రాజకీయాల్లోకి రావడానికి బీఎస్‌వై, కేఎస్‌లే కారణం
కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సిద్దేశ్వర్
దావణగెరె : తన రాజకీయ రంగ ప్రవేశానికి బీజేపీ నేతలు బీఎస్ యడ్యూరప్ప, కేఎస్ ఈశ్వరప్పలు కారకులే తప్ప స్థానిక బీజేపీ నాయకులెవరూ కాదని మాజీ కేంద్ర మంత్రి, దావణగెరె లోక్‌సభ సభ్యుడు జీఎం సిద్దేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మాజీ మంత్రి ఎస్‌ఏ రవీంద్రనాథ్ తదితరులు తనను, తన తండ్రి మల్లికార్జునప్పను బీజేపీలోకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారని, అయితే అది వాస్తవం కాదన్నారు. తనను బీజేపీలోకి ఆహ్వానించింది యడ్యూరప్ప, ఈశ్వరప్పలతో పాటు సంఘ్ పరివార్ కృష్ణమూర్తిలని స్పష్టం చేశారు. స్థానిక నాయకులెవరూ తనను బీజేపీలోకి పిలుచుకు రాలేదన్నారు. తాను గెలుపొందిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో తనకు బీ-ఫారం ఇవ్వరాదని జాతీయ నాయకులపై ఒత్తిడి తెచ్చేందుకు స్థానిక నాయకులు ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవా చేశారు.
తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించడం ద్వారా పార్టీని బలోపేతం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి యడ్యూరప్పను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనే ఏకైక ఉద్దేశంతో తన మంత్రి పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీకి నిజాయితీపరులైన కార్యకర్తలున్నారన్నారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించబోనన్నారు. అయితే 2019లో మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది, 2024లో రాజకీయ పదవీ విరమణ చేస్తానన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు.
ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు యశవ ంతరావ్ జాధవ్, మాజీ మంత్రి ఎంపీ రేణుకాచార్య, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఏ.జీవనమూర్తి, బీజేపీ నాయకుడు ఆనందప్ప తదితరులు పాల్గొన్నారు.