సోషల్... భాగమతి
‘అరుంధతి’లో జేజెమ్మగా అనుష్క అభినయాన్ని అంత సులువుగా మర్చిపోలేం. పవర్ఫుల్ పాత్రలంటే అనుష్కే చేయాలని ఆ సినిమా నిరూపించింది. ‘రుద్రమదేవి’తో ఆ స్టాంప్ బలంగా పడింది. ‘బాహుబలి’ తొలి భాగంలో దేవసేనగా వృద్ధ గెటప్‌లో కనిపించారు కాబట్టి.. మలి భాగంలో ఏ రేంజ్లో రెచ్చిపోతారో చూడాలి. మొత్తం మీద లేడీ ఓరియంటెడ్ సినిమాలపరంగా అనుష్కకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడామె మరో లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో అనుష్క నాయికగా ‘భాగమతి’ అనే చిత్రం రూపొందనుందనే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.
ఇది జరిగి ఏడాదైనా ఈ సినిమా పట్టాలెక్కిన దాఖలాలు కనిపించలేదు. ఒకానొక దశలో ఈ చిత్రం ఉండదనే వార్త కూడా వినిపించింది. అయితే, ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ, బుధవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రానికి తమిళంలో జ్ఞానవేల్ రాజా నిర్మాత. అనుష్క, అశోక్, వంశీ, ప్రమోద్‌లు పాల్గొనగా, సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఈ నెలాఖరున షూటింగ్ ఆరంభమవుతుందనీ, ఇదే ఏడాది విడుదల చేయాలను కుంటున్నారనీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముహమ్మద్ కులీ కుతుబ్ షా, భాగమతిల ప్రణయ గాథతో ఈ చిత్రం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఇది చారిత్రక కథా చిత్రం కాదట. ‘‘ఇది సోషల్ డ్రామా. ప్రేమకథతోనే సినిమా సాగుతుంది’’ అని చిత్ర వర్గాల సమాచారం.