Antivirus
-
Covid-19: కరోనా అంతు చూసే మాస్కు!
కరోనా ఇక కాస్త మందగించిందంటూ మూడో వేవ్ దాటిన తర్వాత ప్రజలంతా కొద్దిగా హాయిగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో... తన ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదంటూ అది అడపాదడపా సందడి చేస్తూనే ఉంది. దేశంలో చాలా చోట్ల కేసులు మళ్లీ పెరుగుతున్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దాంతో మూలన విసిరేసిన మాస్కుల డబ్బాలు మళ్లీ తెరవాల్సిందేనంటూ ఆరోగ్య నిపుణులూ, ప్రభుత్వ పెద్దలూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ తాకిన కొద్దిసేపటికి అది నిర్వీర్యం అయిపోయే కొత్త మాస్కులను శాస్త్రవేత్తలు రూపొందించారు. వైద్యులు వాడే ఎన్–95 మాస్కులూ, ప్రజలు ఉపయోగించే మూడు పొరల మాస్కుల తరహాలో కరోనాను అరికట్టే రసాయనంతో మరో పొరను చేర్చుతూ వీటిని రూపొందించామంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కెంటకీకి చెందిన కెమికల్ ఇంజనీర్ దిబాకర్ భట్టాచార్య. ‘కొత్తగా రూపొందించిన ఈ పొర మీదికి ‘సార్స్–సీవోవీ–2’వైరస్ లేదా దానికి సంబంధించిన అంశాలేవైనా చేరి... అక్కడ దాని మీద కనీసం 30 సెకండ్ల పాటు ఉంటే దాని స్పైక్ ప్రోటీన్ నిర్వీర్యమవుతుంది. కొమ్ముల్లా ఉండే ఈ స్పైక్ ప్రోటీన్‌ను ఓ తాళం చెవిలా ఉపయోగించుకునే వైరస్ మన జీవకణాల్లోకి చేరుతుందన్న విషయం తెలిసిందే. ఇది ఎన్–95లా పనిచేస్తున్నప్పటికీ దీనిపైని అదనపు పొరపై యాంటీవైరస్ ఎంజైమ్ పూత ఉంటుంది. అది కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేస్తుంది. తద్వారా ‘సార్స్–సీవోవీ–2’వ్యాప్తిని గణనీయంగా అరికడుతుంది’అంటున్నారు దిబాకర్ భట్టాచార్య. దీనిని మరింత అభివృద్ధి చేస్తే మరింత సమర్థంగా వ్యాప్తిని అరికడుతుందనే భరోసా ఇస్తున్నారు. దీన్లో వాడిన ‘స్మార్ట్ ఫిల్టరేషన్ మెటీరియల్’కేవలం గాల్లో వ్యాపించి కరోనాను వ్యాప్తిచేసే ఏరోసాల్స్‌ను మాత్రమే నిర్వీర్యం చేస్తుంది తప్ప శ్వాసప్రక్రియకు ఎలాంటి అవరోధం కల్పిందంటూ పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఇవి అటు డ్రాప్లెట్స్(సన్నటి లాలాజల తుంపర్ల)తో పాటు ఇటు ఏరోసాల్స్ (గాల్లో ఉండే అతి సూక్ష్మమైన కణాలు) ద్వారా కలిగే వైరస్ వ్యాప్తులను అరికడుతుందంటున్నారు. విశ్వసనీయమైన ఎన్–95 కంటే సమర్థమైందని, కరోనా వైరస్ సహా, 100 నానోమీటర్ల సైజులో ఉన్న అన్ని పార్టికిల్స్నూ 98.9 శాతం సమర్థంగా అడ్డుకుంటుందనేది పరిశోధకుల మాట. ఈ వివరాలన్నీ ‘కమ్యూనికేషన్స్ మెటీరియల్స్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సైబర్ క్రైమ్: ఫోన్లో గూఢచర్యం..
