అంత్య ఘట్టానికి..
అంత్య ఘట్టానికి..
Published Wed, Aug 10 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్య పుష్కరాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. గురువారం కొవ్వూరులో అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5గంటల నుంచి గోష్పాద క్షేత్రంలో సభ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విఘ్నేశ్వర పూజ, గౌతమ మహర్షి ధ్యానం, పుష్కరుడికి, సింహస్థ బృహస్పతికి అర్చన, గోదావరి పూజ, నీరాజనం సమర్పించనున్నారు. తుది అంకానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంత్య పుష్కరాల్లో 11వ రోజైన గురువారం జిల్లాలోని అన్నిఘాట్లలో 50 వేల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు.
తాళ్లపూడిలో అర్చకులు జంధ్యాల అశ్వినికుమార్ ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇచ్చారు. ముగింపు సందర్భంగా తాళ్లపూడిలో ఉత్సవ మూర్తులతో రథయాత్ర నిర్వహించనున్నారు. నరసాపురంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. వలంధర రేవు, అమరేశ్వ ఘాట్‌లో వేకువజామునుంచే భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు చేసారు. ఘాట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. గోదావరి మాతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టిసీమ పుష్కర ఘాట్‌లోనూ çపుష్కర సాన్నాలు చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వరద ఉధృతి కొనసాగడంతో 1, 2 ఘాట్లలో స్నానాలకు అనుమతించలేదు. నూతన ఘాట్‌లో సుమారు 30 వేల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారు. ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు.
పుష్కరోత్సవాల ముగింపునకు భారీ ఏర్పాట్లు
కొవ్వూరు : గోదావరి అంత్య పుష్కరాల ముగింపు సందర్భంగా పుష్కరుడికి ఘన వీడ్కోలు పలికేందుకు గోష్పాద క్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు వీడ్కోల ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం గోష్పాద క్షేత్రంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు గోష్పాద క్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు.
Advertisement