ఓటరు తిరస్కరించవచ్చు
ఎన్నికల అభ్యర్థులపై సుప్రీంకోర్టు విప్లవాత్మక తీర్పు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ వ్యతిరేక ఓటుతో తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బ్యాలెట్ పత్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ‘పై వారెవరూ కాదు’ (నన్ ఆఫ్ ది అబోవ్ - నోటా) అనే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే ఏర్పాటు చేయాలని.. ప్రత్యేక మీటను పొందుపరచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిర్దేశిస్తూ విప్లవాత్మక ఆదేశాలు జారీచేసింది. చెతన్యవంతమైన ప్రజాస్వామ్యంలో.. ‘పై వారెవరూ కాదు’ అనే మీటను ఎంచుకునే అవకాశం ఓటరుకు తప్పనిసరిగా ఇవ్వాలని.. దానివల్ల రాజకీయ పార్టీలు మంచి అభ్యర్థిని పోటీకి నిలపక తప్పనిసరి పరిస్థితి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈవీఎంలలో ‘నోటా’ మీటను ఏర్పాటు చేయటం ద్వారా ఓటర్లకు సాధికారత లభిస్తుందని, ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో సమర్థవంతమైన రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొంది స్తుందని వ్యాఖ్యానించింది.
వ్యతిరేక ఓటు (నెగెటివ్ ఓటు) వేసే హక్కు ఓటర్లకు కల్పించాలని కోరుతూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పార్లమెంటులోని ఓటింగ్ యంత్రాల్లో ఎస్, నోస్, అబ్‌స్టెయిన్ (తటస్థం) అనే మూడు మీటలు ఉంటాయనే విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎన్నికల్లోనూ ‘నోటా’ మీట నొక్కటం ద్వారా ఓటరు వాస్తవానికి తాను ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నట్లు చెప్పటమే అవుతుందని పేర్కొంది. వ్యతిరేక ఓటు ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఈసీకి సుప్రీంకోర్టు నిర్దేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని జస్టిస్ రంజన ప్రకాశ్‌దేశాయ్, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల్లో ముఖ్యాంశాలివీ...
భావప్రకటన హక్కులో భాగం
‘‘వ్యక్తులందరూ ఏదైనా ఒక అంశంపై మాట్లాడే, విమర్శించే, విభేదించే హక్కును 19వ అధికరణ కల్పిస్తోంది. ఇది సహనమనే స్ఫూర్తి ఆధారంగా నిలబడుతుంది. ప్రజలు విభిన్నమైన అభిప్రాయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు కలిగివుండేందుకు అనుమతిస్తుంది. ఒక వ్యక్తిని వ్యతిరేక ఓటు వేసేందుకు అనుమతించకపోవటం.. భావప్రకటనా స్వాతంత్య్రాన్నే హరిస్తుంది. ఓటు వేయటం అనేది భావప్రకటనా హక్కులో ఒక అంశం. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ కింద ఈ హక్కును కల్పించటం జరిగింది. ఒక వ్యక్తిని వ్యతిరేక ఓటు వేసేందుకు అనుమతించకపోవటం భావప్రకటనా స్వేచ్ఛను, 21వ అధికరణ అయిన స్వేచ్ఛా హక్కును హరిస్తుంది.
మచ్చలేని అభ్యర్థులకు అవకాశం వస్తుంది...
ప్రపంచంలోని 13 దేశాల్లో ఈ వ్యతిరేక ఓటు అమలులో ఉంది. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే.. దేశాన్ని సరిగా పరి పాలించేందుకు అందుబాటులో ఉన్నవారిలో ఉత్తములైన వారిని ప్రజా ప్రతినిధులుగా ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. వ్యతిరేక ఓటు ఎన్నికల ప్రక్రియలో వ్యవస్థాగత మార్పుతెస్తుంది. పార్టీలు నిలిపిన అభ్యర్థులను ప్రజలు పెద్ద సంఖ్యలో తిరస్కరించినప్పుడు.. ప్రజాభీష్టాన్ని అంగీకరించి పార్టీలు మచ్చలేని అభ్యర్థులను పోటీకి నిలబెట్టక తప్పని పరిస్థితి వస్తుంది.
ప్రజాస్వామ్య పురోభివృద్ధికి దోహదం...
ప్రజాస్వామ్య పురోభివృద్ధికి వ్యతిరేక ఓటు దోహదపడుతుంది. ప్రజలు రాజకీయ ప్రక్రియలో సమర్థవంతంగా పాల్గొనటాన్ని వేగవంతం చేస్తుంది. ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛతను పెంపొందిస్తుంది. ఇది పార్టీలు, వారి అభ్యర్థులు ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారనేదానిపై స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. ప్రస్తుత వ్యవస్థలో అసంతృప్తికి గురైన ఓటర్లు సాధారణంగా ఓటు వేయటానికి రారు. ఫలితంగా వారి ఓట్లను అవినీతి శక్తులు దుర్వినియోగం చేసే అవకాశమిస్తుందనే వాస్తవం కూడా.. వ్యతిరేక ఓటు ఆవశ్యకతను బలపరుస్తుంది.
