దావణగెరె : సంగొళ్లి రాయణ్ణ బ్రిగేడ్ ఇకపై రాజకీయేతర శక్తిగా ముందుకు సాగుతుందని విధాన పరిషత్ విపక్ష నేత, బ్రిగేడ్ స్థాపకుడు కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. వెనుకబడిన, దళిత మఠాధిపతుల సమాఖ్య గౌరవాధ్యక్షుడు పురుషోత్తమానందపురి స్వామీజీ, అధ్యక్షులైన నిరంజనానందపురి స్వామీజీ, మాదార చెన్నయ్య స్వామీజీలతో బ్రిగేడ్ కార్యకలాపాల గురించి చర్చించామని, ఆ సమయంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు, యడ్యూరప్పను సీఎంను చేసేందుకే బ్రిగేడ్‌ని స్థాపిస్తే తాము కొనసాగబోమని చెప్పారని, అందువల్ల వెనుకబడిన, దళిత సమాజాలకు సామాజిక న్యాయం కల్పిస్తే బ్రిగేడ్‌కు సహకారం అందిస్తామని చెప్పినందున సంగొళ్లి రాయణ్ణ బ్రిగేడ్‌ను ఇకపై రాజకీయేతరంగా ముందుకు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు.
జీవితాంతం బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కరువు పీడిత తాలూకాల జాబితా ప్రకటిస్తే సరిపోదని, కరువును సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈసందర్భంగా మాజీ మంత్రి రవీంద్రనాథ్, డాక్టర్ శివయోగిస్వామి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.