పురా‘వస్తు’ పంపకమెలా?
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని పురావస్తు ప్రదర్శనశాలలో వెలకట్టలేని ప్రాచీన సంపద
ఆ పంపిణీకి జనాభా ప్రాతిపదికా? సంపద లభ్యత ప్రాదిపదికా?
అధికారవర్గాల్లో ఆసక్తికర చర్చ విలువైన సంపదకు నెలవైన మ్యూజియం
హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న పురావస్తు శాలలోని వెల కట్టలేని పురాతన సంపదను ఎలా పంపిణీ చేయాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పునర్వ్యవస్థీకరణ చట్టం తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఈ పరిస్థితుల్లో వెల కట్టలేని ప్రాచీన సంపదను ఇరు రాష్ట్రాలు ఎలా పంపిణీ చేసుకుంటాయి. ఇందుకు ఏ ప్రాతిపదికను అనుసరిస్తాయన్నది ఉన్నతాధికార వర్గా ల్లో చర్చనీయాశంగా ఉంది. ఇతర సంస్థల విభజనలా పురావస్తు శాల విభజన సాధ్యం కాదు. ఇది పురావస్తు శాఖ కింద ఉండటంతో రాష్ట్ర విభజన చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ దీనిని చేర్చలేదు. పురావస్తు శాలలో ఉన్న ప్రాచీన సంపదను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేస్తారా? లేక ఏ ప్రాంతంలో సంపద లభ్యమైందో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పంపిణీ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఈ సంపద పంపిణీపై ఇంకా దృష్టి సారించలేదు. అత్యంత విలువైన ఆ సంపద పంపిణీ జరగాలంటే ఆ రంగంలో నిష్ణాతులైన వారితో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పురావస్తుశాలలో బుద్ధుని అవశేషాలు దగ్గర నుంచి నాటి యుద్ధాల్లో రాజులు వినియోగించిన పరికరాలు, ఎంతో విలువైన ఒరిజనల్ పెయిం టింగ్స్, బంగారు, వెండి, రాగి నాణేలు, వెలకట్టలేని బంగారు ఆభరణాలు ఉన్నాయి. సంపద లభించిన ప్రాంతం, ఆ సంపదకు విలువ కట్ట డం అంత సులభతరం కాదని అధికారులు అం టున్నారు. అధికార వర్గాలు ప్రాథమిక అంచనా మేరకు పబ్లిక్ గార్డెన్స్ పురావస్తుశాలలో ఉన్న ప్రాచీన సంపద ఈ విధంగా ఉంది.
నాలుగు వేల బంగారు, 14 వేల వెండి, 30 వేల రాగి మూల నాణేలు, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో లభ్యమైన ఎంతో విలువైన పలు బంగారు ఆభరణాలున్నాయి. నాటి మహారాజులకు చెందిన ప్రాచీన కాలంనాటి 2,500 ఒరిజినల్ పెయింటింగ్స్‌తో పాటు బుద్ధుడి ఎముక ముక్క ఉంది. ఆ ఎముక ముక్క కోసం గతంలో చైనా రూ. 57 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చింది. దశాబ్దాల నుంచి భద్రపరిచిన మమ్మీ కూడా అందులో ఉంది. ప్రాచీన కాల యుద్ధాల్లో వాడిన కవచాలు, కిరీ టాలు, బల్లేలు,ఇతర యుద్ధ పరికరాలున్నాయి.