పార్లమెంటులో ‘తటస్థం’ తరహాలోనే...
పార్లమెంటులోని ఓటింగ్ యంత్రాల్లో ఎస్, నోస్, అబ్‌స్టెయిన్ (తటస్థం) అనే మూడు మీటలు ఉంటాయి. అంటే.. సభ్యులు తటస్థం అనే మీటను ఎంచుకునే అవకాశం కల్పించారు. అలాగే.. పిటిషనర్లు కోరుతున్న ‘నోటా’ మీట.. సరిగ్గా ఈ ‘తటస్థం’ మీట వంటిదే. నోటా మీట నొక్కటం ద్వారా ఓటరు వాస్తవానికి.. అభ్యర్థులలో ఎవరూ తన ఓటు వేయటానికి తగిన అభ్యర్థిగా గుర్తించకపోతే.. తాను ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నట్లు చెప్పటమే అవుతుంది.
ఈవీఎంలలో ‘నోటా’ మీట ఏర్పాటు చేయాలి...
బ్యాలెట్ పత్రాలు / ఈవీఎంలలో పైవారెవరూ కాదు (నోటా) అనే మరో మీటను ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు మేం నిర్దేశిస్తున్నాం. దీనివల్ల పోలింగ్ బూత్‌కు వచ్చే ఓటర్లు.. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లయితే.. వారు ఎవరికీ ఓటు వేయకూడదనే తమ హక్కును వినియోగించుకునేందుకు, అదే సమయంలో తమ ఓటు గోప్యత హక్కును వినియోగించుకోవటానికి అవకాశం కలుగుతుంది. అభ్యర్థుల పేర్ల జాబితా చివర్లో ‘నోటా’ మీటను ఏర్పాటు చేయాలి. ఈ వ్యతిరేక ఓటు పద్ధతిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సంఘం దశలవారీగా కానీ, ఒకేసారి కానీ అమలు చేయాలి. దీనిని అమలు చేసేందుకు ఈసీకి అవసరమైన సహాయం కేంద్ర ప్రభుత్వం అందించాలి.’’
వ్యతిరేక ఓటుకూ గోప్యత తప్పనిసరే...
ఓటర్ల ‘నోటా’ ఓట్ల విషయంలో గోప్యత పాటించాలని కూడా ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నిర్దేశించింది. ‘‘ఓటు వేసే హక్కుతో పాటు, ఓటు వేయకుండా ఉండే హక్కు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 79(డి), 41(2), (3), 49-ఒ నిబంధనల కింద చట్టబద్ధంగా గుర్తించారు. ఓటరు తన ఓటు వేయాలని నిర్ణయించుకున్నా కానీ, తన ఓటు వేయరాదని నిర్ణయించుకున్నా కానీ గోప్యత పాటించాల్సి ఉంటుంది’’ అని స్పష్టంచేసింది. ‘‘ఓటరు తన ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లయితే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 128 సెక్షన్, సంబంధిత నిబంధనల కింద గోప్యత పాటించటం జరుగుతుందని.. ఒకవేళ ఓటరు తన ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే గోప్యత పాటించబోమని చెప్పటం కుదరదు. ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న ఓటరుతో భిన్నంగా వ్యవహరించే 49-ఒ నిబంధనలోని ఒక భాగం, ఫామ్ 17-ఎ అనేవి.. ఈ గోప్యతను ఉల్లంఘించేందుకు తోడ్పడుతున్నాయి. ఇది ఏకపక్షం, నిర్హేతుకం, 19వ అధికరణను ఉల్లంఘించటమే. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 79(డి), 128 సెక్షన్లకు విరుద్ధం’’ అని సుప్రీం తేల్చిచెప్పింది.
అదనపు వ్యయం, శ్రమ అవసరం లేదు...
వ్యతిరేక ఓటు వేసే సదుపాయాన్ని ప్రస్తుత ఈవీఎంలలోనే ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే, లేదా సాంకేతిక పరిజ్ఞానంలో ఎలాంటి మార్పూ చేయకుండానే ఏర్పాటు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి ఈసీ నివేదనను ఉటంకిస్తూ.. ఈవీఎంలో చివరి మీటను వ్యతిరేక ఓటుకు కేటాయించటానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు చెప్పింది.
