కూండ్రం చేరిన ఆర్మీజవాన్ మృతదేహం
* కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు
* నాయుడుబాబు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపిన
* ఆర్మీ అధికారులు నేడు అంత్యక్రియలు
తుమ్మపాల: జమ్మూకాశ్మీర్‌లో మృతి చెందిన ఆర్మీ జవాన్ సేనాపతి నాయుడుబాబు మృతదేహం స్వగ్రామం కూండ్రంకు సోమవారం రాత్రి 10 గంటలకు తీసుకొచ్చారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న కొడుకు శవమై రావడాన్ని తల్లిదండ్రులు ఈశ్వరరావు, రాము, ఇతర కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.
మృతదేహాన్ని జమ్మూకాశ్మీర్‌లోని 54ఆర్ఆర్ యూనిట్ నుంచి సుబేదార్ ఇ. శ్రీనివాసరావు, నాయక్ నరేష్‌లు విమానంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తరలించారు. గ్రామమంతటా విషాదం అలుముకుంది. జవాన్ మృతికి సంబంధించి ఇక్కడకు వచ్చిన ఆర్మీ అధికారులు శ్రీనివాసరావు, నరేష్ మాట్లాడుతూ 25వ తేదీ రాత్రి నాయుడుబాబు తనంతటతానే గుండెలపై గన్‌తో కాల్చుకొని మరణించాడని తెలిపారు.
ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ కూడా రాసినట్టు తెలిపారు.
స్వగ్రామం వచ్చేందుకు ఈ నెల 28వ తేదీన రైల్వే రిజర్వేషన్ కూడా చేయించుకున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు కారణం తెలియరాలేదన్నారు. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారని, త్వరలో ఇక్కడకు కూడా వచ్చి విచారణ చేపడతారన్నారు. మృతదేహానికి మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.