రూ.7కోట్లతో పురావస్తుశాఖ పనులు
కొల్లాపూర్: రాష్ట్రవ్యాప్తంగా రూ.7కోట్లతో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆ శాఖ డైరెక్టర్ విశాలాక్షి వెల్లడించారు. మంగళవారం ఆమె మండలపరిధిలోని మంచాలకట్ట రామ తీర్థాలయాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలోని జాకారం, కొండపర్తిలో ఆలయ పునర్నిర్మాణానికి, హైదరాబాద్ స్టేట్ మ్యూజియం ఆధునికీకరణ, ఖైరతాబాద్ మాస్క్, పురానాపూల్ గేట్ నిర్మాణ పనులు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్లు వివరించారు.
సోమశిలలోని పురాతన విగ్రహాలను రీఅలైన్మెంట్ ద్వారా దిమ్మెలపై ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంచాలకట్ట రామ తీర్థాలయాన్ని కూడా మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నరేందర్‌రెడ్డి డైరెక్టర్ విశాలాక్షి్మని కలిశారు. మంచాలకట్ట రామ తీర్థాలయ ప్రాశస్త్యాన్ని దేవాదాయ శాఖ, పురావస్తు శాఖలు సరైన రీతిలో ప్రచారం చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో రామ తీర్థాలయ అభివృద్ధికి చర్యలు చేపడతామని డైరెక్టర్ విశాలాక్షి వెల్లడించారు. ఆమె వెంట పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రహీంషాఅలీ, ఏడీలు నాగరాజు, నర్సింగ్‌నాయక్ ఉన్నారు.