నకిలీ వైద్యుడి అరెస్ట్
చిక్కడపల్లి, న్యూస్‌లైన్: తప్పుడు సర్టిఫికెట్లతో వైద్యుడిగా చెలామణి అవుతూ ఇటు ప్రజల్ని..అటు వైద్యాధికారులను మోసగిస్తున్న వక్తిని చిక్కడపల్లి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పరారీలో ఉన్న ఇతని భార్య కోసం గాలిస్తున్నారు.
ఇన్స్పెక్టర్ ఎన్.లక్ష్మీనారాయణరాజు, డీఎస్ఐ ఎ.నర్సింహరావు తెలిపిన వివరాల ప్రకారం.. సిక్కొండ వెంకటరమణ అలియాస్ ఆరెళ్ల వెంకటరమణ (48) పేర్లు మార్చుకుంటూ వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు. కాగా, మొదటి భార్య షేక్ అబీబ్కి చెల్లించాల్సిన మనోవర్తిని ఎగ్గొట్టేందుకు పథకం వేశాడు. తన పేరు మీద ఉన్న కారును చిక్కడపల్లికి చెందిన తోట రామయ్యకు విక్రయించినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు.
ఈ విషయం తెలిసిన రామయ్య చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు ఫిర్యాదు మేరకు వెంకటరమణ, అతడి రెండో భార్య కల్పనపై పలు స్టేషన్లలో చీటింగ్ కేసులు ఉన్నట్లు తెలిసింది. తప్పుడు పత్రాలతో ఇద్దరూ పలు చోట్ల క్లినిక్‌లు నిర్వహించారు. వైద్యాధికారులు దాడులు చేసిన ప్రతి సారి తమ మకాన్ని మరో చోటికి మార్చేవారు.
ఇలా రెహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడలో వైద్యులుగా చెలామణి అవుతున్నారు. వీరిపై ఫిర్యాదులందడంతో డీఎంహెచ్ఓ డాక్టర్ నరేంద్రుడు తనిఖీ చేసేందుకు వెళ్లగా క్లినిక్‌ను మూసేశారు. వారి వద్ద సరైన సర్టిఫికెట్లు లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఈనెల 16 లోగా వైద్య వృత్తికి సంబంధించిన సర్టిఫికెట్లను చూపాలని పేర్కొన్నారు.
అయినా మోసాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతుండగా చిక్కడపల్లి పోలీసులు సోమవారం యూసుఫ్‌గూడలో వెంకటరమణను అరెస్ట్ చేశారు. ఇతడి రెండో భార్య కల్పన పరారీలో ఉంది. వీరిపై పంజ గుట్ట, మాదాపూర్, చిలకలగూడ, చిక్కడపల్లి తదితర పోలీసుస్టేషన్లలో కేసులున్నాయి.