Aqua merchant
-
రైతు నోట ఆ మాట రావద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన రేట్లకే ఆక్వా ఉత్పత్తులు అమ్ముడు పోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వాటికి సంబంధించి లేబర్ సమస్యతోపాటు ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతు తాను కనీస రేటుకు అమ్ముకోలేకపోతున్నానన్న మాట రాకూడదని.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు, వాటి ధరలు, మార్కెటింగ్‌పై ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (అధిక ధరలకు అమ్మితే... శిక్ష తప్పదు: సీఎం జగన్) ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆక్వా పంటకు కనీస గిట్టుబాటు ధరలు రావాలని ఆదేశించారు. ఎంపెడాలో చెప్పిన రేట్లకు కొనుగోలు చేయడానికి వాళ్లు ముందుకు రాకపోతే మీ ప్రత్యేక అధికారాలను వాడాలని కలెక్టర్లకు సూచించారు. జాతీయ విపత్తు సమయంలో కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. అవసరమైతే ఆ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్వాధీనం చేసుకునేందుకు వెనుకాడవద్దని సూచించారు. ముందుగా రైతుల దగ్గర నుంచి ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేసి వెంటనే ప్రాసెసింగ్ చేయాలని, అనంతరం మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని తెలిపారు. ఒకవేళ ప్రాసెసింగ్ యూనిట్లు వెనుకడుగు వేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ వాళ్లతో మాట్లాడి వెంటనే ఎగుమతి అయ్యేలా చూడాలన్నారు. ప్రతిరోజు నిర్దిష్ట సమయం కేటాయించుని వ్యవసాయం, ఆక్వాకు సంబంధించిన పరిస్థితుల గురించి నిరంతరం సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. దీనికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అందుబాటులో ఉండి సమీక్షిస్తారని పేర్కొన్నారు. -
దోచేసి..దొరికేసి..
►అమలాపురంలో సినీఫక్కీలో చోరీ ►రూ. 25 లక్షలు దోచుకుని రోడ్డుపై విసిరేసి వైనం ►వెంబడించి పట్టుకున్న బాధితుడు, పోలీసులు ►భట్నవిల్లిలో రూ.20 లక్షలు స్వాధీనం ►చోరీ సొత్తులో రూ.ఐదు లక్షలు మాయం అమలాపురం రూరల్/కాట్రేనికోన : లక్షలాది రూపాయలతో కారులో వెళుతున్న వ్యక్తిని... ఓ దొంగల ముఠా వెంబడించి రూ.25 లక్షలు కాజేసింది. అయితే ఆ సొమ్ము పోగొట్టుకున్న వ్యక్తి సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, దానికి పోలీసుల సహకారం తోడవడంతో చోరీ సొత్తులో రూ.20 లక్షలు దక్కాయి. అచ్చం సినీఫక్కీ మాదిరి జరిగిన ఈ సంఘటన అమలాపురంలో జరిగింది. చోరీకి పాల్పడిన ముఠాలో మొత్తం నలుగురు సభ్యులు ఉండగా... వారిలో ముగ్గురు పట్టుబడ్డారు. ఒకరు పరారయ్యాడు. అయితే మరో ఐదు లక్షలు ఏమయ్యాయో దర్యాప్తులో తేలాల్సి ఉంది. అమలాపురానికి చెందిన ఆక్వా వ్యాపారి యనమదల వేణు బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.25 లక్షల నగదును డ్రా చేశాడు. నగదు బ్యాగ్‌ను తన కారులో ఉంచి తానే డ్రైవ్ చేసుకుంటూ స్థానిక ఎర్రవంతెన వద్ద గల తన దుకాణం వద్దకు బయల్దేరాడు. ఈ విషయాన్ని గమనించిన దొంగల ముఠా తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న తెలుపు రంగు కారు(టీడబ్ల్యూ 02వై 8739)లో వెంబడించింది. ఎర్రవంతెన వద్ద దుకాణం ముందు వేణు కారు నిలిపి దుకాణంలోకి వెళ్లగానే.. ముఠాలోని ఓ వ్యక్తి వేణు కారులోని రూ. 25 లక్షల నగదు ఉన్న సంచిని పట్టుకుని మెరుపు వేగంతో వారి కారు ఎక్కి ముమ్మిడివరం వైపు పరారయ్యారు. ఈ విషయాన్ని గమనించిన వేణు తక్షణమే పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించాడు. అంతటితో ఆగకుండా తన మోటార్ సైకిల్‌పై దొంగల ముఠా కారును వెంబడించాడు. మరో ఇద్దరిని తోడుగా తీసుకెళ్లాడు. సుమారు గంటసేపు వేణు దొంగల ముఠా కారును ఛేజ్ చేశాడు. తమను ఎవరో వెంబడిస్తున్నారని గమనించిన దొంగలు తొలుత తమ కారును 216 జాతీయ రహదారి మీదుగా జిల్లా కేంద్రం కాకినాడకు వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే తమ కారుపై ఛేజింగ్ జరుగుతుండడంతో దొంగలు తమ కారును ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు వద్ద మలుపు తిప్పి కాట్రేనికోన వైపు మళ్లించాడు. కారును బాధితుడు వేణు మోటార్ సైకిల్‌పై