కలవరపరిచే కీళ్లనొప్పి.. రుమటాయిడ్ ఆర్థరైటిస్
హోమియో కౌన్సెలింగ్
నాకు కీళ్లలో విపరీతమైన నొప్పిగా ఉంది. ఏమాత్రం కదిలినా నొపి తీవ్రమవుతోంది. కీళ్ల కదలికలు చాలా కష్టంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఉదయం వేళలో ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంది. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి.
– నరసింహారావు, వరంగల్
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన శరీర భద్రతావ్యవస్థ మనపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి చిన్న ఎముకలు, కీళ్లు, మెడ ఎముకలు వంటి చోట్ల వచ్చే అవకాశం ఉంది. కీళ్ల చుట్టూ ఉండే పొరలో వాపు వచ్చి అక్కడి కణాలు పెద్దగా మారి, అక్కడ స్రవించే ద్రవపదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల ఎముకలు దెబ్బతిని, కీళ్లు బిగపట్టినట్లు అవుతుంది. దాంతో కదలికలు కష్టంగా మారతాయి.
లక్షణాలు
►కీళ్ల వాపు, నొప్పి, కదలికలు కష్టంగా మారతాయి.
►ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగబట్టినట్లుగా ఉండి, నొప్పి ఎక్కువగా వస్తుంది.
►కీళ్లు దెబ్బతినడం వల్ల చేతి వేళ్లు కొంకరపోవడం, స్వాన్నెక్ డిఫార్మిటీ, జడ్ థంబ్ డిఫార్మిటీ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
►మడమ, చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావచ్చు.
►నీరసం, అలసట, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
ఇతర లక్షణాలు
►వ్యాధి తీవ్రస్థాయికి చేరినప్పుడు కీళ్లనే కాకుండా ఊపిరితిత్తుల్లో నీరు పట్టడం, ఊపిరితిత్తులు గట్టిపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
►మూత్రపిండంలోని నెఫ్రాన్స్ పొరులు వాచి మూత్ర సమస్యలు రావచ్చు.
► గుండె పొరల వాపు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యలు రావచ్చు.
►కంటి పొరల వాపు, కాలేయం వాపు, రక్తహీనత, నరాల సమస్యలు వంటివి వచ్చే అవకాశం ఉంది.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు :
► రక్తపరీక్షలు (సీబీపీ), ఈఎస్ఆర్
►ఎమ్మారై జాయింట్స్
►కీళ్ల ఎక్స్–రే (దీనితో వ్యాధి తీవ్రతను తెలుసుకోవచ్చు)
►రుమటాయిడ్ ఫ్యాక్టర్
►క్రియాటివ్ ప్రోటీన్ ’ రీనల్ ఫంక్షన్ టెస్ట్ ’ లివర్ ఫంక్షన్ టెస్ట్ ’ ఏసీపీఏ టెస్ట్‌తో మన శరీరంలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలను తెలుసుకోవచ్చు.
హోమియో చికిత్స
ఈ సమస్యకు హోమియోలో కాల్చికమ్, ఆర్సినికమ్ ఆల్బమ్, లైకోపోడియమ్, రోడోడెండ్రాన్ వాడదగిన మందులు. అయితే లక్షణాలను బట్టి నేట్రమ్ ఆర్స్, డల్కమెరా, కాలిఅయోడ్, నాట్రమ్మూర్, ఆసిడ్ బెంజ్, రస్టాక్స్ వంటి మందులు కూడా ఉపశమనానికి బాగా ఉపయోగపడతాయి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డిఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతిహైదరాబాద్