ముష్కరులు, పోలీసుల మధ్య హోరాహోరీ కాల్పులు
ఢాకా: ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిన జనం.. కిలోమీటర్ల మేర వరుసలు కట్టి నమాజ్ కు నడుం వంచుతోన్న ముస్లింలు.. అంతకంతా లోపలికి వస్తోన్న వేలదిమంది.. రంజాన్ పర్వదినమైన గురువారం ఉదయం 9 గంటలకు బాంగ్లాదేశ్ లోనే అతిపెద్దదైన షోలాకియా ఈద్గా వద్ద కనిపించిన దృశ్యాలు. బంగ్లా న్యూస్ చానెళ్ల కథనం ప్రకారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే, అంటే 9:30 గంటలకు ఈద్గా ప్రవేశ ద్వారం వద్ద పెద్ద చప్పుడైంది. తుపాకులు ధరించి, నాటు బాంబులు చేతబట్టుకున్న కొందరు ముష్కరులు.. పోలీసులు, నమాజ్ చేస్తున్నవారిపై బాంబులు విసిరారు. ఒక పోలీసు, మరో పౌరుడు అక్కడికక్కడే కుప్పకూలారు. క్షణాల్లో కలకలం మొదలైంది. హాహాకారాలు చేస్తూ జనం పరుగులు తీశారు. బాంబులు విసిరి పరుగెత్తిన ముష్కరులు ఓ ఇంట్లోకి చొరబడి దాక్కున్నారు.
షోలాకియా ఈద్గాలో పేలుడు జరిగిన నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు ముష్కరులు దాక్కొన్న ఇంటిని చుట్టుముట్టాయి. లోపలి ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతున్నారు. ఇటువైపు నుంచి ప్రతికాల్పులూ జరుగుతున్నాయి. ముష్కరుల ఏరివేత ఆపరేషన్ ఎన్నిగంటలు పడుతుందనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా, బంగ్లాదేశ్ సమాచార శాఖ మంత్రి హసన్ ఉల్ హక్ పేలుళ్లపై భిన్నంగా స్పందించారు. ఈద్గాలో బాంబులు విసిరింది దయేష్ ఉగ్రవాదులు కాదని, రాజకీయ ప్రత్యర్థులేనని ట్వీట్ చేశారు. బంగ్లాలో అధికార, విపక్ష పార్టీ మధ్యల మధ్య హింసాత్మక దాడులు జరుగుతోన్న సంగతి తెలిసిందే. జులై 1న ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు 20 మందిని పొట్టనపెట్టుకున్న విషాదం నుంచి తేరుకోకముంతే రంజాన్ పండుగనాడు ఈద్గాలో పేలుళ్లు జరగడం బంగ్లాదేశీల్లో విషాదం నింపింది.