ఛేజ్ చేస్తూనే కారు ఆచూకీని ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తూనే ఉన్నాడు. అప్పటికే అమలాపురం రూరల్ సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి ముమ్మిడివరం సర్కిల్‌తోపాటు కాకినాడ వరకు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో ముమ్మిడివరం సర్కిల్ పోలీసులు ముఠా కారును కనుగొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పుడైతే కారు కాట్రేనికోన వైపు వెళ్లిందో ఆ మండల పోలీసులను అప్రమత్తం చేశారు. కాట్రేనికోన ఎస్సై వెంకట త్రినాథ్ మండలంలోని దారులన్నీ పోలీసు సిబ్బంది, స్థానికుల యువకులతో అప్రమత్తం చేశారు. ముఠా కారు అతివేగంగా కాట్రేనికోన, పల్లంకుర్రు దాటుకుని సముద్ర తీర గ్రామమైన బలుసుతిప్ప గ్రామంలోకి వెళ్లింది. తీర గ్రామం కావడంతో అక్కడి వరకు మాత్రమే రోడ్డు ఉంది. దీనితో ముఠా తక్షణమే కారు వెనక్కి తిప్పి మళ్లీ అదే దారిలో వెనక్కి వస్తుండగా పల్లంకుర్రు ఏటిగట్టు వద్ద అప్పటికే మాటువేసిన పోలీసులు, స్థానికులు కారును అడ్డుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న ముఠాలో ఒకడు డోరు తీసుకుని పరారయ్యాడు. కారులో మిగిలిన ముగ్గురు దొంగలు పోలీసులకు చిక్కారు. భట్నవిల్లిలో... రూ.20లక్షలు విసిరేసి... : దొంగల ముఠా కారు ఛేజింగ్ ఒక ఎత్తయితే.. ఇంతలో అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఓ పరిణామం ఈ చోరీలో అనూహ్యంగా మలుపుతిప్పింది. భట్నవిల్లిలో డీసీసీబీ డెరైక్టర్ యిళ్ల గోపాలకృష్ణ తన ఇంటి ముందు రోడ్డులో ఓ సంచిని గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, పట్టణ ఎస్సై రామారావులు వచ్చి ఆ సంచిని స్వాధీనం చేసుకుని తెరిచి చూస్తే సంచిలో రూ.20 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. వేణు ఛేజ్ సమయంలోదొంగల ముఠా కారులోంచి డబ్బు సంచి విసిరేసింది. ఇది గమనించిన వేణు విషయాన్ని తన వెంట మరో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులకు చెప్పాడు. ఇంతలో సీఐ శ్రీనివాసరెడ్డి రూ.20 లక్షల నగదు ఉన్న సంచిని స్వాధీనం చేసుకున్నారు. వేణు మనుషులు వచ్చి అది తమదేనని చెప్పినా పోలీసులు నమ్మలేదు. నగదు స్వాధీనం చేసుకుని అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తరువాత పూర్తిస్థాయిలో విచారించి, ఆ సొమ్ము వేణుదేనని నిర్ధారించారు. మిస్టరీగా రూ. ఐదు లక్షలు అయితే వేణు రూ.25 లక్షలు డ్రా చేస్తే రూ.20 లక్షలు మాత్రమే దొరకడంతో మిగిలిన రూ. ఐదు లక్షలు ఏమయ్యాయనే ప్రశ్న చర్చనీయాంశమైంది. అయితే పోలీసులు కొన్ని కోణాల్లో అనుమానిస్తున్నారు. దొంగల ముఠా రూ.20 లక్షల సంచి విసిరేసినట్టే, మరికొంత దూరంలో రూ.ఐదు లక్షలను విసిరేశారా? కాట్రేనికోన మండలం పల్లంకుర్రు ఏటిగట్టు వద్ద దొంగల ముఠా పట్టుబడినప్పుడు కారులోంచి పరారైన వ్యక్తి వాటిని పట్టుకుపోయాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది తమిళనాడు ముఠా పనేనా...?: తమిళనాడు రిజిస్ట్రేషన్ స్విఫ్ట్‌కారులో దొంగల ముఠా రావడంతో ఈ చోరీ ఆ ప్రాంతానికి చెందిన ముఠాపనేనా అనే దిశగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. ఈ ముఠాలో ఒక యువకుడు గతంలో తమిళనాడులోని ఓ షిప్పింగ్ హార్బర్లో పనిచేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే మరో ఇద్దరు యువకుల మాటలు నెల్లూరు జిల్లా యాసతో ఉండడంతో ఆ జిల్లాకు చెందిన వారా అనే దిశగా కూడా విచారిస్తున్నారు. ఇక్కడికే ఎందుకొచ్చారు? ఆక్వా కల్చర్‌కు పెట్టని కోట అయిన కోనసీమలో అమలాపురం ఎర్రవంతెన కేంద్రంగా ఆక్వా వ్యాపారం రూ.కోట్లలో విస్తరించింది. ప్రతి రోజూ ఇక్కడ రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. నెల్లూరు జిల్లాలో కూడా ఆక్వా రంగం విస్తరించి ఉంది. అక్కడి వ్యాపారులతో ఇక్కడి వారికి వ్యాపార సంబంధాలు ఉంటాయి. పెపైచ్చు ఆక్వా సొమ్ములకు బిల్లులు, రసీదులు ఉండవు. అంతా చిన్నపాటి స్లిప్పులతోనే సాగిపోతుంది. ఈ క్రమంలో బాధితుడు వేణుకు, దొంగల ముఠాగా భావిస్తున్న వ్యక్తులకు వ్యాపార సంబంధమైన వివాదాలు ఏమైనా ఉన్నాయా? ఈ క్రమంలోనే సినీ ఫక్కీలో ఇదంతా జరిగిందా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.