సన్నీ లియోన్ పై పోలీసు ఫిర్యాదు
న్యూఢిల్లీ: బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్ జాతీయ గీతాన్ని అవమానించారంటూ ఢిల్లీ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు నమోదయింది. ప్రో కబడ్డీ లీగ్స్ లో భాగంగా గురువారం ముంబైలో జరిగిన ఓ మ్యాచ్ కు హాజరైన సన్నీ లియోన్.. మ్యాచ్ ప్రారంభానికి ముందు 'జనగణమన..'ను ఆలపించారు. అయితే పదాలు పలకడం దగ్గర్నుంచి, రాగం ఆలపించడం వరకు ఆమె పొరపాట్లు చేశారని, తద్వారా జాతీయ గీతాన్ని అవమానించారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ప్రో కబడ్డీ లీగ్స్ లో జాతీయ గీతాలాపనపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. గత సీజన్ లో ఓ మ్యాచ్ సందర్భంగా బిగ్ బి అమితాబ్ జనగణమన ను సరిగా ఆలపించలేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
గురువారం ముంబైలో జాతీయ గీతాలపన సందర్భంలో సన్నీ లియోన్ ఉద్వేగానికి గురయ్యారు. భారత జాతీయ గీతం పాడటాన్ని గర్వంగా భావిస్తున్నట్లు, అసలీ అవకాశం లభిస్తుందని ఎన్నడూ అనుకోలేదని ఆమె చెప్పారు. తన తండ్రి కూడా కబడ్డీ అభిమాని అని, చిన్నప్పుడు కబడ్డీ ఆడేలా ప్రోత్సహించారని, వ్యక్తిగతంగా ఆ ఆటపై మక్కువలేక పోవడంతో కబడ్డీ నేర్చుకోలేకపోయానని సన్నీ చెప్పుకొచ్చారు. ఇక ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా ఇంకా తెలియరాలేదు.