జీఎస్టీతో తయారీ వ్యయం తగ్గుతుంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)తో తయారీ రంగ వ్యయం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో గురువారం ‘జీఎస్టీ’పై అసోచామ్ జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసోచామ్ పరోక్ష పన్నుల చైర్మన్ నిహల్ కొఠారి మాట్లాడుతూ ప్రస్తుత జీఎస్టీలో కొన్ని పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నప్పటికీ కొత్త విధానం వల్ల తయారీ రంగానికి వ్యయాలు బాగా తగ్గుతాయన్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నుల విధానం చాలా సంక్లిష్టంగా ఉందని, దీని వల్ల ఉత్పత్తులు, సేవల ధరలు బాగా పెరుగుతున్నాయన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం అమల్లోకి వస్తే వస్తూత్పత్తి వ్యయం బాగా తగ్గ అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీపై పుస్తకం రాసిన సుమిత్ దత్త్ ముంజుందర్, ఎఫ్టీఏపీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ తదితరులు పాల్గొన్నారు.