ashish thakkar
-
‘స్పేస్ టికెట్’ వివాదం కేసులో ఓడిన భర్త
లండన్: ‘స్పేస్ టికెట్’వివాదంతో కోర్టుకెక్కిన భారత సంతతికి చెందిన ఓ జంట విడాకుల కేసులో భర్త ఆశిష్ ఠక్కర్ ఓడిపోయారు. ఆశిష్ తన భార్య మీరా మానెక్‌కి తగిన భరణాన్ని ఇవ్వాల్సిందేనని ఇంగ్లండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. తనకు రావాల్సిన భరణం చెల్లించకుండా ఉండేందుకు తన భర్త ఆశిష్ ఆస్తులను తక్కువగా చేసి చూపిస్తున్నారని మీరా బ్రిటన్ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. 2008లో వివాహం చేసుకున్న వీళ్లు 2013లో విడిపోయారు. ఆశిష్ బిలియనీర్ అని, తన ఆస్తిని కేవలం 4.45 లక్షల పౌండ్లుగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఆశిష్ 1.6 లక్షల పౌండ్లతో వర్జీనియా గలాక్టివ్ పేరుతో స్పేస్ టికెట్‌ను కూడా కొనుగోలు చేశారని, ఈ ధరను తన ఆస్తిలో కలపలేదని కోర్టుకు తెలిపింది. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. కాగా, మారా గ్రూపు ఆశిష్‌కి సంబంధించింది కాదని ఆశిష్ తరఫున అతని తండ్రి, సోదరి హైకోర్టుకు నివేదించగా.. ఈ వాదనలను తోసిపుచ్చింది. -
భార్య, భర్త మధ్యలో స్పేస్ టికెట్
లండన్: ఇంగ్లండ్‌లోని భారత సంతతికి చెందిన ఒక జంట విడాకుల వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడాకుల నేపథ్యంలో తనకు రావాల్సిన మొత్తాన్ని (భరణం) చెల్లించకుండా ఉండేందుకు తన భర్త ఆశిష్ ఠక్కర్ ఆస్తులను తక్కువగా చూపిస్తున్నాడంటూ భార్య మీరా మానెక్ ఇంగ్లండ్‌లోని హైకోర్టును ఆశ్రయించింది. 2008లో వివాహం చేసుకున్న వీళ్లు 2013లో విడిపోయారు. తన భర్త ఆశిష్ ఒక బిలియనీర్ అని, తన ఆస్తులను కేవలం 4,45,532 పౌండ్లుగా చెబుతున్నాడని వాస్తవానికి ఆయన దగ్గర భారీగా ఆస్తులున్నాయని మీరా వాదిస్తోంది. అయితే మారా గ్రూపు తన తల్లి, సోదరికి సంబంధించినదని దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆశిష్ హైకోర్టుకు నివేదించాడు. దీంతో పాటు బ్రిటిష్ ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్స్ .. వర్జీనియా గలాక్టివ్ పేరుతో తొలి వాణిజ్య అంతరిక్ష విమానాన్ని ప్రకటించగానే తొలుత టికెట్ కొన్న అతి తక్కువ మందిలో ఠక్కర్ ఒకరని మీనా తెలిపింది. ఆ టికెట్ అసలు విలువ 1,60,000 పౌండ్లు అని ఇప్పుడు ఈ టికెట్లో కూడా తనకు వాటా కావాలని ఆమె పట్టుపడుతోంది. ఈ వ్యవహారంపై సోమవారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
