బంగ్లా ఈద్గాపై దాడి: రంగంలోకి భారత ఎన్ఎస్జీ
- ఒక ముష్కరుడి హతం.. మరో ఆరుగురి కోసం వేట
ఢాకా: అధికారిక ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్ లో రంజాన్ పండుగ నాడు ముష్కరులు బీభత్సం సృష్టించారు. దాదాపు ఏడుగురు సాయుధులు.. బంగ్లాలోనే అతిపెద్ద ఈద్గా(ముస్లింల ప్రార్థనా స్థలం) అయిన షోలాకియాపై దాడి చేశారు. నమాజ్ చేసేందుకు వచ్చినవారిపై పెద్ద ఎత్తున బాంబులు, తుపాకులు, కత్తులతో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఈ దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా నలుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముష్కరుల్లో ఒకణ్ని భద్రతాబలగాలు అంతమొందించాయి. మరొకడిని సజీవంగా పట్టుకున్నాయి. ఈద్గా సమీపంలోని స్కూల్ భవనంలో దాక్కున్న మరి కొదరు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.
మెడలో తుపాకులు, ఓ చేతిలో నాటు బాంబులు, మరో చేతిలో కత్తులు చేతబట్టుకున్న దాదాపు ఏడుగురు.. షోలాకియా ఈద్గా ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని, పోలీస్ చెక్ పోస్టుపై బాంబులు విసిరారని, వెంటనే తేరుకున్న పోలీసులు ముష్కరులపై కాల్పులు జరిపారని, ప్రతిదాడిలో ఒక ఉగ్రవాది చనిపోగా, మరొకడు సజీవంగా పట్టుబడ్డాడని కిశోర్ గంజ్ జిల్లా పోలీస్ డిప్యూటీ చీఫ్ తౌఫజల్ హుస్సేన్ తెలిపారు. పోలీసు కాల్పులతో పారిపోయిన ముష్కరులు ఈద్గా సమీపంలోని ఓ స్కూల్ భవనంలోకి చొరబడి, లోపలినుంచి కాల్పులు చేస్తున్నారని, వారి కోసం వేట కొనసాగుతోందని పేర్కొన్నారు.
రంగంలోకి భారత ఎన్ఎస్జీ
రంజాన్ పర్వదినాన పొరుగు దేశంలో చోటుచేసుకున్న భీకర పరిణామాలపై భారత ప్రభుత్వ స్పందించింది. బంగ్లా ప్రభుత్వ అభ్యర్థన మేరకు నలుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్ జీ) అధికారులను కిశోర్ గంజ్ కు పంపనుంది. 26/11 ముంబై, గుర్ దాస్ పూర్, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వంటి ఉగ్రదాడుల సమయంలో సమర్థవంతంగా పనిచేసి, ముష్కరులను అంతం చేయడంతో ఎన్ఎస్జీది కీలక పాత్ర. ప్రస్తుతం షోలాకియా ఈద్గా సమీపంలో దాక్కున్న ముష్కరులను మట్టుపెట్టడంతోపాటు, దర్యాప్తులో మన ఎన్ఎస్ జీ అక్కడి సిబ్బందికి సహకరిస్తుంది.