అంత్యపుష్కరాలు ఆరంభం
-
రామన్నగూడెంలో ఉత్సవ మూర్తులకు గంగస్నానం
-
మంగపేటలో గోదావరి మాతకు హారతి
-
ఏర్పాట్లను పట్టించుకోని అధికారులు
-
మంగపేటలో సౌకర్యాలు లేక వెనుదిరిగిన భక్తులు
ఏటూరునాగారం/మంగపేట :
ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, మంగపేట మండల కేంద్రంలో అంత్యపుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రామన్నగూడెంలో ఉదయం 6.15 గంటలకు శ్రీసీతారామ చంద్రస్వామి, ఉమారామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకొచ్చి జలాభిషేకం చేశారు. అనంతరం భక్తుల స్నానాలకు అనుమతి ఇచ్చారు. మహిళలు స్నానాలు ఆచరించి వాయినాలు ఇచ్చుకుని, నదిలో దీపాలు వదిలారు. చిల్లర డబ్బులు, పసుపు, కుంకుమ నదిలో వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు పెట్టారు. ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడకుండా గ్రామస్తులే మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు నిర్మించారు. గోదావరి వరకు దారి ఏర్పాటు చేసి, తాగునీటి వసతి కల్పించారు. మంగపేటలోని పుష్కరఘాట్ వద్దకు సుమారు 300 మంది భక్తులు వచ్చినప్పటికీ సౌకర్యాలు లేక అందులో 100 మంది మాత్రమే స్నానం చేశారు. మిగితావారు తిరిగి వెళ్లిపోయారు. పుష్కర స్నానం ఆచరించన వారు పిండప్రదానాలు చేశారు. సాయంత్రం అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో గోదావరి మాతకు హారతి ఇచ్చారు. ఎంపీడీఓ సురేష్ దంపతులతో పాటు అర్చక సమాఖ్య అధ్యక్షుడు కొయ్యడ నర్సింహమూర్తి, పూజారులు శివరామకృష్ణ, రామసుబ్బారావు, ఎం.వి.వి.సిద్ధాంతి శర్మ, ఎం.వి.ఎల్. కాంతయ్య పాల్గొన్నారు. ఏటూరునాగారం సీఐ రఘుచందర్, మంగపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
శివాలయంలో పూజలు..
రామన్నగూడెం ఒడ్డున ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో శివలింగానికి పంచామృతాభిషేకాలు, అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎగ్గడి కోటేశ్వర్‌రావు, కోశాధికారి వెనిగళ్ల శివాజీ, ప్రధాన కార్యదర్శి అల్లి శ్రీను, సర్పంచ్ బొల్లె జ్యోతి శ్రీను, ఎంపీటీసీ సభ్యురాలు పద్మ కృష్ణ, ఆలయ పూజారులు పుల్లయ్యచారి, నర్సింహాచారి, ఆడెపు శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.