స్పేస్ టికెట్‌పై బ్రిటన్ హైకోర్టుకు ఈడ్చిన మాజీ భార్య
లండన్: భారత సంతతికి చెందిన ఆశిష్ ఠక్కర్‌ను ఆయన మాజీ భార్య మీరా మానెక్ బ్రిటన్ హైకోర్టుకు ఈడ్చింది. విడాకుల నేపథ్యంలో ఆమె రావాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఆస్తులు తక్కువగా చూపిస్తున్నాడంటూ ఆమె కోర్టు మెట్లెక్కింది. ఇంతకీ అతడు లెక్క చూపించని ఆస్తి ఏమిటో తెలుసా.. అంతరిక్ష యాత్రకు సంబంధించిన టికెట్. దానికోసం కోర్టుదాకా వెళ్లాల అనుకోకండి. ఎందుకంటే దాని విలువ ఏకంగా లక్షా అరవైవేల పౌండ్లు. దీనిని కూడా అతడి ఆస్తిగానే పేర్కొంటే అందులో కనీసం 30శాతం ఆమెకు భరణంగా వస్తుంది. దీనిపై ఒక వారం రోజులపాటు సోమవారం నుంచి బ్రిటన్ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆశిష్ ఠక్కర్ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త. ఆయన బ్రిటన్‌లోని లైసిస్టర్లో మారా గ్రూప్ నడిపిస్తున్నాడు. బ్రిటన్‌కు వలస వచ్చిన తూర్పు ఆఫ్రికా భారతీయుల కుటుంబాల్లో ఆశిష్ కుటుంబం కూడా ఒకటి. 1970 కాలంలో ఉగాండన్ నియంత ఇది అమిన్ 1970లో వారిని తూర్పు ఆఫ్రికా భారతీయ కుటుంబాలను వెళ్లగొట్టినప్పుడు వారు బ్రిటన్‌కు వచ్చారు. ఆ తర్వాత మీరా మానెక్ను 2008లో వివాహం చేసుకున్నాడు. అయితే, ఐదేళ్లకే వారి వివాహంలో వేరు కుంపట్లు వచ్చాయి. 2013లో విడిపోయారు. వీరు కలిసి ఉన్న సమయంలోనే వర్జిన్ గెలాస్టిక్ సంస్థ భవిష్యత్‌లో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకోసం తొలిసారి వీరు టికెట్ కొనుగోలు చేశారు. లక్షా 60 వేల పౌండ్లు పెట్టి ఆ టికెట్ కొన్న తొలి భారత సంతతి పౌరులు కూడా వీరే. అయితే, అనూహ్యంగా వారిద్దరు విడిపోవడం, తన ఆస్తిలో కొంతమొత్తం భార్యకు భరణంగా చెల్లించాల్సి వచ్చే పరిస్థితులు తలెత్తాయి. అయితే, తన ఆస్తులు మొత్తం కూడా 4,45,532 పౌండ్లుగా మాత్రమే ఆశిష్ పేర్కొన్నాడు. స్పేస్ టూర్ టికెట్ ఖర్చును అందులో పేర్కొనలేదు. దీంతో దానిని కూడా అతడి ఆస్తిగానే పరిగణించి అందులో నుంచి కూడా తనకు భరణంగా ఇవ్వాల్సిందేనని మీరా మానెక్ డిమాండ్ చేస్తోంది. ప్రయాణం మొదలయ్యేనాటికి టికెట్ రద్దు చేసుకున్నా సదరు సంస్థ స్పేస్ టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. -
స్ఫూర్తి చీకటి ఖండంలో వెలుగురేఖ!
రెండు దశాబ్దాల కిందట అతడు... చదువు మానేసిన మొద్దబ్బాయి. ఇంట్లో వాళ్ల పాలిట ఒక తలనొప్పి. ఎలా బతుకుతాడో అని భయపడేవారు అమ్మానాన్నా. హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయలేకపోయిన అతడి బతుకు చీకటిమయం అవుతుందని అనుకునేవారంతా. కానీ అతడు చీకటి ఖండంలో ఒక వెలుగురేఖలా ప్రసరిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఎలక్ట్రానిక్స్ రంగంలో దాక్కొన్న సంపద అంతా ఇంతా కాదు. తోడుకొనే చేవ ఉండాలి కాని.. ఎంతైనా సంపాదించవచ్చన్న విషయాన్ని నిరూపించిన ఎంతోమంది ‘టెక్ ఎంటర్‌ప్రెన్యూర్స్’లో ఒకరు ఆశిష్ థక్కర్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టెక్నాలజీ సంబంధిత వ్యాపారం చే సే వ్యక్తి తను కూడా ఆ దేశంతో పాటు అభివృద్ధి చెందవచ్చు, అభివృద్ధి బాటలో ఆ దేశం కన్నా వేగంగా నడవొచ్చు అని నిరూపిస్తున్నాడీయన. ఆఫ్రికన్ దేశం ఉగాండాలో ఐదు వేల డాలర్ల సొమ్ముతో వ్యాపారాన్ని ప్రారంభించి మల్టీమిలియనీర్‌గా ఎదిగాడు మిస్టర్ థక్కర్. వాళ్ల తాతగారు 19వ శతాబ్దంలోనే ఉగాండాకు తిండి గింజలు ఎగుమతి చేసే వ్యాపారం చేసేవారట. తర్వాత థక్కర్ తండ్రి కూడా ఆ వారసత్వాన్ని కొనసాగించారు. ఆ వ్యాపారం కోసం ఉగాండాకు చేరింది వీరి కుటుంబం. అయితే ఆ దేశం నియంతృత్వంలోకి వెళ్లిపోవడంతో అక్కడి ఆసియన్లందరికీ కష్టాలు మొదలయ్యాయి. దీంతో 1973లో థక్కర్ కుటుంబం బ్రిటన్‌కు వెళ్లిపోయింది. చిన్నప్పట్నుంచీ ఇంట్లో అంతా వ్యాపారస్తుల్నే చూశాడేమో... థక్కర్‌కు చదువు మీద మనసు నిలవలేదు. హైస్కూల్ దశలోనే పుస్తకాలు వదిలేశాడు. పైగా మనోడిని ఉగాండా తెగ ఆకర్షించసాగింది. అప్పటికే కుటుంబం బ్రిటన్ వచ్చేసి పాతికేళ్లు గడిచిపోయాయి. అయినా కూడా అతడి మనసు అటే లాగింది. తాత, తండ్రులు వ్యాపారం చేసిన ఆ దేశంలో ఈ మూడో తరం థక్కర్ దశ కూడా తిరగాలని రాసి పెట్టి ఉందో ఏమో... ఐదు వేల డాలర్ల రుణం తీసుకొని 1995లో చీకటి ఖండంలో అడుగుపెట్టాడు పన్నెండేళ్ల ఆశిష్. హార్డ్‌డ్రైవ్‌లు, ఫ్లాపీ డిస్క్‌లు, కాంపాక్ట్ డిస్క్, రామ్‌లను దుబాయ్ నుంచి తెప్పించుకొని ఉగాండాలో అమ్మడం మొదలు పెట్టాడు థక్కర్. అప్పటికది చెప్పుకోవడానికి పెద్ద బిజినెస్ ఏమీ కాదు. కానీ, 19ఏళ్లు గడిచే సరికి ఏటా రెండు వందల మిలియన్ డాలర్ల లాభాలను సాధించే స్థాయికి చేరింది అతడి వ్యాపారం. ఉగాండాతో మొదలై ఇప్పుడు మొత్తం 21 ఆఫ్రికా దేశాల్లోకి వేళ్లూనుకొంది ఇతడి సామ్రాజ్యం. ఇప్పుడతడి వయసు 31 సంవత్సరాలు! అతడి కంపెనీ విలువ 720 మిలియన్ డాలర్లు. అతడి వద్ద 8,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపారవేత్తలు కూడా థక్కర్‌ను ఒక గొప్ప వ్యాపారవేత్త అని అంటారు. అతడి సమర్థత అద్వితీయం అని అంటారు. ఆశిష్ థక్కర్ అంటే అతడు చీకటి ఖండంలో వ్యాపార మార్గాన్ని చూపిన వెలుగు రేఖ అని పొగడ్తలతో ముంచెత్తుతారు. థక్కర్ సాధించిన విజయాన్ని బట్టి చూస్తే ఈ ప్రశంసలు వందశాతం నిజమేనని చెప్పవచ్చు!