ఫోర్జరీలతో పాగా! | Despite the fact that the protection of empty places | Sakshi
Sakshi News home page

ఫోర్జరీలతో పాగా!

Published Thu, Mar 2 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

ఫోర్జరీలతో పాగా!

ఫోర్జరీలతో పాగా!

సిటీబ్యూరో: మహానగరంలో ఖాళీ స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. జాగా కనిపిస్తే చాలు పాగా వేయడం అక్రమార్కుల నిత్యకృత్యంగా మారింది. ఫోర్జరీ దస్తావేజులతో ప్లాటింగ్‌ బిజినెస్‌కు సైతం తెర లేపుతున్నారు. ఏకంగా నకిలీ పత్రాల ఆధారంగా ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీలకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం విచారణలో ఫోర్జరీ వ్యవహారం బట్టబయలై అక్రమార్కులపై వరుసగా పోలీసులకు ఫిర్యాదులు సంచలనం సృష్టిస్తున్నాయి. కొందరు ఖాళీ స్థలాలపై పాగా వేయడం రెవెన్యూ అధికారులు అడ్డుకుంటే కోర్టు ఆశ్రయించడం సర్వ సాధారణంగా మారింది.  రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం స్థలాల రక్షణకు చర్యలు తీసుకున్న ఫలితం లేకుండా పోతోంది.

ఖాళీ స్థలాలు ఇలా..
నగరంలో ప్రభుత్వ, ప్రభుత్వ యేతర ఖాళీ స్థలాలు సుమారు లక్షకు పైగానే ఉంటాయి. అందులో ప్రభుత్వ పరిధిలో 54, 447 స్థలాలు ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించిన 15,376, ఇతర శాఖలకు చెందిన 33,184, శిఖం, నాలా, కాల్వలకు సంబంధించిన 669, శ్మశాన వాటిలకు సంబంధించిన 961,  ఇనామ్‌ 73,  కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 826, వక్ఫ్‌ బోర్డు 1188, ఎండోమెంట్‌ 1359, మిగులు భూమి 543 ప్యాకేజీలు ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో వైపు 1316 స్థలాలపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఫోర్జరీకి ముచ్చు తునకలు..
షేక్‌పేట మండలం హకీంపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్‌ 102/1లో గల సుమారు ఐదెకరాలకుపైగా ప్రభుత్వ భూమిపై ముషీరాబాద్‌ జమీస్తాన్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తి పాగా వేశాడు. హకీంపేట కు చెందిన ముగ్గురు వ్యక్తుల నుంచి  భూమి కొనుగోలు చేసినట్లు ప్రతాలు సృష్టించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్లాట్ల విక్రయానికి సిద్ధమయ్యాడు. ప్రభుత్వ భూమిగా గుర్తించిన రెవెన్యూ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ భూమిపై విచారణ జరిపి, ముగ్గురు వ్యక్తులకు సంబంధం లేదని గుర్తించిన షేక్‌ పేట రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షేక్‌పేట మండల పరిధిలో టీఎస్‌ నెంబర్‌ 8/1 బ్లాక్‌–బిలో సుమారు రెండు వేల గజాల ఖాళీ స్థలం ఉంది. డి.హైమాచౌదరి అనే మహిళ ఏకంగా హైదరాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌ సంతకాన్నే  ఫోర్జరీ చేసి, బోగస్‌ ఎన్‌వోసీ సృష్టించింది. దీనిని గుర్తించిన షేక్‌పేట రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముషీరాబాద్‌ మండలం నామాలగుండు, సీతాఫల్‌ మండి టీఎస్‌ 42 అండ్‌ 2 వార్డు నంబర్‌ 141, జమిస్తాన్‌పూర్‌ గ్రామ పరిధిలోని ఇంటికి సంబంధించిన రుక్కమ్మ తదితరులు జిల్లా కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి బోగస్‌ డాక్యుమెంట్లతో జీహెచ్‌ఎంసీ నుంచి ఎన్‌వోసీ పొందారు. దీనిని గుర్తించిన ముషీరాబాద్‌ తహసీల్దారు చిలుకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు పెట్టారు. బంజారాహిల్స్‌లో 3.37 ఎకరాల భూమి తమదేనని ఒక వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించారు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోజగుట్టలోని 70 ఎకరాల ప్రభుత్వం భూమి తమదేనంటూ ఒక వ్యక్తి  ఏకంగా సీసీఎల్‌ఏకు దరఖాస్తు చేసుకున్నారు.

అప్రమత్తత అవసరం
భూములు, ఆస్తుల కొనుగోళ్ల సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా తహశీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్‌ , మున్సిపల్‌ అథారిటీలను సంప్రదించాలి. ఫోర్జరీకి పాల్పడే వారిపై చర్యలు తప్పవు.  – ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement