స్వర్ణాలు నెగ్గిన చిత్ర, లక్ష్మణన్
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): తమ పతకాల వేటను కొనసాగిస్తూ భారత అథ్లెట్స్ ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో మంగళవారం రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించారు. పురుషుల 5000 మీటర్ల రేసులో గోవిందన్ లక్ష్మణన్... మహిళల 1500 మీటర్ల రేసులో పీయూ చిత్ర పసిడి పతకాలను సొంతం చేసుకోగా... బెల్ట్ రెజ్లింగ్లో ధర్మేందర్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. లక్ష్మణన్ 8 నిమిషాల 2.30 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని పొందాడు. చిత్ర 4 నిమిషాల 27.77 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచింది.
బెల్ట్ రెజ్లింగ్ 70 కేజీల విభాగం సెమీఫైనల్లో అనామిరదోవ్ (తుర్క్మెనిస్తాన్) చేతిలో ధర్మేందర్ ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 60 మీటర్ల ఫైనల్ రేసులో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ 7.44 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. ఇప్పటివరకు భారత్ మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.