antyapushkaralu
-
అంత్య ఘట్టానికి..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్య పుష్కరాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. గురువారం కొవ్వూరులో అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5గంటల నుంచి గోష్పాద క్షేత్రంలో సభ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విఘ్నేశ్వర పూజ, గౌతమ మహర్షి ధ్యానం, పుష్కరుడికి, సింహస్థ బృహస్పతికి అర్చన, గోదావరి పూజ, నీరాజనం సమర్పించనున్నారు. తుది అంకానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంత్య పుష్కరాల్లో 11వ రోజైన గురువారం జిల్లాలోని అన్నిఘాట్లలో 50 వేల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. తాళ్లపూడిలో అర్చకులు జంధ్యాల అశ్వినికుమార్ ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇచ్చారు. ముగింపు సందర్భంగా తాళ్లపూడిలో ఉత్సవ మూర్తులతో రథయాత్ర నిర్వహించనున్నారు. నరసాపురంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. వలంధర రేవు, అమరేశ్వ ఘాట్లో వేకువజామునుంచే భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు చేసారు. ఘాట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. గోదావరి మాతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టిసీమ పుష్కర ఘాట్లోనూ çపుష్కర సాన్నాలు చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వరద ఉధృతి కొనసాగడంతో 1, 2 ఘాట్లలో స్నానాలకు అనుమతించలేదు. నూతన ఘాట్లో సుమారు 30 వేల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారు. ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. పుష్కరోత్సవాల ముగింపునకు భారీ ఏర్పాట్లు కొవ్వూరు : గోదావరి అంత్య పుష్కరాల ముగింపు సందర్భంగా పుష్కరుడికి ఘన వీడ్కోలు పలికేందుకు గోష్పాద క్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు వీడ్కోల ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం గోష్పాద క్షేత్రంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు గోష్పాద క్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. -
గోదావరి తల్లికి కోటిదండాలు
పర్వతాల వంటి పాపాలను సైతం ప్రక్షాళన గావించే పుణ్యగంగ.. చరిత్ర ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాలతో అలరారే ఘనతరంగ.. బీడు భూముల్లో బంగారం పండించే జలధితరంగ.. మా గోదావరి తల్లీ.. నీకు కోటి దండాలు.. కొవ్వూరు: గోదావరి అంత్య పుష్కరాల పుణ్య స్నానాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గోష్పాదక్షేత్రం ఘాట్లో 11వ రోజు బుధవారం భక్తుల రద్దీ కొనసాగింది. గోదావరి వరద ఉధృతి కొనసాగడంతో క్షేత్రంలోని పోలీసులు మొదటి రెండు ఘాట్లలో స్నానాలకు అనుమతించలేదు. నూతన ఘాట్లో సుమారు 30 వేల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారు. ఒడిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పిండ ప్రదానాలు అధిక సంఖ్యలో చేశారు. తాళ్లపూడి, కొవ్వూరు మండలాల పరిధిలోని రూరల్ ఘాట్ల్లో ఇరవై వేల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. గురువారంతో అంత్య పుష్కరాలు ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి గోష్పాదక్షేత్రంలో సభ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చే స్తున్నారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవోల పేరుతో పుష్కర వీడ్కోలు కార్యక్రమంపై పలువురికి ఆహ్వాన పత్రాలు పంపిణీ చేశారు. నరసాపురం జన గోదావరి నరసాపురం : నరసాపురం జన గోదావరిగా మారిపోయింది. అంత్యపుష్కర పర్వం చివరిదశకు చేరుకోవడంతో భక్తులు పోటెత్తారు. 11వ రోజు బుధవారం ఘాట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. వలంధర్రేవులో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కనిపించింది. అధికారుల అంచనా ప్రకారం 20 వేల మంది స్నానాలు చేశారు. గోదావరి మాతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్నానాలు అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వలంధరరేవులో ఏర్పాటు చేసిన జల్లుస్నానం ప్రత్యే ఆకర్షణగా నిలిచింది. ఎక్కువ మంది భక్తులు, జల్లు స్నానాలు చేయడానికి మొగ్గు చూపారు. పిండ ప్రదానాలు చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. మరోవైపు భక్తుల సంఖ్య పెరగడంతో ఏర్పాట్లలో లోపాలు కనిపిస్తున్నాయి. సిబ్బంది మొత్తం కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లడంతో బందోబస్తుతో సహా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఘాట్ల వద్ద మంచినీరు సరఫరా వంటి లోపాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.