పాప ముఖంపై పులిపిర్లు... తగ్గుతాయా?
ఆయుర్వేదం కౌన్సెలింగ్
నా వయసు 47 ఏళ్లు. నాకు సెక్స్ మీద మక్కువ ఎక్కువ. కామోద్దీపనకు మంచి ఆయర్వేద మందులు సూచించండి.
- టి.కె.శర్మ, శ్రీకాకుళం
ఆయుర్వేదపు అష్టాంగాలలో ఒకటైన ‘వాజీకరణ తంత్రం’ ప్రధానంగా శృంగార సామర్థ్యానికి సంబంధించిందే. సంతానకర, క్షమత్వకర విశేషాలు ఈ భాగంలో వివరించారు. వీర్యవృద్ధికీ, శుక్రోత్పాదనకూ సంబంధించిన ఔషధాలను మూడో స్థానంలో ఉంచింది. మొదటి రెండు స్థానాలూ ఆహార విహారాలు. నేటి జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, శీతల పానీయాలు, పిజ్జాలు సేవిస్తూ, మానసిక ఒత్తిడికి లోనవుతూ ఆదరాబాదరా రతికార్యక్రమం జరపాలనుకుంటే అది అసాధ్యం. ముఖ్యంగా మీ వయసులో జీవితానికి సంబంధించిన ఎన్నో బాధ్యతలు, రక్తవ్యాలతో సతమతమవుతూ, శృంగారంపై ఏకాగ్రత చూపించలేరు. అందువల్ల మీరు ఔషధాలను వెతుక్కుంటున్నారు. మీరు ఆహారంతోనే ఈ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ముడిబియ్యం, గోధుమలు ప్రధానంగా ఉండే పోషకాహారంతో పాటు మినుములు, నువ్వులు, పెసలు, ఆవునెయ్యి, ఆవుపాలు, పాత బియ్యం సేవించాడానికి ప్రాధాన్యమివ్వాలి. కల్తీలేని మధురఫలాలు, డ్రైఫ్రూట్స్, పాయసం మొదలైనవి సేవించాలి. మాంసరసం, గుడ్లు కూడా బాగా ఉపయోగపడతాయి. బీపీ షుగరు వంటి వ్యాధులు ఉంటే నియంత్రించుకోవాలి. ప్రతిరోజూ తగిన వ్యాయామం, ప్రాణాయామం చేయాలి. దుర్వ్యసనాలకూ దూరంగా ఉండాలి. తగినంత నిద్ర అవసరం.
వాజీకరణ ప్రక్రియలు: ప్రశాంత వాతావరణం, సుగంధ పరిమళాలు, శ్రావ్య సంగీత రవళి, అలంకార భూషిత ఇష్టసఖి, ప్రియభాషణలు, స్త్రీపురుషుల పరస్పర ఉత్ప్రేరక భావోద్వేగాలు - అత్యంత ముఖ్యమని వర్ణించింది ఆయుర్వేదం. మానసిక ప్రశాంతత, పరస్పర ప్రేమానురాగాలకు మరీ ప్రాధాన్యమిచ్చింది. అప్పుడు అసలైన ఉద్దీపన, అంగస్తంభన కలుగుతాయని చెబుతూ, స్త్రీ ప్రేరణే అసలైన వాజీకరణ సాధనమని చెప్పారు. ‘‘వాజీకరం అగ్య్రంచ క్షేత్రం స్త్రీయా ప్రహర్షిణీ... కింపునః స్త్రీ శరీరయే సంఘాతేన ప్రతిష్ఠితాః’’
ఔషధాలు: (1)వానరీగుటిక (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1. (2)అశ్వగంధలేహ్యం ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా చప్పరించి పాలు తాగాలి. (3)శిలాజిత్ (క్యాప్సూల్స్) : ఉదయం 1, రాత్రి 1. జననాంగాలకు రక్తప్రసరణ బాగా జరగాలి. దీనికోసం: అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చినచెక్క చూర్ణంలో కషాయం కాచుకొని 30 మి.లీ. మోతాదులో రెండుపూటలా తాగాలి మానసిక ప్రశాంతతకు సరస్వతీలేహ్యం ఒక చెంచా రెండుపూటలా తీసుకోవాలి శ్రీగోపాలతైలాన్ని పురుషాంగం మీద మర్దనకు, క్షీరబలాతైలాన్ని స్త్రీలలో శుష్కయోనికి స్థానికంగా వాడుకోవచ్చు. గమనిక: ఈ వాజీకరణ ప్రక్రియలు, ఔషధసేవన అనే అంశాలు స్త్రీపురుషులిద్దరూకీ సమానంగా వర్తిస్తాయి. ఏ ఒక్కరిలో ఉత్సాహం, ఉత్తేజం కొరవడినా రతిసౌఖ్యం అసంపూర్ణం, శూన్యమని శాస్త్రోక్తం.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు,
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్.
కార్డియాలజీ కౌన్సెలింగ్
నాకు ఈ మధ్య తరచుగా నడచినా, మెట్లు ఎక్కినా, ఛాతీ మధ్య భాగంలో బరువుగా ఉంటూ, కాస్త ఆయాసంగా ఉంటోంది. నేను అంతకుముందు బాగా నడక మరియు ఇతరత్రా వ్యాయామం కూడా చేసినా ఏమీ కాకుండా నార్మల్‌గా ఉంటుండేది. కానీ ఈ మధ్య చేయలేకపోతున్నాను. కారణం ఏమై ఉంటుంది? వివరించండి.