ఊరు నుంచి వచ్చాక అల్మారా తెరిచి చూసిన సుమిత్ర(పేరుమార్చడమైనది) షాక్ అయ్యింది. తను భద్రంగా ఉంచిన బంగారం కనిపించలేదు. అల్మరా తాళాలు ఎక్కడ పెట్టిందో తనకు మాత్రమే తెలుసు. అవి ఎక్కడ ఉంచిందో అక్కడే జాగ్రత్తగా ఉన్నాయి కూడా. ఇంట్లో కొడుకు కోడలిని అడిగితే తమకేమీ తెలియదని, పెద్ద కోడలికి ఇచ్చారేమో అంటూ నిష్టూరంగా మాట్లాడారు. సుమిత్రకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. భర్త సంపాదించినది, తన దగ్గర ఉన్న బంగారం ఇంకా పిల్లలకు పంచలేదు. ఇద్దరు కొడుకులు ఉద్యోగ రీత్యా మంచి స్థాయిలో ఉండటంతో వారు సొంతిళ్లు కట్టుకుని ఉంటున్నారు. చిన్నకొడుకు ఆర్థికంగా స్థిరపడకపోవడంతో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా సుమిత్ర, ఆమె భర్త రఘునాథం సర్దుకుపోయేవారు. కానీ, ఈ మధ్య ఆస్తి వ్యవహారంలో కొడుకుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. కోడలు ప్రవర్తన మరింత విచిత్రంగా ఉంది. బంగారం పోవడంతో పోలీసులను సంప్రదించారు సుమిత్ర, ఆమె భర్త. ఫోన్ సంభాషణతో చౌర్యం ఇంటి పరిస్థితి కనుక్కుంటే కొన్ని నెలలుగా తమ కొడుకు, కోడలు తమపై గూఢచర్యం చేస్తున్నారని, తమ పిల్లలతోనూ, బంధువులతోనూ తాము ఫోన్లో మాట్లాడుకున్న విషయాలు కూడా వారికి తెలిసిపోతున్నాయని, ఇంట్లో ప్రశాంతత కోల్పోయామని చెప్పుకున్నారు సుమిత్ర దంపతులు. వారి దగ్గర ఉన్న ఫోన్ చెక్ చేసి చూస్తే అందులో చిన్న కోడలు స్పై యాప్‌ని ఇన్స్టాల్ చేసి, రికార్డర్ వాయిస్‌ను తన ఈ మెయిల్‌కు లింక్ చేసినట్టుగా గుర్తించారు. దీని ద్వారా కుటుంబంలో మిగతావారితో జరిగే ఫోన్ సంభాషణ అంతా కొడుకు, కోడలు వినేవారని తెలిసింది. అందులో భాగంగా సుమిత్ర తన కూతురి తో ఫోన్లో మాట్లాడినప్పుడు అల్మరాలో ఉంచిన బంగారం, రహస్యంగా ఉంచిన తాళాల గురించి చెప్పింది. అది తెలుసుకున్న కొడుకు కోడలు ఆ బంగారాన్ని దొంగతనం చేసి, తమకేమీ తెలియదని, మిగతా కొడుకులకు, కూతురుకు ఇచ్చి ఉంటారని దురుసుగా మాట్లాడారు. ఇదో మానసిక జాడ్యం కుటుంబ సంబంధాలలో అనుమానాలు ఉంటేనే ఇలాంటివి జరుగుతుంటాయి అనుకుంటే పొరబాటే. బయటి వారు కూడా ఇతరులను ఇరకాటంలో పెట్టడానికి ఇలాంటి చర్యలకు పూనుకోవచ్చు. వారిలో అత్యంత సన్నిహితులు అనదగిన వారు కూడా ఉండవచ్చు. సాధారణంగా ఎన్ఆర్ఐ మ్యారేజీ విషయాల్లో కాబోయే భాగస్వామి పట్ల అనుమానంతో ఇలాంటి గూఢచర్యం చేస్తుంటారు. భార్యాభర్తల సంబంధం విషయంలోనూ అనుమానం వల్లే ఇలాంటి స్పైవేర్లు పుట్టుకు వస్తాయి. ఫోన్ సర్వీస్ పాయింట్లలోనూ ఇలాంటి స్పై కెమరా యాప్‌లు ఇన్స్టాల్ చేసి, వాటి ద్వారా అమ్మాయిల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. యాంటీ స్పై వేర్... ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు మన ఫోన్ ఇవ్వకుండా ఉండటం మొదటగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ► మాల్వేర్ లేదా స్పై వేర్ యాప్ ఇన్స్టాల్ చేసినట్టుగా కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ► ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా ఖాళీ అవుతుంటుంది. ► పాప్ అప్ యాడ్స్ నిరంతరం వస్తూ ఉంటాయి. ► డేటా వినియోగం పెరిగినట్టుగా చూపుతుంది. ► ఇతర పాప్ అప్ యాప్ నోటిఫికేషన్స్ విరివిగా వస్తుంటాయి. ► మాల్వేర్ లేదా స్పై వేర్ ఉందని అనుమానించినట్లయితే యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయాలి. ఫోన్‌ని స్కాన్ చేయాలి. అవసరం లేని యాప్స్‌ను తొలగించాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
‘నమో’ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ కంపెనీ ఇన్నోవేజన్ తన నూతన యాంటీవైరస్ (వైరస్ల నుంచి కంప్యూటర్లకు రక్షణ) కు ‘నమో’గా నామకరణం చేసింది. ఎన్నికల ముందు నమో (నరేంద్రమోడీ) వైరస్ దేశవ్యాప్తంగా సోకి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇన్నోవేజన్ తన నూతన శ్రేణి యాంటీ సాఫ్ట్‌వేర్‌కు నరేంద్రమోడీ సంక్షిప్త నామాన్ని ఎంచుకోవడం విశేషం. మాల్వేర్, వైరస్ దాడుల నుంచి రక్షణ కల్పించేలా అడ్వాన్స్డ్ సాఫ్ట్‌వేర్‌ను నమో పేరుతో విడుదల చేయనున్నట్లు ఇన్నోవేజన్ వెల్లడించింది. దేశంలో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించని 57 శాతం మంది నెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దీనిని తెస్తున్నట్లు కంపెనీ సీఈవో అభిషేక్ గగ్నేజా తెలిపారు. తమ కంపెనీకి ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదని స్పష్టం చేశారు.