తాన్‌ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న యూఏఈ ప్రభుత్వం అతడిని అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ అభ్యర్థన మేరకు అతడిని ఇస్లామాబాద్‌ పంపించనున్నట్లు దుబాయ్‌ పోలీసులు తెలిపారు.

పలు నేరాల్లో కీలక భాగస్వామి....
దావూద్‌ ఇబ్రహీం డీ- కంపెనీలో కీలక సభ్యుడిగా వ్యవహరించిన డేవిడ్‌వాలాకు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉంది. గుజరాత్‌లోని డీ- కంపెనీ వ్యవహారాలన్ని చూసుకునే డేవిడ్‌కు చోటా షకీల్‌కు కూడా అత్యంత సన్నిహితుడు. ఇండియన్‌ ముజాహిద్దీన్‌, ఐఎస్‌ఐల ప్రోద్బలంతో ఫైజల్‌ మీర్జా, అల్లాహర్కా మన్సూరీ అనే ఇద్దరు వ్యక్తులను సంప్రదించి, పలువురికి ఉగ్ర కార‍్యకలాపాల్లో శిక్షణ ఇచ్చేలా ప్రోత్సహించాడు. ప్రస్తుతం వారిద్దరు మహారాష్ట్ర ఏటీఎస్‌ అదుపులో ఉన్నారు. గుజరాత్‌లోని పలు పట్టణాల్లో జరిగిన పేలుళ్లు, గుజరాత్‌ మాజీ హోం మంత్రి పాండ్యా హత్య కేసులోనూ డేవిడ్‌వాలా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

కాగా 17 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న డేవిడ్‌వాలా దుబాయ్‌ ఉన్నట్లు మే 12న సమాచారం అందడంతో గుజరాత్‌ పోలీసులు భద్రతా బలగాలకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అతడిని అప్పగించాల్సిందిగా యూఏఈ ప్రభుత్వాన్ని కోరింది. అయితే అతడు భారత్‌కు చెందిన వాడు కాదని, తమ దేశ పౌరుడని పాకిస్తాన్‌ తెలిపింది. డేవిడ్‌వాలా ప్రస్తుతం పాకిస్తానీ పాస్‌పోర్టుతో దుబాయ్‌లో నివసిస్తూ ఉండటంతో అతడిని ఇస్లామాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement