తల్లీ.. ప్రణమిల్లి
తల్లీ.. ప్రణమిల్లి
Published Thu, Aug 4 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
వెతలు తీర్చు దేవేరి.. వేదమంటి గోదారిని పసుపు కుంకుమలతో అర్చించారు. పాలూ పన్నీటితో.. శ్రీగంధపు ధారతో.. పంచామృతాలతో అభిషేకించారు. ‘పావన వాహనీ.. సకల శుభాలనివ్వు’ అంటూ ప్రార్థించారు. గోదావరి అంత్య పుష్కర సంబరం అంబరాన్ని తాకుతోంది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
కొవ్వూరు/నరసాపురం : అంత్య పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులతో జిల్లాలోని ప్రధాన ఘాట్లన్నీ కిటకిటలాడాయి. పావన వాహిని మహాపర్వంలో నాలుగో రోజైన బుధవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఒక్క కొవ్వూరులోనే 10 వేల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. నరసాపురం, సిద్ధాంతం ఘాట్లతోపాటు పోలవరం, తాళ్లపూడి, పెరవలి, ఆచంట, యలమంచిలి మండలాల్లోని ఘాట్లలోనూ పుష్కరాల సందడి కనిపిస్తోంది.
పిండ ప్రదానాలు చేసేందుకు వచ్చేవారి సంఖ్య పెరి గింది. గురువారం శ్రావణ మాసం ఆరంభం, నెల పొడుపు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో అడిషనల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్ దంపతులు స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీఅన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తాళ్లపూడి మండల రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోష్పాద క్షేత్రంలో భక్తులకు పులిహోర పంపిణీ చేశారు.
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చంటి పిల్లలకు పాలు పంపిణీ చేస్తున్నారు. సుందర గోవిందుడి ఆలయంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. పిండప్రదానం షెడ్లవద్ద వర్షం నీరు నిలిచిపోయి అపరిశుభ్రంగా తయారైంది. వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డెప్యూటీ డీఎంహెచ్‌వో జి.శైలజ పరిశీలించారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు, ఘాట్ ప్రత్యేక అధికారి ఈ.శ్రీనివాసరావు క్షేత్రంలో వసతులను పరిశీలించారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు బందోబస్తును పర్యవేక్షించారు. నరసాపురంలో ఘాట్లు భక్తులతో కిక్కిరిసాయి. వలంధర రేవులో వేకువజాము నుంచి భక్తుల రద్దీ కనిపించింది. గోదావరి మాతకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. వలంధర రేవులో జల్లుస్నానం ప్రత్యే ఆకర్షణగా నిలిచింది. ఈ రేవులో ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు పుణ్యస్నానం ఆచరించారు. యలమంచిలి మండలం లక్ష్మీపాలెంలోని ఘాట్‌లో మహిళలు సామూహిక లక్ష్మీ పూజలు నిర్వహించారు. పెనుగొండ మండలం సిద్ధాంతం రేవులో 5 వేల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్టు అధికారులు అంచనా వేశారు. ఇక్కడ గోదారమ్మకు సంధ్యాహారతి ఇచ్చారు.
అందని వేతనాలు
ఘాట్లలో భక్తుల రక్షణార్థం పడవలపై పహారా కాస్తున్న గజ ఈతగాళ్లకు నాలుగు రోజులుగా వేతనాలు చెల్లించలేదు. పడవ యజమానులకు సైతం సొమ్ము ఇవ్వలేదు. ఈతగాళ్లకు రూ.449, పడవ యజమానికి రూ.750 చొప్పున సుమారు రూ.2 లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది.
పెరుగుతున్న వరద
గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గోష్పాద క్షేత్రం వద్ద రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. మహారాష్ట్ర లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రానున్న మూడు రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మంగళవారం సాయంత్రం 1.85 లక్షల క్యూసెక్కుల వరద నీరు రాగా, బుధవారం సాయంత్రానికి 2,23,709 క్యూసెక్కులకు పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం 6గంటలకు 10.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. వరద పెరిగితే నదిలో స్నానాలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆది పుష్కరాల్లో మాదిరిగా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
Advertisement
Advertisement