మళ్లీ మొదటికి...
* బీఎస్‌వై కుటుంబ సభ్యులు, ఈశ్వరప్పపై విచారణకు ‘హైకోర్టు’ అనుమతి
* సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశం
* సంకటంలో యడ్యూరప్ప, ఈశ్వరప్ప
సాక్షి, బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తులు, అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, ఆయన కుమారుడు రాఘవేంద్ర, కుమార్తె అరుణాదేవిలతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పలపై విచారణకు హైకోర్టు అనుమతించింది. బీఎస్‌వై కుటుంబంతో పాటు ఈశ్వరప్పపై విచారణకు ఆదేశించాల్సిందిగా న్యాయవాది వినోద్‌కుమార్ వేసిన ప్రైవేటు కేసును విచారించిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఈ కేసు విచారణపై స్టేను విధిస్తూ శివమొగ్గ లోకాయుక్త కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు తాజాగా రద్దు చేసింది. దీంతో బీఎస్‌వై కుటుంబంతో పాటు ఈశ్వరప్ప ఇబ్బందికర పరిస్థితుల్లో పడినట్లైంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆయన కుమారుడు రాఘవేంద్ర శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని హుణసకట్టె సమీపంలోని భద్రా పులుల అభయారణ్యానికి చెందిన 69 ఎకరాల భూమిని బినామీ వ్యక్తుల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు రూపొందించి కొనుగోలు చేశారని న్యాయవాది వినోద్ కొంతకాలం క్రితం ఆరోపించారు. అంతేకాక ఈ భూమిని కోట్లాది రూపాయలకు అక్రమంగా అమ్ముకున్నారని పేర్కొన్నారు.
ఇక యడ్యూరప్ప కుమార్తె అరుణాదేవి కూడా కేహెచ్‌బీ సైట్‌లను బినామీ పేరిట సొంతం చేసుకొని వాటిని కోట్లాది రూపాయలకు అమ్ముకోవడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప సైతం శివమొగ్గ జిల్లాలో అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించారని, శివమొగ్గ ప్రాంతంలో 4,39,898 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారని, ఆయనకుటుంబ సభ్యుల పేరిట అనేక ప్రాంతాల్లో అక్రమ ఆస్తిని కూడబెట్టారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించి సమగ్ర విచారణను నిర్వహించి నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిందిగా కోరుతూ శివమొగ్గ లోకాయుక్త కోర్టును ఆశ్రయించారు.
అయితే సరైన ఆధారాలు, అనుమతులు లేనందున ఈ విచారణను నిలిపివేయాలని యడ్యూరప్ప, ఈశ్వరప్పలు శివమొగ్గ లోకాయుక్త కోర్టును కోరడంతో కోర్టు ఈ విచారణపై స్టే విధించింది. దీంతో న్యాయవాది వినోద్ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన కేసుపై మంగళవారం పూర్తి స్థాయి విచారణను జరిపిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం శివమొగ్గ లోకాయుక్త కోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేసింది. అంతేకాక యడ్యూరప్ప, రాఘవేంద్ర, అరుణాదేవి, ఈశ్వరప్పలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశాలు జారీ చేసింది.