Aussie
-
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో వార్నర్
బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాదిపాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో సెయింట్ లూసియా స్టార్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని సెయింట్ లూసియా జట్టు మేనేజర్ మొహమ్మద్ ఖాన్ స్పష్టం చేశాడు. ‘వార్నర్ ఒక దిగ్గజ ఆటగాడు. అతని రాకతో డ్రెస్సింగ్ రూమ్‌తో పాటు మైదానంలోనూ మా జట్టు పటిష్టంగా మారుతుంది. మేం సీపీఎల్ టైటిల్ గెలిచేందుకు వార్నర్ కీలకంగా వ్యవహరిస్తాడు’అని ఆయన అన్నారు. -
ఆసీస్‌తో ఆఖరి ఆట
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ త్వరలోనే ఆటకు టాటా చెప్పనున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని మోర్కెల్ సోమవారం ప్రకటించాడు. ‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. అయితే వీడ్కోలుకు ఇదే సరైన సమయం. ఇకపై క్రికెట్‌లేని జీవితాన్ని కొత్తగా ఆస్వాదిస్తా. నాకో మంచి కుటుంబం ఉంది. నేను, నా విదేశీ భార్య అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ బడలికల నుంచి విముక్తులమవుతున్నాం. క్రికెట్ భారాన్ని దించేసి వ్యక్తిగత జీవితంలో ముందడుగు వేయదల్చుకున్నా’ అని 33 ఏళ్ల మోర్కెల్ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. ప్రొటీస్ జెర్సీ ధరించి ఎన్నో మధుర క్షణాలను అనుభవించానని... దక్షిణాఫ్రికాకు ఆడిన ప్రతీ మ్యాచ్‌ను, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించినట్లు తెలిపాడు. ‘నా క్రికెట్ ప్రయాణంలో సఫారీ బోర్డు, జట్టు సహచరులు, కుటుంబసభ్యులు, మిత్రులు ఎంతో తోడ్పాటు అందించారు. నాలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. దాన్ని ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో ఉపయోగిస్తా. జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’అని అన్నాడు. 2006లో డర్బన్‌లో భారత్‌తో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన మోర్కెల్ 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 529 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 117 మ్యాచ్‌లాడి 188 వికెట్లు తీశాడు. టి20ల్లో 44 మ్యాచ్‌లాడి 47 వికెట్లు పడగొట్టాడు. టెస్టు కెరీర్లో 83 మ్యాచ్‌లాడి 294 వికెట్లు చేజిక్కించుకున్నాడు. 2009లో ప్రధాన పేసర్ మఖాయ ఎన్తిని రిటైర్మెంట్ తర్వాత జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మోర్కెల్‌ను ఈసారి వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. -
కలివికోడిని చూసేందుకు వచ్చా... ఇంగ్లాండ్ దేశస్తుడు షాన్ కోయల్
సిద్దవటం: ప్రపంచంలోని కొన్ని అరుదైన ప్రదేశాలు, పక్షులను చూసేందుకు వచ్చానని ఇంగ్లాండ్ దేశానికి చెందిన షాన్కోయల్ తెలిపారు. లంకమల్ల అడవుల్లో అరుదైన పక్షి అయిన కలివికోడిని చూడాలని ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో ఆయన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఓబులేస్తో ఆదివారం మాట్లాడారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తాను స్కాట్లాండులో పక్షుల శాస్త్రవేత్తగా పని చేస్తున్నానన్నారు. పక్షులను చూసేందుకు ఇంగ్లాండ్ నుంచి ఫిబ్రవరి 21న బయలుదేరానని చెప్పారు. మాంచిస్టర్, కొలంబో ప్రాంతాలను మార్చి 2 వరకు చూశానన్నారు. తర్వాత ఇండియాలోని కేరళ, కర్ణాటక, ఊటీ, పూణెను చూసి.. తిరుపతి, కడప, బద్వేలు, సిద్దవటం ప్రాంతాలకు చేరుకున్నానని చెప్పారు. ఇప్పటి వరకు 330 రకాల పక్షులను చూశానన్నారు. ఇండియన్ వెబ్సైట్లో చూసి ఇక్కడ అరుదైన పక్షి కలివికోడిని చూడటానికి వచ్చానని పేర్కొన్నారు. అనంతరం ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో ఆల్బమ్ పరిశీలించారు.