హెచ్‌సీఎల్ టెక్ చేతికి జర్మనీ కంపెనీ
న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ... జర్మనీకి చెందిన ఐటీ, ఇంజినీరింగ్ సర్వీసుల కంపెనీ హెచ్ అండ్ డీ ఇంటర్నేషనల్ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. జర్మనీలోని వోల్ఫోబర్గ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీని 3 కోట్ల యూరో(దాదాపు రూ.240 కోట్లు)లకు కొనుగోలు చేశామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది.
ఈ కంపెనీ కొనుగోలుతో జర్మనీ మార్కెట్లో తాము మరింతగా దూసుకుపోగలమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్(కార్పొరేట్) అశిష్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ ఆటోమోటివ్ రంగంలో తమ నైపుణ్యం మరింతగా మెరుగుపడగలదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి ఈ కంపెనీ కొనుగోలు పూర్తవ్వగలదని తెలిపారు.
జర్మనీలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన హెచ్ అండ్ డీ ఇంటర్నేషనల్ గ్రూప్ అమెరికా, చెక్ రిపబ్లిక్, పోలండ్‌ల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఏడాది ఈ కంపెనీ ఆదాయం 7.41 కోట్ల యూరోలుగా ఉంది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేర్ 1 శాతం లాభంతో రూ.919 వద్ద ముగిసింది.