ఏషియన్ అవార్డు గెలుచుకున్న షారుఖ్
లండన్ : బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఏషియన్ అవార్డును గెలుచుకున్నారు. సినిమా రంగానికి చేసిన ప్రతిష్టాత్మక సేవలకు గాను ఆయన్ను ఈ అవార్డు వరించింది. శుక్రవారం లంబన్ గ్రోస్వెనార్ హోటెల్లో జరిగిన 5వ వార్షిక ఏషియన్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును షారుఖ్ అందుకున్నారు. తనకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు షారూఖ్. తనను ప్రపంచానికి పరిచయం చేసిన భారతీయ సినిమా రంగానికి ఋణపడి వుంటానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విచ్చేసిన ప్రముఖులు, సెల్రబిటీలతో వేదిక కళకళలాడింది.
ఈ సందర్భంగా అవార్డులు గెలుచుకున్న అందరికీ షారుఖ్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సంగీతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న జైన్ మాలిక్ షారుఖ్‌తో కలిసి వున్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలకు ఇచ్చే ఈ అవార్డును గెలుచుకున్న వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. క్రీడారంగంలో శ్రీలంక బ్యాట్స్‌మేన్ సంగక్కర, సంగీతంలో జైన్ మాలిక్, సైన్స్ అండ్ టెక్నాలజీలో తేజేందర్ సింగ్, టెలివిజన్ రంగంలో ప్రముఖ హాస్యనటుడు, సంజీవ్ భాస్కర్, వ్యాపార రంగంలో హిందూజా బ్రదర్స్ తదితరులు ఆ అవార్డులను అందుకున్నారు.
కాగా గతంలో ఇర్ఫాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ ఈ అవార్డును గెలుచుకున్నారు.