రాబోయే ఎన్నికల్లో అమలుకు అవకాశం
ఇదిలావుంటే.. రాబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ‘తిరస్కరించే హక్కు’ను అమలులోకి తెచ్చే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. సుప్రీం తీర్పును సాధ్యమైనంత వేగంగా అమలుచేసేందుకు సవివర మార్గదర్శకాలు జారీచేయటం జరుగుతుందని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.
పార్టీల మిశ్రమ స్పందన
సుప్రీం తీర్పుపై పార్టీల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ తీర్పును పూర్తిగా అధ్యయనం చేయకుండా స్పందించటం తొందరపాటవుతుందని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు జాగ్రత్తగా స్పందించాయి. అయితే.. ఈ తీర్పు అసాధారణ పరిస్థితిని సృష్టించిందని, దీనిని సరిచేయాల్సి ఉందని సీపీఎం వ్యాఖ్యానించింది. సీపీఐతోపాటు పౌర సమాజంలోని ప్రముఖులు ఈ తీర్పును ఆహ్వానించారు. ‘వ్యతిరేక ఓట్లు అత్యధికంగా ఉంటే ఏమిటనేటువంటి అన్ని అంశాలనూ కోర్టు పరిగిణనలోకి తీసుకుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికిప్పుడు స్పందించటం తొందరపాటు అవుతుంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ అన్నారు. ‘మేం ఎన్నికల సంస్కరణలకు అనుకూలం. ఈ తీర్పు సరైనదా, పొరపాటా అని ఇప్పుడే చెప్పటం తొందరపాటు అవుతుంది’ అని బీజేపీ ఉపాధ్యక్షుడు నక్వీ పేర్కొన్నారు. ఈ తీర్పు రాజకీయాల్ని బాగుచేసే దిశగా చిన్న, బలమైన ముందుడగు అవుతుందని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందన్న సుప్రీం తీర్పును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వాగతించారు.
వ్యతిరేక ఓటు అంటే చెల్లని ఓటే?!
అభ్యర్థులందరినీ తిరస్కరించే అవకాశం ఓటరుకు కల్పించాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు వ్యతిరేక ఓటు వేస్తే ఏం జరుగుతుందనేది ఇందులో ప్రధానంగా ఉంది. అయితే.. దీనిపై ఎన్నికల చట్టంలో ఎలాంటి ప్రస్తావనా లేనప్పటికీ.. ‘పై వారెవరూ కాదు’ అనే వ్యతిరేక ఓటును చెల్లని ఓటుగా పరిగణించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితిలో ఓట్లు పొందిన అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించటం జరగవచ్చని అంచనా వేస్తున్నాయి.
‘తప్పనిసరి ఓటు’ కూడా కావాలి...
నేను ఈ తీర్పును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. ఇది మన రాజ కీయాలపై చిరకాల ప్రభావం చూపుతుందని ఖచ్చితంగా చెప్తున్నా. తప్పనిసరి ఓటు వల్ల కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగల పలు ప్రయోజనాలు ఉన్నాయి. తప్పనిసరి ఓటును తీసుకురావటం ద్వారా.. ఓటర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి.. ఎన్నికలపై విపరీతమైన వ్యయాన్ని నివారించవచ్చు. తప్పనిసరి ఓటుపై మేం బిల్లును ప్రవేశపెట్టాం. అందులో తిరస్కరించే హక్కు కూడా ఉంది. కానీ కాంగ్రెస్ దానిని పూర్తిగా వ్యతిరేకించింది. ఈ బిల్లును 2008, 2009ల్లో రెండు సార్లు (రాష్ట్ర శాసనసభలో) ఆమోదించాం. కానీ గవర్నర్ దానిని ఆపివేశారు. - నరేంద్రమోడీ, గుజరాత్ సీఎం
14వ దేశంగా భారత్
ఎన్నికల్లో తనకు నచ్చని అభ్యర్థిని తిరస్కరించే విధానం అమలు చేస్తున్న ఫ్రాన్స్, బ్రెజిల్, ఫిన్లాండ్, అమెరికా లాంటి దేశాల సరసన భారత్ చేరింది. దీంతో నెగెటివ్ ఓటింగ్ విధానం అమలుచేసే దేశాల్లో 14వ దేశంగా భారత్ అవతరించనుంది. ప్రస్తుతం ఈవీఎంల ద్వారా ఫ్రాన్స్, బెల్జియం దేశాలు మాత్రమే ‘నన్ ఆఫ్ ది అబౌవ్ (నోటా)’ను అమలు చేస్తుండగా.. బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, అమెరికాలోని నెవడా రాష్ట్రం బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటర్లకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. కాగా, ఫిన్లాండ్, స్వీడన్, అమెరికా, స్పెయిన్ దేశాల్లో ఓటర్లు బ్యాలెట్‌ను ఖాళీగా వదిలివేయవచ్చు. లేదంటే అభ్యర్థిపై కామెంట్లు కూడా రాయవచ్చు.