జంతువుల సంరక్షణకు స్థలాన్ని కేటాయిస్తాం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో జంతు సంరక్షణ చర్యల్లో భాగంగా రక్షించిన జంతువులను ఓ చోట పెట్టేందుకు అనుకూలంగా ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ తెలిపారు. జిల్లా జంతు హింసా నివారణ సంఘం సమావేశం అదనపు జాయింట్ కలెక్టర్ అ«ధ్యక్షతన కలెక్టరేట్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు పశువుల అక్రమ రవాణాను నిరోధించే సమయంలో రక్షించిన పశువులను ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. దీనిపై స్పందించిన ఏజేసీ ఎక్కడ అనువుగా భూమి ఉంటే ఆ వివరాలు తెలపాలని, కలెక్టర్ ద్వారా భూమి అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో పశు సంతలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఎక్కడా నిబంధనలు పాటించడం లేదని సభ్యులు తెలిపారు. దీనిపై స్పందించిన మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి మాట్లాడుతూ నిబంధనలు పాటించని మాట వాస్తవమేనని, చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రశేఖర్, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.