కామర్స్ విద్యార్థులకు అవకాశాలు అధికం
జెన్పాక్ట్ ప్రాజెక్టుకు ఎస్సారార్ విద్యార్థుల ఎంపిక
శాతవాహన యూనివర్సిటీ : కామర్స్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయని ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి అన్నారు. నాస్కాం, జెన్పాక్ట్ ప్రాజెక్టుకు ఎంపికైన విద్యార్థులను కళాశాల ఆవరణలో బుధవారం అభినందించారు. జెన్పాక్ట్ రూపొందించిన రీచ్ హయ్యర్ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా 15 కళాశాలలను ఎంపిక చేసి కామర్స్ విద్యార్థులకు ఫైనాన్స్, అకౌంటింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎనలిటిక్స్ విభాగా ల్లో ఉచితంగా 60 గంటల పాటు శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఎస్సారార్ కళాశాల ఎంపికకావడం హర్షనీయమన్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీల సంఘం (నాస్కాం)లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారని తెలిపారు. జెన్పాక్ట్ నిర్వహించే ఈ ఉచిత శిక్షణను కార్పొరేట్ నిపుణుల సమక్షంలో ఎస్సారార్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను 100 మందిని ఎంపిక చేసి కార్పొరేట్ శిక్షణతో ఉద్యోగావకాశాలకు చక్కని బాటలు వేస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 5 లోగా వివరాలను ఎస్సారార్ కళాశాలలో అందించాలని, ఇతర వివరాలకు జేకేసీ కో ఆర్డినేటర్ రాజశేఖర్‌ను 9989334987లో సంప్రదించాలని సూచించారు.
ప్రాంగణ నియామకాల్లో 85 మంది ఎంపిక
ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని జే కేసీ సారథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 85మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు చేపట్టిన నియామక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 22 మంది సేల్స్ ఆఫీసర్లుగా ఎంపికవగా, ఏజీస్ కంపెనీ నియామకాల్లో 63 మంది ప్రాథమిక దశలో ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ నాగేంద్రతోపాటు, జేకేసీ కో ఆర్డినేటర్ రాజశేఖర్, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.