- రమాసుందరి, కైకలూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు యాంజినాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. కానీ మీరు భయపడాల్సినదేమీ లేదు. వెంటనే మీరు దగ్గర్లో ఉన్న గుండెవైద్య నిపుణుడిని సంప్రదించి వారు చెప్పిన పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స తీసుకోగలరు.
మాకు గుండెజబ్బును గుర్తించడం ఎలా, అది వచ్చినప్పుడు తక్షణం చేయాల్సిన ప్రథమ చికిత్స గురించి వివరించండి.
- నీలిమ, హైదరాబాద్
ఛాతీ నొప్పి, ఛాతీ మధ్య భాగంలో బరువుగా ఉండి, నడిచినా, పనిచేసినా, పెరుగుతూ రెస్ట్‌తో తగ్గుతుంది. ఛాతీ నుండి ఎడమ చేతికి గానీ లేదా గొంతుకలోకి గానీ నొప్పి పాకుతున్నప్పుడు గుండె నొప్పిగా భావించాలి. అప్పుడప్పుడు గ్యాస్‌తో కూడిన తేన్పులు రావడం, చెమటలు పట్టడం కూడా జరుగుతుంది. నాలుక కింద సార్బిట్రేట్ ఏమైనా తీసుకున్నట్లయితే ఈ నొప్పి తగ్గుతుంది.
ఈమధ్య తరచుగా ఛాతీ ఎడమవైపు ఒక చోట సూదితో గుచ్చినట్లుగా ఒకసారి, మరి పొడిచినట్లుగా మరోసారి కొన్ని నిమిషాలపాటు వస్తుంది. నా ఇంకొక పరిశీలన ప్రకారం నేను ఆఫీస్‌లో వర్క్‌లో ఉన్నప్పుడు ఏమీ అనిపించడం లేదు. కానీ ఇంట్లో ఒక్కడినే ఖాళీగా ఉన్నప్పుడు తరచుగా అలా అనిపిస్తోంది. గుండె జబ్బా అని భయమేస్తోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
- సుదర్శన్, భీమవరం
మీరు చెప్పిన దాన్ని బట్టి గుండె నొప్పి, తీవ్రమైన జబ్బులాలేదు. ఏదైనా జబ్బు వల్ల ఉండి ఉంటే ఖాళీ సమయంలో వచ్చి, వర్క్ చేసుకుంటున్నప్పుడు రాకుండా ఉండదు. గుచ్చినట్లు, పొడిచినట్లు ఉండే నొప్పి గుండె జబ్బు లక్షణం కాదు. మీరు మీ దగ్గరలో ఉన్న గుండె వైద్య నిపుణుడిని సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, వారి సలహా మేరకు మందులు వాడండి. మీ ఒత్తిడిని తగ్గించుకోడానికి యోగా చేయండి. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తూ, మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఉండండి. మీకు ఒత్తిడి వల్ల వచ్చిన సమస్యలా అనిపిస్తోంది తప్ప గుండెజబ్బులా అనిపించడం లేదు. కాబట్టి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ముందుజాగ్రత్త కోసం మాత్రమే కార్డియాలజిస్ట్ కలవండి.
డాక్టర్ శ్రీనివాసకుమార్
కార్డియాలజిస్ట్,
సిటిజెన్స్ హాస్పిటల్స్,
శేరిలింగంపల్లి,
హైదరాబాద్.
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా అమ్మాయికి ఎనిమిదేళ్లు. ఆమెకు ముఖంపై చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి వస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్నాయి. డాక్టర్‌కు చూపించాం. క్రమేపీ తగ్గే అవకాశం ఉందని డాక్టర్ చెప్పినప్పటికీ, వీటిని చూసిన కొంతమంది మాత్రం అవి జీవితాంతం ఉంటాయని అంటున్నారు. దాంతో మాకు ఆందోళనగా ఉంది. మా పాప సమస్య ఏమిటి? దానికి తగిన పరిష్కారం చెప్పండి.
- భాను, గుంటూరు
మీరు చెప్పిన వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్ కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ఇటీవలి అధ్యయనాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా కనిపించే సమస్యే. అయితే మరీ ముఖ్యంగా రెండు నుంచి 12 ఏళ్ల పిల్లల్లో దీన్ని చాలా ఎక్కువగా చూస్తుంటాం.
వ్యాప్తి జరిగే తీరు: చర్మానికి చర్మం తగలడం వల్ల, ఒకరు వాడిన టవల్స్ మరొకరు ఉపయోగించడంతో పాటు వారి నుంచి వారికే అంటే... చర్మంపైన ఒకచోటి నుంచి మరోచోటికి కూడా వ్యాపిస్తుంది. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిర్లు లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపించవచ్చు.
చికిత్స ఇలా: పులిపిర్లు తగ్గడానికి కొంతకాలం వేచిచూడటం మంచిది, ఆ తర్వాత క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో పాటు ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఇమ్యునలాజికల్ మెడిసిన్స్‌తో వీటికి చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను పులిపిర్లు (లీజన్స్) ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు పైన పేర్కొన్న ఇమిక్యుమాడ్ వాడటం వల్ల మరీ మంచి ఫలితాలు ఉంటాయి. మీరు మరొకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, చికిత్సను కొనసాగించండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్,
రోహన్ హాస్పిటల్స్,
విజయనగర్ కాలనీ,
హైదరాబాద్.