Asset Purchases
-
స్థిరాస్తి అమ్మాలా ? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టపరంగా వ్యవహరించాల్సిన తీరు తెన్నుల గురించి మనం తెలుసుకుంటున్నాం. గత వారం కొనే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. ఈ వారం అమ్మేవారికి వర్తించే విషయాలు, జాగ్రత్తలు తెలుసుకుందాం. స్థిరాస్తి విక్రయంలో ప్రతిఫలం ఎలా తీసుకోవాలి? ఒప్పందంలో పేర్కొన్న మొత్తాన్ని ప్రతిఫలం అంటారు. ఇంత మొత్తమే తీసుకోవాలి. నగదు రూపంలో తీసుకోకూడదు. అన్ని వ్యవహారాలు బ్యాంకు ద్వారానే జరగాలి. నగదు తీసుకోవచ్చా? నగదు రూపంలో ప్రతిఫలం తీసుకోకూడదు. అలా తీసుకుంటే అంతకు అంత పెనాల్టీలు పడతాయి. స్థిరాస్తి అమ్మగా వచ్చే లాభాలను ఎలా పరిగణిస్తారు? స్థిరాస్తి అమ్మగా వచ్చే లాభాలను ఆదాయపు పన్ను చట్ట పరిభాషలో ’మూలధన లాభాలు’ అంటారు. మూలధన లాభాలపై పన్ను భారం పడుతుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలంటే ఏమిటి? స్థిరాస్తులకు ’హోల్డింగ్ పీరియడ్’ ఉంటుంది. అంటే ఓనర్షిప్. ఓనర్షిప్ ఎన్నాళ్లుగా ఉందన్న దానిబట్టి స్వల్ప, దీర్ఘకాలిక పీరియడ్‌ను లెక్కిస్తారు. రెండు సంవత్సరాల లోపు ఉంటే స్వల్పకాలికమని, రెండు సంవత్సరాలు దాటితే దీర్ఘకాలికమని అంటారు. పన్నుభారంపరంగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? రెండింటి మీద లాభాలను ఆదాయంగా పరిగణిస్తారు. స్వల్పకాలికం మీద ఎటువంటి మినహాయింపు రాదు. అంతే కాకుండా లాభాన్ని ఇతర ఆదాయాలతో కలిపి పన్ను భారాన్ని శ్లాబుల ప్రకారం లెక్కిస్తారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై మినహాయింపు పొందవచ్చు. ఇంకా ఆదాయం మిగిలిపోతే ఆ మొత్తం మీద 20 శాతం బేసిక్ రేట్ పన్ను భారం పడుతుంది. అమ్మే స్థిరాస్తి మీద ఆదాయం చూపించాలా? స్థిరాస్తి అమ్మేవరకు ఆ ఇంటి మీద ఆదాయాన్ని సెల్ఫ్–ఆక్యుపైడ్‌గా గానీ అద్దెకి ఇచ్చినట్లుగా గానీ తప్పనిసరిగా చూపించాలి. స్థిరాస్తి స్వభావం ఎలాంటిదై ఉండాలి? స్థిరాస్తి అంటే ’రెసిడెన్షియల్’ ప్రాపర్టీ మాత్రమే. కమర్షియల్ ప్రాపర్టీలకు మినహాయింపు వర్తించదు. కొనే ఆస్తిని స్వదేశంలోనే కొనుగోలు చేయాలా? పన్ను మినహాయింపు పొందాలంటే కొనబోయే ఆస్తిని మన దేశంలోనే కొనుగోలు చేయాలి. విదేశాలలో కొనే ఇంటిపై ఎటువంటి మినహాయింపులు రావు. ఈ ప్రయోజనాలు ఎవరికి వర్తిస్తాయి? ఈ మినహాయింపులు కేవలం వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయి. కొత్త ఆస్తి కొనాల్సిందేనా లేక కట్టుకోవచ్చా? కొత్త ఆస్తి అంటే ఇల్లు కాని ప్లాట్ కానీ కావచ్చు. ఇల్లు కొనవచ్చు .. కట్టుకోవచ్చు.. కట్టించుకోవచ్చు. అలాగే ప్లాటు కొనుక్కోవచ్చు. పై చెప్పిన విషయాల్లో గడవులు ఉన్నాయా? æస్థిరాస్తి అమ్మిన తేదీ నుంచి 3 సంవత్సరాల లోపల ఇల్లు/ప్లాటు కొనవచ్చును. అలాగే కట్టించుకోవచ్చు. అలా కాకుండా అమ్మిన తేదికి ఒక ఏడాది ముందుగా కొన్నా ప్రయోజనం పొందవచ్చు. ఒకవేళ నిర్మిస్తున్నదయితే ఒక సంవత్సరం ముందుగా మొదలుపెట్టి 2 సంవత్సరాల లోపు పూర్తి చేయాలి. కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు చదవండి: ఆన్లైన్ బ్యాకింగ్‌లో ఈ సూచనలు కచ్చితం..! లేకపోతే అంతే సంగతులు..! -
ఆర్‌కామ్ ఆస్తుల రేసులో ఎయిర్టెల్, జియో
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు 11 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. పోటీ కంపెనీలైన భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా వీటిలో ఉన్నాయి. ‘ మూడు సంస్థల (ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్) అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు మొత్తం 11 బిడ్స్ వచ్చాయి. వీటిలో వర్డే క్యాపిటల్, యూవీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మొదలైన సంస్థల బిడ్స్ కూడా ఉన్నాయి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌కామ్ డేటా సెంటర్, ఆప్టికల్ ఫైబర్ వ్యాపారాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తుందని భావించిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ సంస్థ.. అసలు బిడ్ దాఖలు చేయలేదని వివరించాయి. బిడ్లను సోమవారమే ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. రుణదాతల కమిటీ (సీవోసీ) దీన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. ఆర్‌కామ్ సెక్యూర్డ్ రుణాలు దాదాపు రూ. 33,000 కోట్ల మేర ఉండగా.. దాదాపు రూ. 49,000 కోట్ల బాకీలు రావాల్సి ఉందని రుణదాతలు ఆగస్టులో క్లెయిమ్ చేశారు. బాకీల చెల్లింపు కోసం అసెట్స్‌ను విక్రయించేందుకు గతంలో కూడా ఆర్‌కామ్ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. స్పెక్ట్రం చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీల కోసం ప్రొవిజనింగ్ చేయడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 30,142 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అటు కంపెనీ చైర్మన్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేసినప్పటికీ.. రుణదాతలు ఆమోదముద్ర వేయలేదు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) ఆర్‌కామ్ వ్యవహారం చేరింది. ఎన్సీఎల్టీ ఆదేశాల ప్రకారం పరిష్కార నిపుణుడు (ఆర్పీ) 2020 జనవరి 10లోగా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. స్టాక్ .. అప్పర్ సర్క్యూట్.. బిడ్డింగ్ వార్తలతో సోమవారం ఆర్‌కామ్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఆరు శాతం ఎగిశాయి. బీఎస్ఈలో ఆర్‌కామ్ షేరు 69 పైసలు పెరిగి రూ. 4.55 వద్ద ముగిసింది. -
ఫోర్జరీలతో పాగా!
సిటీబ్యూరో: మహానగరంలో ఖాళీ స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. జాగా కనిపిస్తే చాలు పాగా వేయడం అక్రమార్కుల నిత్యకృత్యంగా మారింది. ఫోర్జరీ దస్తావేజులతో ప్లాటింగ్ బిజినెస్‌కు సైతం తెర లేపుతున్నారు. ఏకంగా నకిలీ పత్రాల ఆధారంగా ప్రభుత్వం నుంచి ఎన్వోసీలకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం విచారణలో ఫోర్జరీ వ్యవహారం బట్టబయలై అక్రమార్కులపై వరుసగా పోలీసులకు ఫిర్యాదులు సంచలనం సృష్టిస్తున్నాయి. కొందరు ఖాళీ స్థలాలపై పాగా వేయడం రెవెన్యూ అధికారులు అడ్డుకుంటే కోర్టు ఆశ్రయించడం సర్వ సాధారణంగా మారింది. రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం స్థలాల రక్షణకు చర్యలు తీసుకున్న ఫలితం లేకుండా పోతోంది. ఖాళీ స్థలాలు ఇలా.. నగరంలో ప్రభుత్వ, ప్రభుత్వ యేతర ఖాళీ స్థలాలు సుమారు లక్షకు పైగానే ఉంటాయి. అందులో ప్రభుత్వ పరిధిలో 54, 447 స్థలాలు ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించిన 15,376, ఇతర శాఖలకు చెందిన 33,184, శిఖం, నాలా, కాల్వలకు సంబంధించిన 669, శ్మశాన వాటిలకు సంబంధించిన 961, ఇనామ్ 73, కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 826, వక్ఫ్ బోర్డు 1188, ఎండోమెంట్ 1359, మిగులు భూమి 543 ప్యాకేజీలు ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో వైపు 1316 స్థలాలపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోర్జరీకి ముచ్చు తునకలు.. షేక్‌పేట మండలం హకీంపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 102/1లో గల సుమారు ఐదెకరాలకుపైగా ప్రభుత్వ భూమిపై ముషీరాబాద్ జమీస్తాన్పూర్కు చెందిన ఒక వ్యక్తి పాగా వేశాడు. హకీంపేట కు చెందిన ముగ్గురు వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేసినట్లు ప్రతాలు సృష్టించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్లాట్ల విక్రయానికి సిద్ధమయ్యాడు. ప్రభుత్వ భూమిగా గుర్తించిన రెవెన్యూ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ భూమిపై విచారణ జరిపి, ముగ్గురు వ్యక్తులకు సంబంధం లేదని గుర్తించిన షేక్ పేట రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షేక్‌పేట మండల పరిధిలో టీఎస్ నెంబర్ 8/1 బ్లాక్–బిలో సుమారు రెండు వేల గజాల ఖాళీ స్థలం ఉంది. డి.హైమాచౌదరి అనే మహిళ ఏకంగా హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి, బోగస్ ఎన్వోసీ సృష్టించింది. దీనిని గుర్తించిన షేక్‌పేట రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముషీరాబాద్ మండలం నామాలగుండు, సీతాఫల్ మండి టీఎస్ 42 అండ్ 2 వార్డు నంబర్ 141, జమిస్తాన్పూర్ గ్రామ పరిధిలోని ఇంటికి సంబంధించిన రుక్కమ్మ తదితరులు జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి బోగస్ డాక్యుమెంట్లతో జీహెచ్ఎంసీ నుంచి ఎన్వోసీ పొందారు. దీనిని గుర్తించిన ముషీరాబాద్ తహసీల్దారు చిలుకలగూడ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టారు. బంజారాహిల్స్‌లో 3.37 ఎకరాల భూమి తమదేనని ఒక వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించారు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోజగుట్టలోని 70 ఎకరాల ప్రభుత్వం భూమి తమదేనంటూ ఒక వ్యక్తి ఏకంగా సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకున్నారు. అప్రమత్తత అవసరం భూములు, ఆస్తుల కొనుగోళ్ల సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ , మున్సిపల్ అథారిటీలను సంప్రదించాలి. ఫోర్జరీకి పాల్పడే వారిపై చర్యలు తప్పవు. – ప్రశాంతి, జాయింట్ కలెక్టర్