High Court of England
-
నిజాం కేసులో పాక్‌కు మరో దెబ్బ
లండన్: లండన్‌లోని నేషనల్ వెస్ట్ మినిస్టర్(నాట్‌వెస్ట్) బ్యాంక్‌లో దశాబ్దాలుగా ఉన్న హైదరాబాద్ నిజాంలకు చెందిన 3.5 కోట్ల పౌండ్లు నిధులు భారత ప్రభుత్వం, నిజాం వారసులు ముఖ్రంఝా, ముఫఖం ఝాలకే చెందుతాయని అక్టోబర్‌లో హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆ నిధులు తమవేనంటూ వాదించిన పాక్‌కు చుక్కెదురైంది. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి న్యాయమూర్తి మార్కస్ స్మిత్ మరో తీర్పునిచ్చారు. ఇది కూడా పాకిస్తాన్‌ను దెబ్బతీసేదే. పాకిస్తాన్ తమ ప్రతివాదులకు ఈ వివాదానికి సంబంధించి అయిన న్యాయపరమైన ఖర్చుల మొత్తంలో 65% చెల్లించాలని ఆయన గురువారం తీర్పునిచ్చారు. ‘ఈ వివాదానికి సంబంధించిన ఖర్చుల కింద వారికి ఎంత మొత్తం చెల్లించాలనే విషయంలో ఒక అంగీకారానికి రాని పక్షంలో.. ప్రతివాదులకైన ఖర్చులో 65% పాకిస్తాన్ చెల్లించాలి’ అని స్పష్టం చేశారు. 65% పాక్ చెల్లిస్తే.. ప్రతివాదులైన భారత ప్రభుత్వానికి సుమారు 28 లక్షల పౌండ్లు, ప్రిన్స్ ముఫఖం ఝాకు సుమారు 18 లక్షల పౌండ్లు, ప్రిన్స్ ముఖరం ఝాకు సుమారు 8 లక్షల పౌండ్లు లభిస్తాయి. ‘1948 నాటి ఈ వివాదం ఈ నాటికి పూర్తిగా ముగిసింది’ అని నిజాంల తరఫున వాదించిన పాల్ హీవిట్ వ్యాఖ్యానించారు. జస్టిస్ స్మిత్ ఇచ్చిన తీర్పును సవాలు చేయాలని పాక్ నిర్ణయించుకోలేదని, అందువల్ల ఆ నిధులను తన క్లయింట్లను వినియోగించుకోవచ్చని తెలిపారు. 1948లో ఏడవ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 10 లక్షల పౌండ్లను బ్రిటన్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీంకు పంపించారు. హైదరాబాద్‌లోని తన ఖాతా నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోని హబీబ్ ఖాతాకు ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. ఆ మొత్తం తమదేనని నిజాం వారసులు, భారత ప్రభుత్వం వాదించగా, ఆయుధాల కొనుగోలు నిమిత్తం వాటిని తమకు బదిలీ చేశారని, ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ వాదించింది. అనంతరం, నిజాం వారసులు, భారత ప్రభుత్వం ఒక్కటిగా తమ వాదనలు వినిపించాయి. -
మాల్యా అప్పీల్‌పై విచారణకు హైకోర్టు ఓకే
లండన్: బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఊరట లభించింది. మాల్యాను భారత్‌కు అప్పగించే నిర్ణయం తీసుకుంటూ గతంలో బ్రిటన్ హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై మాల్యా చేసుకున్న అప్పీల్‌ను విచారించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది. మాల్యా అప్పీల్‌ను విచారణకు స్వీకరించాలా, వద్దా అన్న విషయంపై జస్టిస్ జార్జ్ లెగ్గాట్ట్, జస్టిస్ ఆండ్రూ పాపుల్‌వెల్‌ల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తాము అప్పీల్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. మాల్యా తరఫున న్యాయవాది క్లారీ మోంట్‌గోమెరీ వాదనలు వినిపించగా, భారత హై కమిషన్ కార్యాలయ అధికారులు, మాల్యా భాగస్వామి పింకీ లల్వానీ, కొడుకు సిద్ధార్థ్‌లు కూడా కోర్టుకు వచ్చారు. మాల్యా అప్పీల్ పిటిషన్‌ను కోర్టు తదుపరి రోజుల్లో విచారించనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం అప్పు తీసుకుని, బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాను బ్రిటన్ పోలీసులు 2017 ఏప్రిల్‌లోనే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన అక్కడే బెయిల్‌పై ఉంటున్నారు. అప్పటి నుంచి మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగానే మాల్యా రుణాలను ఎగ్గొట్టారనడానికి ఆధారాలు ఉన్నాయని గతేడాది డిసెంబర్లోనే లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తేల్చింది. దీంతో మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ హోం శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. -
భార్య, భర్త మధ్యలో స్పేస్ టికెట్
లండన్: ఇంగ్లండ్‌లోని భారత సంతతికి చెందిన ఒక జంట విడాకుల వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడాకుల నేపథ్యంలో తనకు రావాల్సిన మొత్తాన్ని (భరణం) చెల్లించకుండా ఉండేందుకు తన భర్త ఆశిష్ ఠక్కర్ ఆస్తులను తక్కువగా చూపిస్తున్నాడంటూ భార్య మీరా మానెక్ ఇంగ్లండ్‌లోని హైకోర్టును ఆశ్రయించింది. 2008లో వివాహం చేసుకున్న వీళ్లు 2013లో విడిపోయారు. తన భర్త ఆశిష్ ఒక బిలియనీర్ అని, తన ఆస్తులను కేవలం 4,45,532 పౌండ్లుగా చెబుతున్నాడని వాస్తవానికి ఆయన దగ్గర భారీగా ఆస్తులున్నాయని మీరా వాదిస్తోంది. అయితే మారా గ్రూపు తన తల్లి, సోదరికి సంబంధించినదని దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆశిష్ హైకోర్టుకు నివేదించాడు. దీంతో పాటు బ్రిటిష్ ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్స్ .. వర్జీనియా గలాక్టివ్ పేరుతో తొలి వాణిజ్య అంతరిక్ష విమానాన్ని ప్రకటించగానే తొలుత టికెట్ కొన్న అతి తక్కువ మందిలో ఠక్కర్ ఒకరని మీనా తెలిపింది. ఆ టికెట్ అసలు విలువ 1,60,000 పౌండ్లు అని ఇప్పుడు ఈ టికెట్లో కూడా తనకు వాటా కావాలని ఆమె పట్టుపడుతోంది. ఈ వ్యవహారంపై సోమవారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు హైకోర్టు విచారణ చేపట్టనుంది.