Kishoreganj
-
బంగ్లా ఈద్గాపై దాడి: రంగంలోకి భారత ఎన్ఎస్జీ
- ఒక ముష్కరుడి హతం.. మరో ఆరుగురి కోసం వేట ఢాకా: అధికారిక ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్ లో రంజాన్ పండుగ నాడు ముష్కరులు బీభత్సం సృష్టించారు. దాదాపు ఏడుగురు సాయుధులు.. బంగ్లాలోనే అతిపెద్ద ఈద్గా(ముస్లింల ప్రార్థనా స్థలం) అయిన షోలాకియాపై దాడి చేశారు. నమాజ్ చేసేందుకు వచ్చినవారిపై పెద్ద ఎత్తున బాంబులు, తుపాకులు, కత్తులతో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఈ దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా నలుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముష్కరుల్లో ఒకణ్ని భద్రతాబలగాలు అంతమొందించాయి. మరొకడిని సజీవంగా పట్టుకున్నాయి. ఈద్గా సమీపంలోని స్కూల్ భవనంలో దాక్కున్న మరి కొదరు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. మెడలో తుపాకులు, ఓ చేతిలో నాటు బాంబులు, మరో చేతిలో కత్తులు చేతబట్టుకున్న దాదాపు ఏడుగురు.. షోలాకియా ఈద్గా ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని, పోలీస్ చెక్ పోస్టుపై బాంబులు విసిరారని, వెంటనే తేరుకున్న పోలీసులు ముష్కరులపై కాల్పులు జరిపారని, ప్రతిదాడిలో ఒక ఉగ్రవాది చనిపోగా, మరొకడు సజీవంగా పట్టుబడ్డాడని కిశోర్ గంజ్ జిల్లా పోలీస్ డిప్యూటీ చీఫ్ తౌఫజల్ హుస్సేన్ తెలిపారు. పోలీసు కాల్పులతో పారిపోయిన ముష్కరులు ఈద్గా సమీపంలోని ఓ స్కూల్ భవనంలోకి చొరబడి, లోపలినుంచి కాల్పులు చేస్తున్నారని, వారి కోసం వేట కొనసాగుతోందని పేర్కొన్నారు. రంగంలోకి భారత ఎన్ఎస్జీ రంజాన్ పర్వదినాన పొరుగు దేశంలో చోటుచేసుకున్న భీకర పరిణామాలపై భారత ప్రభుత్వ స్పందించింది. బంగ్లా ప్రభుత్వ అభ్యర్థన మేరకు నలుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్ జీ) అధికారులను కిశోర్ గంజ్ కు పంపనుంది. 26/11 ముంబై, గుర్ దాస్ పూర్, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వంటి ఉగ్రదాడుల సమయంలో సమర్థవంతంగా పనిచేసి, ముష్కరులను అంతం చేయడంతో ఎన్ఎస్జీది కీలక పాత్ర. ప్రస్తుతం షోలాకియా ఈద్గా సమీపంలో దాక్కున్న ముష్కరులను మట్టుపెట్టడంతోపాటు, దర్యాప్తులో మన ఎన్ఎస్ జీ అక్కడి సిబ్బందికి సహకరిస్తుంది. -
ముష్కరులు, పోలీసుల మధ్య హోరాహోరీ కాల్పులు
ఢాకా: ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిన జనం.. కిలోమీటర్ల మేర వరుసలు కట్టి నమాజ్ కు నడుం వంచుతోన్న ముస్లింలు.. అంతకంతా లోపలికి వస్తోన్న వేలదిమంది.. రంజాన్ పర్వదినమైన గురువారం ఉదయం 9 గంటలకు బాంగ్లాదేశ్ లోనే అతిపెద్దదైన షోలాకియా ఈద్గా వద్ద కనిపించిన దృశ్యాలు. బంగ్లా న్యూస్ చానెళ్ల కథనం ప్రకారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే, అంటే 9:30 గంటలకు ఈద్గా ప్రవేశ ద్వారం వద్ద పెద్ద చప్పుడైంది. తుపాకులు ధరించి, నాటు బాంబులు చేతబట్టుకున్న కొందరు ముష్కరులు.. పోలీసులు, నమాజ్ చేస్తున్నవారిపై బాంబులు విసిరారు. ఒక పోలీసు, మరో పౌరుడు అక్కడికక్కడే కుప్పకూలారు. క్షణాల్లో కలకలం మొదలైంది. హాహాకారాలు చేస్తూ జనం పరుగులు తీశారు. బాంబులు విసిరి పరుగెత్తిన ముష్కరులు ఓ ఇంట్లోకి చొరబడి దాక్కున్నారు. షోలాకియా ఈద్గాలో పేలుడు జరిగిన నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు ముష్కరులు దాక్కొన్న ఇంటిని చుట్టుముట్టాయి. లోపలి ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతున్నారు. ఇటువైపు నుంచి ప్రతికాల్పులూ జరుగుతున్నాయి. ముష్కరుల ఏరివేత ఆపరేషన్ ఎన్నిగంటలు పడుతుందనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా, బంగ్లాదేశ్ సమాచార శాఖ మంత్రి హసన్ ఉల్ హక్ పేలుళ్లపై భిన్నంగా స్పందించారు. ఈద్గాలో బాంబులు విసిరింది దయేష్ ఉగ్రవాదులు కాదని, రాజకీయ ప్రత్యర్థులేనని ట్వీట్ చేశారు. బంగ్లాలో అధికార, విపక్ష పార్టీ మధ్యల మధ్య హింసాత్మక దాడులు జరుగుతోన్న సంగతి తెలిసిందే. జులై 1న ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు 20 మందిని పొట్టనపెట్టుకున్న విషాదం నుంచి తేరుకోకముంతే రంజాన్ పండుగనాడు ఈద్గాలో పేలుళ్లు జరగడం బంగ్లాదేశీల్లో విషాదం నింపింది. -
బంగ్లాలో పండుగ విషాదం: ఈద్గా వద్ద పేలుడు
ఢాకా: ముస్లింలు పర్వదినాన్ని ఆనందోత్సాహల మధ్య జరుపుకొంటోన్న తరుణంలో ఉగ్రమూకల కళ్లుకుట్టాయి. ప్రార్థనలు చేస్తున్నవారే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. బంగ్లాదేశ్ లోనే అతి పెద్ద ఈద్గా వద్ద గురువారం ఉదయం ముష్కరులు బాంబులు పేల్చారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకు పేలుళ్లలో ఒక పోలీసు, పౌరుడు మృతి చెందారు. 12 మందికి పైగా గాయపడ్డారు. ఈద్గాకు సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ ముష్కరులు.. లోపలినుంచి కాల్పులు జరుపుతున్నారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుపెట్టే ఆపరేషన్ ను ప్రారంభించారు. కాల్పుల మోతతో ఈద్గా పరిసరాలు భీతావాహంగా మారాయి. బంగ్లా రాజధాని ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలోని కిశోర్ గంజ్ పట్టణ శివారులో గల షోలాకియా ఈద్గా.. ఆ దేశంలోనే అతిపెద్ద ప్రార్థనా స్థలం. పర్వదినంనాడు దాదాపు 4 లక్షల మంది ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తారు. పెద్ద సంఖ్యలో జనం గుమ్మికూడటాన్ని అవకాశంగా తీసుకున్న ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈద్గా ప్రవేశ ద్వారం వద్ద చోటుచేసుకున్న పేలుడులో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఒకరు మరణించగా, ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు 20 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటన నుంచి తేరుకోకముందే పండుగనాడు పేలుడు జరగడం బాగ్లాదేశీల్లో విషాదం నింపింది.