Approval of the High Court
-
మళ్లీ మొదటికి...
* బీఎస్‌వై కుటుంబ సభ్యులు, ఈశ్వరప్పపై విచారణకు ‘హైకోర్టు’ అనుమతి * సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశం * సంకటంలో యడ్యూరప్ప, ఈశ్వరప్ప సాక్షి, బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తులు, అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, ఆయన కుమారుడు రాఘవేంద్ర, కుమార్తె అరుణాదేవిలతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పలపై విచారణకు హైకోర్టు అనుమతించింది. బీఎస్‌వై కుటుంబంతో పాటు ఈశ్వరప్పపై విచారణకు ఆదేశించాల్సిందిగా న్యాయవాది వినోద్‌కుమార్ వేసిన ప్రైవేటు కేసును విచారించిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ కేసు విచారణపై స్టేను విధిస్తూ శివమొగ్గ లోకాయుక్త కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు తాజాగా రద్దు చేసింది. దీంతో బీఎస్‌వై కుటుంబంతో పాటు ఈశ్వరప్ప ఇబ్బందికర పరిస్థితుల్లో పడినట్లైంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆయన కుమారుడు రాఘవేంద్ర శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని హుణసకట్టె సమీపంలోని భద్రా పులుల అభయారణ్యానికి చెందిన 69 ఎకరాల భూమిని బినామీ వ్యక్తుల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు రూపొందించి కొనుగోలు చేశారని న్యాయవాది వినోద్ కొంతకాలం క్రితం ఆరోపించారు. అంతేకాక ఈ భూమిని కోట్లాది రూపాయలకు అక్రమంగా అమ్ముకున్నారని పేర్కొన్నారు. ఇక యడ్యూరప్ప కుమార్తె అరుణాదేవి కూడా కేహెచ్‌బీ సైట్లను బినామీ పేరిట సొంతం చేసుకొని వాటిని కోట్లాది రూపాయలకు అమ్ముకోవడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప సైతం శివమొగ్గ జిల్లాలో అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించారని, శివమొగ్గ ప్రాంతంలో 4,39,898 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారని, ఆయనకుటుంబ సభ్యుల పేరిట అనేక ప్రాంతాల్లో అక్రమ ఆస్తిని కూడబెట్టారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించి సమగ్ర విచారణను నిర్వహించి నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిందిగా కోరుతూ శివమొగ్గ లోకాయుక్త కోర్టును ఆశ్రయించారు. అయితే సరైన ఆధారాలు, అనుమతులు లేనందున ఈ విచారణను నిలిపివేయాలని యడ్యూరప్ప, ఈశ్వరప్పలు శివమొగ్గ లోకాయుక్త కోర్టును కోరడంతో కోర్టు ఈ విచారణపై స్టే విధించింది. దీంతో న్యాయవాది వినోద్ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన కేసుపై మంగళవారం పూర్తి స్థాయి విచారణను జరిపిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం శివమొగ్గ లోకాయుక్త కోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేసింది. అంతేకాక యడ్యూరప్ప, రాఘవేంద్ర, అరుణాదేవి, ఈశ్వరప్పలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. -
నేడు ‘ఇంజినీరింగ్’పై హైకోర్టు తీర్పు
- హైకోర్టు అనుమతినిచ్చేనా..? - భరోసాలో యాజమాన్యాలు - ‘రేట్లు’ పెంచుతామంటున్న కళాశాలలు శాతవాహన యూనివర్సిటీ : జేఎన్టీయూ అనుమతి నిరాకరించిన వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు ఇంకా ఆశలపల్లకిలో ఊరేగుతున్నాయి. ఉన్నత విద్యామండ లి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో జేఎన్టీయూ అధికారులు తనిఖీలు చేసి.. అనుమతులను రద్దు చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఆయా కళాశాల యాజమాన్యాలు హైకోర్టుకెళ్లాయి. కౌన్సెలింగ్‌కు కొద్దిరోజుల ముందే అనుమతి లేదంటూ వెబ్ ఆప్షన్స్‌లో పేర్లు తొలగించడం సరికాదని దావా వేశాయి. దీనిపై శుక్రవారం హైకోర్టు కళాశాలల అనుమతి రద్దు విషయమై తీర్పు వెలువరించనుంది. కళాశాలలో వసతులు లేకుంటే కొన్ని కోర్సులను మాత్రమే రద్దు చేయాల్సి ఉంటుందని, మొత్తం కళాశాలనే రద్దు చేయడం ఉండదని, పైగా మేనేజ్మెంట్ కోటా కింద విద్యార్థులను చేర్చుకుంటామని ప్రకటించామని, ఇప్పుడు రద్దు చేస్తే ఎలా అంటూ యాజమాన్యాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని కళాశాల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. షరతులు విధించైనా కళాశాలలకు అనుమతి ఇస్తుందంటూ యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. చేయిదాటిన విద్యార్థులు జిల్లాలో ఎనిమిది కళాశాలలకు మాత్రమే అనుమతి ఉండడంతో మెరుగైన ర్యాంకు సాధించిన విద్యార్థులందరూ ఆయా కళాశాలల్లో చేరిపోయారు. ప్రస్తుతం అనుమతి లేని కళాశాలలకు హైకోర్టు అనుమతి ఇచ్చినా.. మెరికలు తప్ప ఆ తర్వాతి స్థానంలో ఉన్న విద్యార్థులే చేరే అవకాశముంటుందని ఆయా కళాశాలల ఫ్యాకల్టీ పేర్కొంటున్నారు. మెరుగైన ర్యాంకర్లు కళాశాలలో చేరకుంటే నష్టపోయేది కళాశాలేనని, వారు బాగా చదవకుంటే కళాశాలలకు భవిష్యత్తులో చుక్కెదురు తప్పకపోవచ్చని చర్చించుకుంటున్నారు. ఈనెల 26న విద్యార్థులు ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉంది. ఆ లోపు అనుమతి వస్తేనే ఈ కళాశాలల్లో విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అనుమతి వచ్చినా... పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. రేట్లు పెంచుతామంటున్న కళాశాలలు సందెట్లో సడేమియా అన్న చందంగా జిల్లాలో అనుమతి ఉన్న కళాశాలలు మేనేజ్మెంట్ సీట్లను అధిక రేట్లకు అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నాయి. ఎదుటి కళాశాలలో ఉన్న సమస్యలను ఫోకస్ చేస్తూ.. తమ కళాశాలల్లో చేరే విద్యార్థుల నుంచి అందినకాడికీ దండుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే మేనేజ్మెంట్ సీట్ల కోసం వచ్చిన వారి నుంచి సర్టిఫికెట్స్ తీసుకుంటూ.. ‘జాగ్రత్త’గా డీల్ చేస్తున్నట్లు తెల్సింది.