ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకే ఆర్ట్ ఫౌండేషన్
చంద్రగిరి : స్థానిక ఆర్టిస్టులతో పాటు దేశ, విదేశాల్లోని ఆర్టిస్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు విద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ, మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మంచు విష్ణు తెలిపారు. ఆదివారం విద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఆర్ట్ ఫౌండేషన్ వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యాసంస్థల అధినేత డాక్టర్ మంచు మోహన్‌బాబు, సీఈఓ విష్ణు పాల్గొన్నారు.
తొలుత కుటుంబ సమేతంగా మోహన్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన ఆర్టిస్టులు వారి కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. మంచు విష్ణు మాట్లాడుతూ వరుసగా నాలుగో సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక ఆర్టిస్టులతో పాటు దేశ, విదేశాల ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా నిర్మించిన లైబ్రరీలో సుమారు రూ.30కోట్ల విలువైన పెయింటింగ్‌లను ప్రదర్శనగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని విష్ణు స్పష్టం చేశారు.