more devotees
-
గోదారమ్మ పంపిస్తోంది .. కృష్ణమ్మ పిలుస్తోంది
గోదావరి అంత్యపుష్కర సంరంభం పరిసమాప్తమైంది. ఇక కృష్ణమ్మ చెంతకు వెళ్లిరావయ్యా అంటూ పుష్కరునికి పావనవాహినీ తీరం వీడ్కోలు పలికింది. ఆఖరి రోజు పుణ్యస్నానాలకు భక్తజనం పోటెత్తింది. నదీమతల్లి ఒడిలో జలకాలాడి తరించింది. సకల, సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించింది. పసుపు, కుంకుమతో అర్చించింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్యపుష్కరాల ఆఖరి రోజు గురువారం జిల్లాలోని నదీతీరం కిక్కిరిసింది. ఏ ఘాట్ వద్ద చూసి భక్తుల సందడి కనిపించింది. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో అంత్యపుష్కరాల ముగింపు సభ జరిగింది. మళ్లీ 11 ఏళ్లకు గానీ పుణ్యస్నానం చేసే అవకాశం రాదని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. గోదావరి తీరంలోని ప్రధానమైన ఘాట్లతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఘాట్లూ కళకళలాడాయి. అంత్యపుష్కరాల 12 రోజులూ భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సుమారు ఆరు,ఏడు లక్షల మంది పుణ్యస్నానాలు చేసి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఆఖరి రోజు గురువారం సుమారు 75 వేల మంది స్నానాలు ఆచరించి ఉంటారని అంచనా. ఎంతమంది వస్తారో అంచనాలు లేకుండానే అధికారులు అంత్యపుష్కర సంరంభాన్ని ప్రారంభించారు. అయితే తరలివచ్చిన భక్తుల సంఖ్యను చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. గతంలో ఎన్నడూ అంత్యపుష్కరాలకు ఇంతమంది రాలేదని వృద్ధులు చెబుతున్నారు. వీటిపై ప్రభుత్వం అసలు శ్రద్ధపెట్టలేదు. ఆఖరికి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. కృష్ణాపుష్కరాల బందోబస్తు పేరుతో ఇక్కడి నుంచి సిబ్బందిని అక్కడకు పంపింది. అయితే ఉన్న సిబ్బందే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సాయంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒకవైపు వారానికిపైగా గోదావరిలో వరద పోటెత్తినా, కొన్ని ఘాట్లను మూసివేయాల్సి వచ్చినా అధికారులు ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా అంత్యపుష్కరాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. రాత్రి వరకూ పుణ్యస్నానాలు కొవ్వూరు గోష్పాదక్షేత్రం, నరసాపురంలోని వలంధర్రేవులు గురువారం తెల్లవారుజాము నుంచి , మధ్యాహ్నం వరకూ కిటకిటలాడాయి. రాత్రి వరకూ భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నారు. కొవ్వూరులో 30వేల మందిపైనే భక్తులు వచ్చినట్టు అధికారులు అంచనా కట్టారు. నరసాపురంలో 25వేల మందివరకూ స్నానాలు చేసినట్టు అంచనా. తెల్లవారుజామున భారీ, వర్షం పడినా లెక్కచేయకుండా భక్తులు గోదారమ్మ ఒడిలో తడిసిముద్దయ్యారు. తాళ్లపూడి మండలంలో వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక ఘాట్లకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు పసుపు, కుంకుమతో గోదారమ్మను అర్చించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. తాళ్లపూడి గ్రామంలో వివిధ దేవాలయాల ఆధ్వర్యంలో భారీ రథయాత్ర జరిగింది. నదీమతల్లికి భక్తజనం హారతులిచ్చారు. కోడేరు పుష్కరఘాట్‌కు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత 12 రోజులలో మండలంలోని కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కరఘాట్లలో సుమారు 50 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. సిద్ధాంతం ఘాట్‌లో సుమారు 15 వేలమందికిపైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. శుక్రవారం కృష్ణాపుష్కరాలు ప్రారంభం కానుండడంతో గురువారం ముగిసే అంత్య పుష్కర స్నానాలు చేసి ఇక్కడి నుంచి కృష్ణా నదీమతల్లి చెంతకు వెళ్లి అక్కడా స్నానం చేసి పుణ్యఫలం పొందాలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒడిశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సిద్ధాంతం జాతీయ రహదారిపై ఉండడంతో కేదారీఘాట్‌లో అంత్య పుష్కర స్నానాలు చేసి, కృష్ణా పుష్కర స్నానానికి పయనమయ్యారు. అన్ని ఘాట్లలోనూ స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి భక్తులకు సదుపాయాలు కల్పించాయి. ఉదయం టిఫిన్ల నుంచి మధ్యాహ్నం భోజన ఏర్పాట్లూ చేశాయి. -
అంత్య ఘట్టానికి..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్య పుష్కరాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. గురువారం కొవ్వూరులో అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5గంటల నుంచి గోష్పాద క్షేత్రంలో సభ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విఘ్నేశ్వర పూజ, గౌతమ మహర్షి ధ్యానం, పుష్కరుడికి, సింహస్థ బృహస్పతికి అర్చన, గోదావరి పూజ, నీరాజనం సమర్పించనున్నారు. తుది అంకానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంత్య పుష్కరాల్లో 11వ రోజైన గురువారం జిల్లాలోని అన్నిఘాట్లలో 50 వేల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. తాళ్లపూడిలో అర్చకులు జంధ్యాల అశ్వినికుమార్ ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇచ్చారు. ముగింపు సందర్భంగా తాళ్లపూడిలో ఉత్సవ మూర్తులతో రథయాత్ర నిర్వహించనున్నారు. నరసాపురంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. వలంధర రేవు, అమరేశ్వ ఘాట్‌లో వేకువజామునుంచే భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు చేసారు. ఘాట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. గోదావరి మాతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టిసీమ పుష్కర ఘాట్లోనూ çపుష్కర సాన్నాలు చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వరద ఉధృతి కొనసాగడంతో 1, 2 ఘాట్లలో స్నానాలకు అనుమతించలేదు. నూతన ఘాట్‌లో సుమారు 30 వేల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారు. ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. పుష్కరోత్సవాల ముగింపునకు భారీ ఏర్పాట్లు కొవ్వూరు : గోదావరి అంత్య పుష్కరాల ముగింపు సందర్భంగా పుష్కరుడికి ఘన వీడ్కోలు పలికేందుకు గోష్పాద క్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు వీడ్కోల ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం గోష్పాద క్షేత్రంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు గోష్పాద క్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. -
తల్లీ.. ప్రణమిల్లి
వెతలు తీర్చు దేవేరి.. వేదమంటి గోదారిని పసుపు కుంకుమలతో అర్చించారు. పాలూ పన్నీటితో.. శ్రీగంధపు ధారతో.. పంచామృతాలతో అభిషేకించారు. ‘పావన వాహనీ.. సకల శుభాలనివ్వు’ అంటూ ప్రార్థించారు. గోదావరి అంత్య పుష్కర సంబరం అంబరాన్ని తాకుతోంది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. కొవ్వూరు/నరసాపురం : అంత్య పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులతో జిల్లాలోని ప్రధాన ఘాట్లన్నీ కిటకిటలాడాయి. పావన వాహిని మహాపర్వంలో నాలుగో రోజైన బుధవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఒక్క కొవ్వూరులోనే 10 వేల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. నరసాపురం, సిద్ధాంతం ఘాట్లతోపాటు పోలవరం, తాళ్లపూడి, పెరవలి, ఆచంట, యలమంచిలి మండలాల్లోని ఘాట్లలోనూ పుష్కరాల సందడి కనిపిస్తోంది. పిండ ప్రదానాలు చేసేందుకు వచ్చేవారి సంఖ్య పెరి గింది. గురువారం శ్రావణ మాసం ఆరంభం, నెల పొడుపు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో అడిషనల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్ దంపతులు స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీఅన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తాళ్లపూడి మండల రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోష్పాద క్షేత్రంలో భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చంటి పిల్లలకు పాలు పంపిణీ చేస్తున్నారు. సుందర గోవిందుడి ఆలయంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. పిండప్రదానం షెడ్లవద్ద వర్షం నీరు నిలిచిపోయి అపరిశుభ్రంగా తయారైంది. వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డెప్యూటీ డీఎంహెచ్‌వో జి.శైలజ పరిశీలించారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు, ఘాట్ ప్రత్యేక అధికారి ఈ.శ్రీనివాసరావు క్షేత్రంలో వసతులను పరిశీలించారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు బందోబస్తును పర్యవేక్షించారు. నరసాపురంలో ఘాట్లు భక్తులతో కిక్కిరిసాయి. వలంధర రేవులో వేకువజాము నుంచి భక్తుల రద్దీ కనిపించింది. గోదావరి మాతకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. వలంధర రేవులో జల్లుస్నానం ప్రత్యే ఆకర్షణగా నిలిచింది. ఈ రేవులో ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు పుణ్యస్నానం ఆచరించారు. యలమంచిలి మండలం లక్ష్మీపాలెంలోని ఘాట్‌లో మహిళలు సామూహిక లక్ష్మీ పూజలు నిర్వహించారు. పెనుగొండ మండలం సిద్ధాంతం రేవులో 5 వేల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్టు అధికారులు అంచనా వేశారు. ఇక్కడ గోదారమ్మకు సంధ్యాహారతి ఇచ్చారు. అందని వేతనాలు ఘాట్లలో భక్తుల రక్షణార్థం పడవలపై పహారా కాస్తున్న గజ ఈతగాళ్లకు నాలుగు రోజులుగా వేతనాలు చెల్లించలేదు. పడవ యజమానులకు సైతం సొమ్ము ఇవ్వలేదు. ఈతగాళ్లకు రూ.449, పడవ యజమానికి రూ.750 చొప్పున సుమారు రూ.2 లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. పెరుగుతున్న వరద గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గోష్పాద క్షేత్రం వద్ద రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. మహారాష్ట్ర లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రానున్న మూడు రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మంగళవారం సాయంత్రం 1.85 లక్షల క్యూసెక్కుల వరద నీరు రాగా, బుధవారం సాయంత్రానికి 2,23,709 క్యూసెక్కులకు పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం 6గంటలకు 10.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. వరద పెరిగితే నదిలో స్నానాలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆది పుష్కరాల్లో మాదిరిగా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది.