కారు డ్రైవర్ దారుణ హత్య
► మద్యం తాగి యువకుల వీరంగం
► అడ్డుకోబోయిన డ్రైవర్‌కు కత్తిపోట్లు
► తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి
► వినాయక చవితి రాత్రి విషాదం
మత్తు ఓ జీవితాన్ని అంతం చేసింది.. ఒక కుటుంబాన్ని అనాథను చేసింది.. వినాయక చవితి సంబరాల్లో ఉన్న ఆ ప్రాంతవాసులను గడగడలాడించి, విషాదంలో ముంచెత్తింది. పండుగ పూట.. రాత్రివేళ పూటగా మద్యం సేవించిన ఇద్దరు యువకులు కత్తితో హల్చల్ చేశారు. అక్కడి యువకులు అడ్డుకోవడంతో పలాయనం చిత్తిగించినా.. కొంతసేపటికి మరికొందరిని వెంటేసుకొచ్చి గలాటా సృష్టించారు. వారిని వారించడానికి ప్రయత్నించిన డ్రైవర్ రాజుపై దాడి చేసి.. విచక్షణారహితంగా కత్తితో పొడిచారు. అంతే రాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
మర్రిపాలెం (విశాఖ ఉత్తరం) / ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమం) : పండుగ పూట పూటుగా మద్యం సేవించిన కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఓ కారు డ్రైవర్‌ను కిరాతకంగా హత్య చేశారు. చిన్నపాటి వివాదం కాస్త పెద్దదిగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో ప్రజలు హడలిపోయారు. భయంతో పరుగులు తీశారు.
ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం... మర్రిపాలెం ప్రధాన రహదారిలోని మద్యం దుకాణం వద్దకు రాత్రి 8 గంటల సమయంలో బైక్ మీద ఇద్దరు యువకులు వచ్చారు. మద్యం సేవించి తమతో ఎవరైనా కొట్లాటకు వస్తారా అంటూ హడావిడి చేశారు. జేబులోని కత్తులు చూపించి భయం కలిగించారు. దీంతో అక్కడే ఉన్న కొందరు అడ్డుపడ్డారు. అనంతరం ఆ ఇద్దరి యువకులకూ దేహశుద్ధి చేయడంతో బైక్‌తో ఉడాయించారు.
మళ్లీ వచ్చి బీభత్సం
స్థానికులు దేహశుద్ధి చేయడంతో వెళ్లిపోయిన ఇద్దరు యువకులూ మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చారు. తమ మీద చేయి చేసిన వారి అంతు చూస్తామంటూ బీభత్సం సృష్టించారు. అదే సమయంలో మర్రిపాలెం మహారాణి వీధికి చెందిన కారు డ్రైవర్ కోశెట్టి రాజు(30) వారిని వారించే ప్రయత్నం చేశాడు. అప్పటికే రెచ్చిపోయిన వారంతా మారణాయుధాలతో రాజు మీద దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. దీంతో రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం వారంతా పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రాత్రి విధులలో ఉన్న వెస్ట్ ఏసీపీ ఎల్.అర్జున్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
తలకు గాయంతో ఫిర్యాదు
తన మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని వినయ్ అనే యువకుడు ఎయిర్పోర్ట్ పోలీసులకు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అయితే కారు డ్రైవర్ రాజు హత్య కేసులో వినయ్ ప్రమేయం ఉందన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు రాజు మీద కత్తులతో దాడికి పాల్పడింది వినయ్, అతని స్నేహితులు అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
ఊహించని పరిణామం!
ఇంటి నుంచి బయటకు వచ్చిన కారు డ్రైవర్ రాజు నిమిషాల వ్యవధిలో హత్యకు గురయ్యాడు. అప్పటి వరకూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన రాజు మృతి చెందాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు బిత్తరపోయారు. రక్తపు మడుగులలో ఉన్న రాజు మృతదేహం చూసి బోరున విలపించారు. మృతుడు రాజుకి భార్య స్వర్ణ కుమారి(22), కుమార్తె గాయిత్రి(5), కుమారుడు హర్షవర్థన్(3) ఉన్నారు.
పోలీసులలో ఉత్కంఠ...
శుక్రవారం రాత్రి కంచరపాలెం, ఎయిర్పోర్ట్ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. మర్రిపాలెం, కంచరపాలెంలో హత్యలు జరిగాయని సమాచారం అందడంతో హడలిపోయారు. మర్రిపాలెం రోడ్డులో హత్య జరగడం నిజమని నిర్థారించారు ఎయిర్పోర్ట్ పోలీసులు. అదే సమయంలో జ్ఞానాపురం రైల్వేస్టేషన్ పార్కింగ్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాట జరిగింది. కొట్లాటలో ఒక వ్యక్తి మృతి చెందాడని సమాచారం అందడంతో మరో హత్య అంటూ పుకారు నెలకొంది. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు గాయాలతో ఉన్నట్టు తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
మద్యం షాపు వద్ద వివాదమే కారణం!
మర్రిపాలెంలో మద్యం దుకాణం వద్ద వివాదంతో దాడి జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. తొలుత ఇద్దరు యువకులు వీరంగం చేయడంతో కొందరు అడ్డుపడి బుద్ధి చెప్పారు. దీంతో రెచ్చిపోయిన ఆ ఇద్దరు స్నేహితులతో మరలా వచ్చి హత్యకు పాల్పడినట్టు పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. చిన్నపాటి వివాదం మద్యం మత్తులో హత్యకు దారి తీసినట్టు భావిస్తున్నారు.