దావణగెరె : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవినలంకరించిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపడతారని విధాన పరిషత్ విపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప జోస్యం పలికారు. ఆయన సోమవారం దావణెగెరో విలేకరులతో మాట్లాడుతూ యడ్యూరప్ప పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికవడం తనకు ముఖ్యమంత్రి అయినంత సంతోషం కల్గించిందన్నారు. ఇప్పటికే ప్రజలు ఎప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయా? ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుదామా? అని ఎదురు చూస్తున్నారన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, అధికారులకు ప్రజా సేవ చేయాలనే ఆసక్తే లేదన్నారు. రాష్ట్రంలో 1000 రక్షిత మంచినీటి యూనిట్లు స్థాపించినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేసిందో గణాంకాలు వెల్లడించాలని సవాల్ విసిరారు. ఈ విషయంలో సంబంధిత మంత్రి హెచ్‌కే పాటిల్ వివరాలందించకుంటే ఆయనను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు.