భార్య, భర్త మధ్యలో స్పేస్ టికెట్
లండన్: ఇంగ్లండ్‌లోని భారత సంతతికి చెందిన ఒక జంట విడాకుల వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడాకుల నేపథ్యంలో తనకు రావాల్సిన మొత్తాన్ని (భరణం) చెల్లించకుండా ఉండేందుకు తన భర్త ఆశిష్ ఠక్కర్ ఆస్తులను తక్కువగా చూపిస్తున్నాడంటూ భార్య మీరా మానెక్ ఇంగ్లండ్‌లోని హైకోర్టును ఆశ్రయించింది. 2008లో వివాహం చేసుకున్న వీళ్లు 2013లో విడిపోయారు. తన భర్త ఆశిష్ ఒక బిలియనీర్ అని, తన ఆస్తులను కేవలం 4,45,532 పౌండ్లుగా చెబుతున్నాడని వాస్తవానికి ఆయన దగ్గర భారీగా ఆస్తులున్నాయని మీరా వాదిస్తోంది.
అయితే మారా గ్రూపు తన తల్లి, సోదరికి సంబంధించినదని దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆశిష్ హైకోర్టుకు నివేదించాడు. దీంతో పాటు బ్రిటిష్ ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్స్ .. వర్జీనియా గలాక్టివ్ పేరుతో తొలి వాణిజ్య అంతరిక్ష విమానాన్ని ప్రకటించగానే తొలుత టికెట్ కొన్న అతి తక్కువ మందిలో ఠక్కర్ ఒకరని మీనా తెలిపింది. ఆ టికెట్ అసలు విలువ 1,60,000 పౌండ్లు అని ఇప్పుడు ఈ టికెట్‌లో కూడా తనకు వాటా కావాలని ఆమె పట్టుపడుతోంది. ఈ వ్యవహారంపై సోమవారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు హైకోర్టు విచారణ చేపట్టనుంది.